2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేయాలి | payment should base on 2013 land aquisation act only says sabithareddy | Sakshi
Sakshi News home page

2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేయాలి

Published Sat, Aug 6 2016 9:22 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

payment should base on 2013 land aquisation act only says sabithareddy

కందుకూరు:
ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూములను 2013 చట్టం ప్రకారం తీసుకోవాలని మాజీ హోంమంత్రి సబితారెడ్డి ప్రభుత్వం డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మండలంలోని ముచ్చర్లలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఆ గ్రామ పరిధిలోని ఊట్లపల్లిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్‌రాంరెడ్డి, రాములు అధ్యక్షతన ఫార్మా రైతులతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో మొదట ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తే అక్కడి ప్రజలు తరమికొట్టడంతోనే ఇక్కడికి మార్చారన్నారు. భూమిని నమ్ముకుని బతికే వారికి అన్యాయం జరగకుండా భూసేకరణ చట్టాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ చట్టం ప్రకారం పట్టా, అసైన్‌‌డ అనే తేడా లేకుండా మార్కెట్ ధరకు మూడు రెట్లు పరిహారం ఇవ్వాలని, రైతు కూలీలు, చేతి వృత్తుల వాళ్లకు భుక్తి కోసం అదనంగా పరిహారం అందించేలా చట్టం ఉందన్నారు. రూ.30 లక్షలు ఇవ్వాల్సి చోట కేవలం రూ.8 లక్షలే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్నారు. మల్లన్నసాగర్‌లో దౌర్జన్యంగా భూములు తీసుకుంటూ రైతుల అంగీకారంతోనే తీసుకుంటున్నట్లు హరీష్‌రావు చెబుతున్నారని విమర్శించారు.


ఇక్కడ చేపట్టిన జీఓ 45పై కోర్టుకు వెళ్తామన్నారు. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు లేకుండా ఎందుకు భూములు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేలా జిల్లాలో ఫార్మాసిటీకి ఎక్కడ భూములు తీసుకుంటున్నా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు అంబయ్యయాదవ్, జిల్లా ప్లానింగ్ కమిటీ మాజీ సభ్యుడు బొక్క జంగారెడ్డి, కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణనాయక్, పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు ప్రసూన, మహేశ్వరం ఎంపీపీ స్నేహ, వైస్ ఎంపీపీ స్వప్న, జల్‌పల్లి మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘుమారెడ్డి, చిర్ర సారుు లు, దర్శన్‌రెడ్డి, శివమూర్తి, పాండుగౌడ్, బాబయ్య, కమాల్‌ఖాన్, వీరారెడ్డి, రాణాప్రతాప్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, రాజు, రాజేష్, వెంకట్‌రాంరెడ్డి, రాములు, ఎంపీటీసీలు ఉన్ని వెంకటయ్య, సత్త య్య తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement