land aquisation
-
ఆ భూములు రైతులకు అప్పగింత
రాయ్‌పూర్ : ఎన్నికల హామీలను నెరవేర్చడంలో భాగంగా చత్తీస్‌గఢ్‌లో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణాల మాఫీ ప్రకటించగా, ఇతర హామీల అమలుపైనా కసరత్తు సాగిస్తోంది. టాటా స్టీల్ ప్రాజెక్టు కోసం బస్తర్‌లో గిరిజన రైతుల నుంచి సేకరించిన భూములను తిరిగి వారికి అప్పగించే ప్రక్రియను ప్రారంభించాలని సీఎం భూపేష్ బాగేల్ యోచిస్తున్నారు. భూసేకరణ జరిగిన ఐదేళ్లలోగా ప్రాజెక్టులు ప్రారంభించని చోట ఆయా భూములను తిరిగి సొంతదారులకు అప్పగిస్తామని కాంగ్రెస్ పార్టీ చత్తీస్‌గఢ్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఈ క్రమంలో టాటా స్టీల్ ప్రాజెక్టు సైతం ముందుకు కదలకపోవడంతో ఈ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములను ఆయా రైతులకు అప్పగించే ప్రక్రియను చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించి తదుపరి కేబినెట్ సమావేశంలోగా తనకు కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ అధికారులకు సూచించినట్టు సమాచారం. 2005లో అప్పటి బీజేపీ ప్రభుత్వం బస్తర్ జిల్లాలోని లోహన్దిగుడ ప్రాంతంలో రూ 19,500 కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం టాటా స్టీల్‌తో ఒప్పందంపై సంతకాలు చేసింది. ప్రాజెక్టు కోసం గిరిజనుల నుంచి భూ సేకరణ ప్రక్రియ 2008లో ప్రారంభమైంది. మొత్తం పదిగ్రామాల నుంచి 1764 హెక్టార్ల భూమిని ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం సేకరించింది. ఇక భూసేకరణపై వివాదం నెలకొనడంతో 1707 మంది రైతులకు గాను 1165 మంది రైతులు తమకు ప్రభుత్వం చెల్లించే పరిహారాన్ని అంగీకరించారు. మిగిలిన రైతుల పరిహారాన్ని రెవిన్యూ డిపాజిట్ ఫండ్ వద్ద ప్రభుత్వం జమ చేసింది. ఇక 2016లో ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోకముందే ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు టాటా స్టీల్ ప్రకటించింది. భూసేకరణలో జాప్యం, మావోయిస్టుల బెదిరింపులు వంటి పలు కారణాలు చూపుతూ ప్రాజెక్టు నుంచి విరమించుకుంటున్నట్టు ఆ కంపెనీ పేర్కొంది. కాగా సేకరించిన భూమిని తిరిగి సొంతదారులకు అప్పగించాలని అప్పట్లో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
అక్రమ భూసేకరణలో చంద్రబాబు దాదాగిరి
సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ కాలిన్ గాన్‌సాల్వెజ్ విమర్శ ⇒ అక్రమ భూసేకరణపై సీఎంను ప్రజలు నిలదీయాలి ⇒ సింగూరుపై సుప్రీం తీర్పు ఏపీ, తెలంగాణలకు గుణపాఠం ⇒ చట్టం స్ఫూర్తిని నీరుగారుస్తున్నారు: జస్టిస్ లక్ష్మణరెడ్డి సాక్షి, హైదరాబాద్: రైతాంగం హక్కులను తుంగలోతొక్కి, రాజధాని పేరుతో అక్రమ భూసేకరణలో ఏపీ సీఎం చంద్రబాబు దాదా గిరీ చేస్తున్నారని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్, హ్యూమన్ రైట్స్ లా నెట్ వర్క్ వ్యవస్థాపకుడు కాలిన్ గాన్‌సాల్వెజ్ విమర్శించారు. బలవంతపు భూసేకరణపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను ప్రజలు నిలదీయాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకచోట రాజధాని, మరో చోట ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ పేదల రక్తతర్పణతో జరుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ, మానవ హక్కుల వేదిక, హెల్ప్ డెస్క్ సంయుక్తాధ్వర్యంలో ఏపీ, తెలంగాణల్లో ‘మానవహక్కులు– చట్టాలు’ అనే అంశంపై హైదరాబాద్‌లో ఒక రోజు సదస్సుని హ్యూమన్ రైట్స్ లా నెట్వర్క్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కాలి న్ గాన్‌సాల్వెజ్ కీలకోపన్యాసం చేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల సీఎంలకు సింగూరు భూసేకరణపై సుప్రీంకోర్టు జస్టిస్ గోపాల్‌గౌడ్ ఇచ్చిన తీర్పు గుణపాఠం అవుతుందన్నారు. మణిపూర్, కశ్మీర్‌లలో సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టం పేరుతో 1,300 మందిని పోలీసులు కాల్చిచంపారని, ఇకపై ఖాకీ దుస్తుల్లో పోలీసులు చేసే చట్టవ్యతిరేక పనులను కోర్టు అనుమతించదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందన్నారు. ఆదివాసీల భూములకు ఎసరు.. మానవ హక్కుల వేదిక రెండు రాష్ట్రాల అధ్యక్షుడు జీవన్ మాట్లాడుతూ.. 2003లో ఛత్తీస్‌గఢ్‌లో సల్వాజుడుం దాడులకారణంగా ప్రాణాలరచేతిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లోకి వలస వచ్చిన 30 వేల మంది ఆదివాసీలు ఏ హక్కులూ లేకుండా బతుకుతున్నారన్నారు. గోండ్వానా సంక్షేమ పరిషత్ నాయకుడు సొండి వీర య్య మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆదివాసీల భూములన్నీ ఆదివాసీయేతరుల చేతుల్లోకి వెళ్లిపోయాయన్నారు. పోలవరంలో సాదాబైనామీ పేరుతో ఆదివాసీల భూములకు ఎసరుపెట్టారన్నారు. అమరావతి భూనిర్వాసితులు, భూములు కోల్పోయిన రైతుల పక్షాన పోరాడుతున్న అడ్వొకేట్ సిరిపురపు ఫ్రాన్సిస్, గాంధీ, కాకినాడ సెజ్‌లకు వ్యతిరేకంగా పోరా డుతున్న నారాయణస్వామి తదితరులు ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. సాగు భూములు తీసుకోకూడదు.. కార్యక్రమంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ భూములు తీసుకోకూడదన్న కనీస నియమాన్ని సైతం పాటించకుండా, 2013 భూ సేకరణ చట్టం స్ఫూర్తిని తెలుగు రాష్ట్రాల్లో నీరుగారుస్తున్నారని అన్నారు. రైతుల హక్కులను హరించే ఏ చర్యఅయినా ప్రజలకు చేటు చేస్తుందని, పొలాల్లో నిర్మాణాలు రైతుల అంగీకారం లేనిదే జరపరాదన్న నియమాన్ని అతిక్రమించడం తగదని హితవు పలికారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. అసలు భూ సేకరణ అవసరమా లేదా? అవసరమయితే ఎంత? అనేది కూడా తేలకుండానే భూదందాలకు పాల్పడటం ప్రభుత్వాలకు సరికాదన్నారు. -
2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేయాలి
కందుకూరు: ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూములను 2013 చట్టం ప్రకారం తీసుకోవాలని మాజీ హోంమంత్రి సబితారెడ్డి ప్రభుత్వం డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మండలంలోని ముచ్చర్లలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఆ గ్రామ పరిధిలోని ఊట్లపల్లిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్రాంరెడ్డి, రాములు అధ్యక్షతన ఫార్మా రైతులతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో మొదట ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తే అక్కడి ప్రజలు తరమికొట్టడంతోనే ఇక్కడికి మార్చారన్నారు. భూమిని నమ్ముకుని బతికే వారికి అన్యాయం జరగకుండా భూసేకరణ చట్టాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ చట్టం ప్రకారం పట్టా, అసైన్డ అనే తేడా లేకుండా మార్కెట్ ధరకు మూడు రెట్లు పరిహారం ఇవ్వాలని, రైతు కూలీలు, చేతి వృత్తుల వాళ్లకు భుక్తి కోసం అదనంగా పరిహారం అందించేలా చట్టం ఉందన్నారు. రూ.30 లక్షలు ఇవ్వాల్సి చోట కేవలం రూ.8 లక్షలే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్నారు. మల్లన్నసాగర్లో దౌర్జన్యంగా భూములు తీసుకుంటూ రైతుల అంగీకారంతోనే తీసుకుంటున్నట్లు హరీష్‌రావు చెబుతున్నారని విమర్శించారు. ఇక్కడ చేపట్టిన జీఓ 45పై కోర్టుకు వెళ్తామన్నారు. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు లేకుండా ఎందుకు భూములు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేలా జిల్లాలో ఫార్మాసిటీకి ఎక్కడ భూములు తీసుకుంటున్నా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు అంబయ్యయాదవ్, జిల్లా ప్లానింగ్ కమిటీ మాజీ సభ్యుడు బొక్క జంగారెడ్డి, కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణనాయక్, పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు ప్రసూన, మహేశ్వరం ఎంపీపీ స్నేహ, వైస్ ఎంపీపీ స్వప్న, జల్పల్లి మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘుమారెడ్డి, చిర్ర సారుు లు, దర్శన్‌రెడ్డి, శివమూర్తి, పాండుగౌడ్, బాబయ్య, కమాల్‌ఖాన్, వీరారెడ్డి, రాణాప్రతాప్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, రాజు, రాజేష్, వెంకట్రాంరెడ్డి, రాములు, ఎంపీటీసీలు ఉన్ని వెంకటయ్య, సత్త య్య తదితరులు పాల్గొన్నారు.