మహేశ్వరం: మండలంలో పలు అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. మాజీ హోంమంత్రి సబితారెడ్డి గతంలో మంజూరు చేసిన పలు అభివృద్ధి పనులు నిధులు కొరత, స్థల సేకరణలో జాప్యంతో ముందుకు సాగడం లేదు. ప్రధానంగా 2012లో ఇందిరమ్మ బాట కార్యక్రమంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.8 కోట్ల అంచనా వ్యయంతో మండల కేంద్రంలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు.
అలాగే మండల కేంద్రంలో రూ.6 కోట్ల నిధులతో ఆర్టీసీ డిపో, రూ.76 లక్షలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల, రూ.55 లక్షలతో ఫైర్‌స్టేషన్, రూ.65 లక్షలతో తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనం తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ పనులకు గతంలో కొన్ని నిధులు మంజూరయ్యాయి. అయితే 2014లో ప్రభుత్వం మారినప్పటినుంచి వీటికి నిధులు మంజూరు కాకపోవడంతో అభివృద్ధి పనులన్ని అర్ధంతరంగా ఆగిపోయాయి. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే తమ కష్టాలు తీరుతాయని భావించిన మండల ప్రజలు ప్రస్తుత పరిస్థితులతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
బంక్ లేక ఆగిన డిపో పనులు
మండల కేంద్రంలోని కేసీ తండా సమీపంలో సర్వే నెంబరు 306లో మాజీ హోంమంత్రి సబితారెడ్డి అప్పట్లో రూ.6 కోట్ల నిధులతో ఆర్టీసీ బస్ డిపో పనులకు శంకుస్థాపన చేశారు. పనులు 90 శాతం పూర్తయ్యాయి. అయితే డి పోలో డీజిల్ ట్యాంకు పనులు అసంపూర్తిగా ఉ న్నాయి. దీంతో ఇక్కడినుంచి బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల రాష్ట్ర, రోడ్డు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఈ డిపోను పరిశీలించారు. 2015లో డిపో నుంచి బస్సులు నడిపించేలా చర్యలు తీసుకుంటానన్నారు.
అద్దె భవనంలో అగ్నిమాపక కేంద్రం
సబితారెడ్డి రూ.55ల క్షలు మంజూరు చేయించి మండలకేంద్రంలో ఫైర్ స్టేషన్‌కు అప్పట్లో శిలాఫలకం వేశారు. స్థలం ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విడుదలైన నిధులు తెలంగాణ ప్రభుత్వంలో నిలిచిపోయాయయి. ప్రస్తుతం ఎంపీడీఓ కార్యాలయం ముందు అద్దె భవనంలో ఫైర్ స్టేషన్ కొనసాగుతోంది.
నిర్మాణానికి నోచుకొని జూనియర్ కళాశాల
మండల కేంద్రంలోని భారత్ పెట్రోల్‌బంకు పక్కన అప్పటి కేంద్రమంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి,సబితారెడ్డిలు కలిసి రూ.76 లక్షల అంచనా వ్యయంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్థలం ఉన్నా కొత్త ప్రభుత్వంలో నిధులు నిలిచిపోయాయి. నిధులు రాగానే పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో జూనియర్ కళాశాల కొనసాగుతోంది.
100 పడకల ఆస్పత్రికి స్థలం కొరత
మండల కేంద్రంలోని పాత ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో రూ.8 కోట్ల అంచనా వ్యయంతో అప్పటి సీఎం ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాటకు వచ్చి 100 పడకల ఆస్పత్రి పనులకు శంకుస్థాపన చేశారు. ప నులకు టెండర్ పక్రియ పూర్తయింది. స్థలం లేదని అధికారులు పనులను నిలిపివేశారు. ప్రస్తు తం స్థలం చూపిస్తే ఆస్పత్రి పనులను ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.
అర్ధంతరంగా ఆగిపోయాయి..!
Published Wed, Nov 26 2014 12:20 AM | Last Updated on Thu, Sep 13 2018 5:11 PM
Advertisement