వెంకయ్యకు పెద్ద పరీక్షే: చంద్రబాబు
- ఆయన రాజకీయాలు మాట్లాడకుండా కంట్రోల్‌గా ఉండాలి
- ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు అభినందనలు
సాక్షి, అమరావతి : గలగలా రాజకీయాలు మాట్లాడే వెంకయ్యనాయుడికి ఉపరాష్ట్రపతిగా రాజకీయాలు మాట్లాడకుండా ఉండటం పెద్ద పరీక్షని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆయన జీవనం మొత్తం రాజకీయమేనని, దానితో ఇప్పటికిప్పుడు వెంటనే తెగతెంపులు చేసుకోవాలంటే కష్టమేనన్నారు. ఆ పరీక్షలో ఆయన పాసవుతారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం రాత్రి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడికి ఫోన్‌చేసి హృదయ పూర్వక అభినందనలు తెలిపినట్లు చెప్పారు.
ఆయన్ను ఎంపిక చేసిన ప్రధానికి, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలకు అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందా అని ప్రశ్నించగా... అభివృద్ధిలో నష్టం ఉంటుందనుకోనని, కానీ రాజకీయాల్లో ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో కొందరు సరిగా ఓటు వేయకపోవడంపై స్పందిస్తూ... తమ పార్టీ వారికి నాలుగైదు సార్లు అవగాహన కల్పించానని, వారు అక్కడికెళ్లి ఏంచేశారో తనకు తెలియదన్నారు. ఎమ్మెల్యేలు ఓటు వేయలేకపోవడం రాష్ట్రానికే అవమానమన్నారు.
శ్రీలంకలో ఏపీ ఇండస్ట్రియల్ పార్కు పెడతాం: ఫార్మా, టూరిజం, హార్టికల్చర్ రంగాల్లో కలిసి పనిచేయాలని శ్రీలంక, ఏపీ నిర్ణయించాయి. తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి 600 ఎకరాల్లో ఏపీ కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నట్లు శ్రీలంక ప్రకటించింది. శ్రీలంక నుంచి వచ్చిన పారిశ్రామిక ప్రతినిధుల బృందం సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.