సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ లాంటి హామీల కంటే నిరంతర విద్యుత్ ఇవ్వడం ప్రయోజనకరమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) సంస్థ హైదరాబాద్‌లో ‘క్లీన్ అండ్ సేఫ్ న్యూక్లియర్ పవర్ జనరేషన్’ అంశంపై తలపెట్టిన మూడ్రోజుల అంతర్జాతీయ సదస్సును వెంకయ్యనాయుడు బుధవారం ప్రారంభించి ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతర విద్యుదుత్పత్తిపై కాకుండా, ఉచిత విద్యుత్ మీద దృష్టి పెడుతున్నాయని, అది మంచిది కాదన్నారు. నాణ్యమైన, నిరంతర విద్యుత్‌తోనే ప్రజలకు మేలు అని వెంకయ్య అన్నారు.
అభివృద్ధికి విద్యుత్ అవసరం
దేశంలో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోం దని వెంకయ్య తెలిపారు. వేగంగా సాగుతున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ దృష్ట్యా స్థిరమైన అభివృద్ధి సాధించేందుకు, సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరముందన్నారు. ప్రమాదకరమైన గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించేందుకు, అంతర్జాతీయ సమాజం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు అణుశక్తిని పెంచుకోవాలన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువ ఖర్చుతో లభించే అణుశక్తిని సమర్థమైన శక్తి వనరుగా ఉపయోగించుకోవాలని చెప్పారు. ప్రస్తుతం అణుశక్తి కర్మాగారాలు చౌకగా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. కూడంకులం అణువిద్యుత్ యూనిట్–1 ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్ ధర యూనిట్‌కి రూ.3 ఉంటుందని తెలిపారు. భారత్‌లో అణుశక్తి అభివృద్ధిలో డాక్టర్ హోమి జే బాబా కృషి ఎంతో ఉందన్నారు. ఆయన నిర్దేశించిన విధానంలో దేశం బలమైన 3 దశల అణు విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తూ అద్భుతమైన పురోగతి సాధించిందని, తక్కువ ధర లో స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు.
ప్రజా ఉద్యమంగా స్వచ్ఛ భారత్..
ప్రస్తుతం దేశంలో స్వచ్ఛభారత్ ప్రభుత్వ కార్యక్రమం స్థాయి నుంచి ప్రజా ఉద్యమంగా మారిందని వెంకయ్య చెప్పారు. ఈ విషయంలో ప్రజలకు మరింత అవగాహనను పెంపొందిచడంలో శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు కృషి చేయాలని సూచించారు. ఆరోగ్యవంతమైన భారత్ ఆర్థికంగానూ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దేశంలో పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీర్ఘకాలంలో మనమంతా ప్రకృతితో ఆడుకున్నామని, ఇప్పుడు ప్రకృతి మనతో ఆడుకుంటోందన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోవటం మనందరి బాధ్యతని అన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారత ప్రభుత్వ మాజీ ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారు ఆర్.చిదంబరం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అధ్యక్షుడు శిశిర్ కుమార్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత విద్యుత్ సరికాదు..
Published Thu, Oct 4 2018 5:37 AM | Last Updated on Thu, Oct 4 2018 6:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment