
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వేతనాలు భారీగా పెరిగాయి. రాష్ట్రపతి వేతనం నెలకు రూ.5 లక్షలకు, ఉపరాష్ట్రపతి వేతనం నెలకు రూ.4 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే గవర్నర్ల వేతనం రూ.3.5 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రపతికి నెలకు రూ.1.50 లక్షలు, ఉపరాష్ట్రపతికి 1.25 లక్షలు, గవర్నర్లకు రూ.1.10 లక్షల చొప్పున జీతాలు చెల్లిస్తున్నారు. ఈ వేతనాల పెంపును బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ..వారి జీతభత్యాలు చివరిసారి 2006 జనవరి 1న పెరిగిన సంగతిని గుర్తుచేశారు. రెండేళ్ల క్రితం ఏడో వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చినప్పటి నుంచి కేబినెట్ కార్యదర్శి, ఇతర కార్యదర్శులు రాష్ట్రపతి కన్నా ఎక్కువ వేతనాలు పొందుతున్న సంగతి తెలిసిందే.
ఎంపీలకు డబుల్ ధమాకా...
ఎంపీల మూల వేతనాలు రెట్టింపు కానున్నాయి. వచ్చే ఏప్రిల్ 1 నుంచి వారి మూలవేతనాన్ని ప్రస్తుతమున్న రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచుతూ తాజా బడ్జెట్‌లో జైట్లీ ప్రతిపాదించారు. వారికిచ్చే ఇతర భత్యాలను కూడా పెంచనున్నారు. ద్రవ్యోల్బణం ఆధారంగా ఐదేళ్లకోసారి ఎంపీల వేతనాలు, భత్యాలను ఆటోమేటిక్‌గా సవరించేందుకు కూడా జైట్లీ కొత్త చట్టాన్ని ప్రతిపాదించారు. ఎంపీల వేతనాల పెంపుపై ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతులు విమర్శలకు దారితీస్తున్నాయని అన్నారు. అందుకే వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఎంపీల వేతనాలు, నియోజకవర్గాల భత్యం, కార్యాలయాల ఖర్చులు, సమావేశాల భత్యాలను సవరించే విధానాల్లో మార్పులు తెస్తున్నట్లు ప్రకటించారు.