‘పుర’పై పట్టు ఎవరిదో?
సాక్షిప్రతినిధి, నల్లగొండ :మున్సిపల్ రాజకీయం వేడెక్కింది. మరోరోజు గడిస్తే, మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎవరికి వారు ఆ పదవులు దక్కించుకునేందుకు క్యాంపులు నెరపుతున్నారు. కాంగ్రెస్‌కు క్లియర్ మెజారిటీ ఉన్న నల్లగొండలాంటి చోట కూడా కౌన్సిలర్లను క్యాంప్‌నకు తరలించారు. హుజూర్‌నగర్, దేవరకొండ నగర పంచాయతీల్లో ఎలాంటి క్యాంప్‌లు లేకున్నా, అక్కడ మెజారిటీ సాధించిన కాంగ్రెస్‌లోనే పదవుల కోసం పోటీ ఏర్పడింది. మిర్యాలగూడ మున్సిపాలిటీలో సైతం కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ ఉంది. ఇక, మిగిలినచోట్ల మున్సిపల్ రాజకీయం రంజుగా మారింది. కాగా, చైర్మన్ పదవులు ఆశించి క్యాంపులు నిర్వహిస్తున్న నేతలకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. మరోవైపు అధికార టీఆర్‌ఎస్ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తన సొంత నియోజకవర్గమైన సూర్యాపేటపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు.
నల్లగొండ మున్సిపాలిటీలో 40 వార్డులు ఉండగా, మొన్నటి ఎన్నికల్లో 22 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. టీఆర్‌ఎస్ - 2, బీజేపీ - 4, టీడీపీ - 4, ఎంఐఎం - 3, సీపీఎం - 2, స్వతంత్రులు 3 స్థానాల్లో గెలుపొందారు. చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలంటే 21మంది సభ్యులు అవసరం. ఈ లెక్కన ఎవరి మద్దతు లేకుండానే కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులు దక్కించుకునే మెజార్టీ ఉంది. కానీ ముందునుంచీ చైర్మన్ అభ్యర్థిగా ప్రచారం పొందిన గుమ్ముల జానకి ఓడిపోవడంతో కాంగ్రెస్‌లో కయ్యం మొదలైంది. చైర్‌పర్సన్ పదవి కోసం ఎవరికి వారే ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా 12వ వార్డు కౌన్సిలర్ ముదిరెడ్డి కళావతి పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. మారిన సమీకరణాలు ఆమెకు ఇబ్బందికరంగా మారాయి. ఒకవిధంగా ఆమెకు పీఆర్‌టీయూ నేతల కోటలో కౌన్సిలర్ టికెట్ ఇచ్చారు. ఆమెకు వెన్నుదన్నుగా ఉన్న పీఆర్‌టీయూ నేత, ఎమ్మెల్సీ పూల రవీందర్ టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆమెను పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. దీంతో 8వ వార్డు కౌన్సిలర్ బొడ్డుపల్లి లక్ష్మికి అవకాశం దక్కొచ్చన్నది కాంగ్రెస్ వర్గాల సమాచారం. కాగా, వైస్‌చైర్మన్‌గా 38వ వార్డు కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డిని ఎన్నుకునేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.
ఇందులో ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా, కాంగ్రెస్ కౌన్సిలర్లంతా హైదరాబాద్‌లో క్యాంప్ పెట్టినట్లు సమాచారం. కాగా కాంగ్రెస్‌లో అసంతృప్త కౌన్సిలర్లను తమవైపు తిప్పుకుని చైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకోవడానికి విపక్షాలు ఎత్తుగడలు వేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి కనీసం ఐదుగురు కౌన్సిలర్లను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయని సమాచారం. ఇండిపెండెంటుగా పోటీ చేసి గెలిచి, టీఆర్‌ఎస్‌లో చేరిన మెరుగు కౌసల్యను చైర్‌పర్సన్‌ను చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్‌కు చైర్‌పర్సన్ పదవి దక్కకుండా చేయాలని విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి.
భువనగిరి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి బీజేపీ- కాంగ్రెస్ కూటములు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. రెండు పార్టీలు తమ మద్దతుదారులతో కలిసి క్యాంపులకు తరలిపోయాయి. 30 వార్డులున్న మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు- 8, బీజేపీకి - 8, టీడీపీకి -7, ఇండిపెండెంట్లకు -6, సీపీఎం 1 స్థానంలో విజయం సాధించాయి. మున్సిపాలిటీలో విజయం సాధించడానికి ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. దీంతో బీజేపీ టీడీపీతో అవగాహన కుదుర్చుకుంది. మొదటి రెండున్నర సంవత్సరాలు బీజేపీ, తర్వాత రెండున్నర సంవత్సరాలు టీడీపీ చైర్‌పర్సన్ పదవి తీసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నాయి. దీంతో బీజేపీ, టీడీపీ కౌన్సిలర్‌లతో పాటు ఒక ఇండిపెండెంట్, ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ క్యాంపునకు తరలారు. కాంగ్రెస్ తనకున్న ఏడుగురు సభ్యులతోపాటు ఐదుగురు ఇండిపెండెంట్లతో కలిసి క్యాంపునకు తరలిపోయారు.
సూర్యాపేట మున్సిపాలిటీలో 34 వార్డులున్నాయి.
అందులో టీడీపీ, సీపీఎం మిత్రపక్షంగా, టీఆర్‌ఎస్, సీపీఐ మిత్రపక్షంగా, బీజేపీ, కాంగ్రెస్‌లు ఒంటరిగా వేర్వేరుగా పోటీచేశాయి. టీడీపీ-12 , కాంగ్రెస్ -9, టీఆర్‌ఎస్ -4, బీజేపీ -4, సీపీఎం 2-, సీపీఐ- 1, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. ఇటీవల ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ, ఇద్దరు స్వతంత్ర కౌన్సిలర్లు మంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో టీఆర్‌ఎస్ బలం 10కి పెరిగింది. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని టీఆర్‌ఎస్ కైవసం చేసుకునేందుకు మంత్రి పెద్దఎత్తున వ్యూహరచన చేస్తున్నారు. కాగా టీడీపీలో మిగిలిన 10 మంది కౌన్సిలర్లు ఆంధ్ర ప్రాంతానికి, టీఆర్‌ఎస్, కొంతమంది కాంగ్రెస్ కౌన్సిలర్లు హైదరాబాద్‌కు వెళ్లి క్యాంపుల్లో ఉన్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సోమవారం సూర్యాపేటలో అభ్యర్థులతో సమావేశం నిర్వహించగా కేవలం ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు.
కాంగ్రెస్‌లో ఉన్న కొంతమంది కౌన్సిలర్లు టీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన క్యాంపులో ఉన్నట్లు సమాచారం. బీజేపీ, సీపీఎం, సీపీఐ కౌన్సిలర్లు ఎలాంటి క్యాంపులకు వెళ్లకుండా తటస్థంగా ఉన్నారు. టీడీపీ-10, బీజేపీ-04, సీపీఎం-02 మొత్తం 16 మందితో పాటు టీడీపీ విప్ జారీ చేస్తే టీఆర్‌ఎస్‌లో చేరిన ఇద్దరు కూడా తమకే ఓటు వేయాల్సి వస్తుందని టీడీపీ ధీమాగా ఉంది. దీంతో టీడీపీ చైర్‌పర్సన్, బీజేపీ వైస్ చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. కోదాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయం నడుపుతోంది. ఆ పార్టీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు, ఒక ఇండిపెండెంట్‌తో కలిసి జూన్ 27న గోవాకు వెళ్లారు. ముగ్గరు కౌన్సిలర్లు మాత్రం కోదాడలోనే ఉన్నారు. తెలుగుదేశానికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా వీరికి జతకూడినట్లు సమాచారం.
వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ అజ్ఞాతంలోకి వెళ్లారు.
మిర్యాలగూడ మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఎలాంటి క్యాంప్ నిర్వహించడం లేదు. మొత్తం 36వార్డులకుగాను 30 వార్డులు కాంగ్రెస్ గెలవగా, ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా పార్టీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బలం 31కి చేరింది. బీజేపీ ఒకటి, టీఆర్‌ఎస్ రెండు, సీపీఎం రెండు వార్డుల్లో గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి సునాయాసంగా చైర్‌పర్సన్ పదవి దక్కేఅవకాశాలు ఉన్నాయి.