సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో అరాచక శక్తులు పెరిగిపోయాయని బీజేపీ నేతలు దినేష్ రెడ్డి, సుధీష్ రాంబొట్ల విమర్శలు గుప్పించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ పాలనపై నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావును గృహ నిర్బంధం చేయడమే కాకుండా ఆయనను పరామర్శించేందుకు వెళ్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను రోడ్డుపైనే నిర్బంధించడం బాధాకరమని దినేష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పై అధికారులు చెప్పడం వల్లనే కన్నాను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. ఆయన పట్ల అమర్యాదగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు.
ముళ్లపూడి బాపిరాజుతో బహిరంగ చర్చకు వెళ్తున్న మాజీ మంత్రి మాణిక్యాల రావును నిర్బంధించాల్సిన అవసరమేంటని సుధీష్ రాంబొట్ల ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక మాజీ మంత్రికే ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే... ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకున్న సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ సభలకు వెళ్లిన వారిని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారనీ, రేషన్ కార్డులను తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెడితే మంచదని హితవు పలికారు. ఆంద్రప్రదేశ్‌కు సాయం చేసేందుకు కేంద్ర సర్కారు సిద్ధంగా ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment