కోవూరు: నియోజకవర్గంలో పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, దినేష్‌రెడ్డి ఆధిపత్యానికి టీడీపీ అధిష్టానం క్రమంగా కత్తెరేస్తోంది. ఈ పరిస్థితుల్లో తమ పయనమెటో తేల్చుకోలేక అగమ్యగోచర స్థితిలో వీరు కొట్టుమిట్టాడుతున్నారు. వాస్తవానికి కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న వీరు పార్టీ అధినేత చంద్రబాబును కలిసి మాట్లాడొచ్చారు. ఇది జరిగిన రెండు రోజులకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అనే పదవిని దినేష్‌రెడ్డికి కట్టబెట్టారు.
24 గంటల్లోనే మరో ఝలక్
ఇది జరిగి 24 గంటలు కాక ముందే కోవూరు టీడీపీ అభ్యర్థి గెలుపు బాధ్యతలను నియోజకవర్గంతో సంబంధంలేని వ్యక్తికి అప్పజెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో ఇటీవలే చేరిన నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్‌కు ఈ బాధ్యతను అప్పగించి తండ్రీకొడుకులను పద్ధతిగా పక్కనబెట్టారు. నియోజకవర్గంలో పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రూప్‌కుమార్‌యాదవ్‌ను వీరు ఇక సంప్రదించక తప్పదు. తండ్రీకొడుకులపై నమ్మకం లేకే టీడీపీ ఈ నిర్ణయానికి వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
పోలంరెడ్డి పయనమెటో..?
ప్రస్తుత పరిణామాలతో పోలంరెడ్డి నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయంగా వేమిరెడ్డి బలపడితే ఇక తమకు ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఉండదని, ఈ తరుణంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని పోలంరెడ్డిపై అనుచరులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. కేడర్ ఒత్తిడితో పాటు అధిష్టాన వైఖరితో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని అనుచరులతో చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment