సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేయడం ఆ పార్టీలో కలకలం రేపింది. మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కలయిక నేపథ్యంలో రెండు రోజులుగా సోము వీర్రాజునుద్దేశించి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు.
‘పొత్తులో ఉన్న జనసేనతో సమన్వయంలో మా రాష్ట్ర నాయకత్వం విఫలమైంది. గతంలో ఇలాంటి పార్టీ విషయాలపై రెండు నెలలకోసారి అందరమూ కూర్చొని మాట్లాడే వాళ్లం. ఇప్పుడు సోము వీర్రాజు ఒక్కరే ఇవన్నీ చూస్తున్నారు. ఎవరితోనూ చర్చించడంలేదు. చివరకు కోర్ కమిటీలో కూడా చర్చకు రావడంలేదు. అసలు పార్టీలో ఏం జరుగుతోందో మాకు తెలియడంలేదు’ అని వ్యాఖ్యానించారు. పవన్‌తో సమన్వయ లోపాన్ని పార్టీ అధిష్ఠానం గుర్తించిందని, ఆ బాధ్యతను జాతీయ నాయకుడు మురళీధరన్‌కు అప్పగించినట్లు తెలిసిందని చెప్పారు.
అయితే, 2024 ఎన్నికల వరకు సోము వీర్రాజే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని అధిష్ఠానం స్పష్టం చేసిందని.. అందువల్లే ఆసంతృప్తితో కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సోము వీర్రాజు మద్దతుదారులు అంటున్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ దేవధర్ కూడా రాష్ట్రంలో సోము వీర్రాజు నాయకత్వంలోనే పార్టీ వచ్చే ఎన్నికలకు వెళ్లబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. మరోవైపు.. పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కన్నా కొట్టిపారేస్తున్నారు. తాను బీజేపీలో చేరిన నాటి నుంచి ఇలాంటి ప్రచారమే జరుగుతోందని అన్నారు. బుధవారం తాను ఎలాంటి కార్యకర్తల సమావేశం నిర్వహించలేదని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.
ఢిల్లీకి వెళ్లిన సోము వీర్రాజు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి. బుధవారం సాయంత్రం వీర్రాజు ఢిల్లీ నుంచి రాగానే గన్నవరం ఎయిర్‌పోర్టులో విలేకరుల సమావేశంలో మాట్లాడతారని పార్టీలో ప్రచారం జరిగింది. అయితే, ఆయన విజయవాడకు రాలేదు. నేరుగా బెంగళూరుకు వెళ్లారని పార్టీ నాయకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment