sudeesh rambotla
-
‘బీజేపీ సభలకు వెళ్తే రేషన్ కట్ చేస్తారా’
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో అరాచక శక్తులు పెరిగిపోయాయని బీజేపీ నేతలు దినేష్ రెడ్డి, సుధీష్ రాంబొట్ల విమర్శలు గుప్పించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ పాలనపై నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావును గృహ నిర్బంధం చేయడమే కాకుండా ఆయనను పరామర్శించేందుకు వెళ్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను రోడ్డుపైనే నిర్బంధించడం బాధాకరమని దినేష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పై అధికారులు చెప్పడం వల్లనే కన్నాను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. ఆయన పట్ల అమర్యాదగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ముళ్లపూడి బాపిరాజుతో బహిరంగ చర్చకు వెళ్తున్న మాజీ మంత్రి మాణిక్యాల రావును నిర్బంధించాల్సిన అవసరమేంటని సుధీష్ రాంబొట్ల ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక మాజీ మంత్రికే ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే... ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకున్న సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ సభలకు వెళ్లిన వారిని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారనీ, రేషన్ కార్డులను తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెడితే మంచదని హితవు పలికారు. ఆంద్రప్రదేశ్‌కు సాయం చేసేందుకు కేంద్ర సర్కారు సిద్ధంగా ఉందని అన్నారు. -
''హెచ్‌సీయూ' వెనుక విదేశీ హస్తం ఉంది!'
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య తర్వాత జరుగుతున్న ఆందోళనల వెనుక విదేశీ శక్తులున్నాయని బీజేపీ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్య బాధాకరమని, ఆయన కుటుంబానికి తమ పార్టీ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతుందన్నారు. అయితే ఈ సంఘటనను రాజకీయం చేస్తూ బీజేపీని అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని గురువారమిక్కడ మీడియాతో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయాలకు ఇదే పెద్ద నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ 8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారిలో 1.35 లక్షల మంది భారతీయులు ఉంటున్నారని, వారందరి కుటుంబాలను కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నేతలు పరామర్శిస్తున్నారా? అని ప్రశ్నించారు. తన ఆత్మహత్యను రాజకీయం చేయవద్దని రోహిత్ తన అంతిమ లేఖలో రాస్తే రాజకీయ పార్టీలు మాత్రం ఆయన చివరి కోర్కెను కూడా తీర్చడం లేదని ఎద్దేవా చేశారు. ఈ సంఘటనకు ప్రపంచ వ్యాపిత మద్దతు కావాలని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ప్రస్తుత అల్లర్ల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉన్నట్టు అర్థమవుతుందన్నారు. భారతీయ సంస్కృతిని చిన్నాభిన్నం చేయడమే ఈ శక్తుల ఉద్దేశంగా అభివర్ణించారు. ఈ విద్యార్ధి చనిపోవడానికి వేరే కారణాలు ఉన్నాయని, వాటిని కనుగొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీలకు ఎటువంటి సంబంధం లేదన్నారు. రోహిత్ కేసు తర్వాత పది మంది ప్రొఫెసర్లు రాజీనామా చేయడం కూడా బీజేపీని బదనాం చేయాలన్న కుట్రలో భాగమేనన్నారు. -
మద్యం మత్తులో బీజేపీ నేత డ్రైవర్ వీరంగం
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ బీజేపీ నేత డ్రైవర్ వీరంగం చేశాడు. మద్యం మత్తులో కారు నడుపుతూ స్కూటరిస్టులను ఢీకొనడమే కాకుండా, వారిపై చేయి చేసుకున్న డ్రై వర్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్-2 లోని సాగర్ సొసైటీలో నివసించే బీజేపీ నేత సుధీశ్ రాంబొట్ల డ్రైవర్ రామకృష్ణ మంగళవారం మధ్యాహ్నం ఇన్నోవా కారును మితిమీరిన వేగంతో నడుపుతూ ఎదురుగా ఉన్న స్కూటరిస్టును ఢీకొట్టాడు. ఈ ఘటనలో సురేష్‌యాదవ్, సంతోష్ అనే ఇద్దరు యువకులు గాయపడ్డారు. ఇదేంటని వారు అడగ్గా నన్నే ప్రశ్నిస్తావా అంటూ రామకృష్ణ వారిపై దాడికి దిగాడు. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రామకృష్ణను పోలీసులు అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ కారుపై ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ అనే పేరుతో స్టికర్ కూడా ఉన్నట్లు పోలీసులు గమనించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.