''హెచ్సీయూ' వెనుక విదేశీ హస్తం ఉంది!' | sudhish rambotla targets congress and othr partys | Sakshi
Sakshi News home page

''హెచ్సీయూ' వెనుక విదేశీ హస్తం ఉంది!'

Published Thu, Jan 21 2016 9:50 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

''హెచ్సీయూ' వెనుక విదేశీ హస్తం ఉంది!' - Sakshi

''హెచ్సీయూ' వెనుక విదేశీ హస్తం ఉంది!'

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య తర్వాత జరుగుతున్న ఆందోళనల వెనుక విదేశీ శక్తులున్నాయని బీజేపీ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్య బాధాకరమని, ఆయన కుటుంబానికి తమ పార్టీ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతుందన్నారు. అయితే ఈ సంఘటనను రాజకీయం చేస్తూ బీజేపీని అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని గురువారమిక్కడ మీడియాతో చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయాలకు ఇదే పెద్ద నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ 8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారిలో 1.35 లక్షల మంది భారతీయులు ఉంటున్నారని, వారందరి కుటుంబాలను కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నేతలు పరామర్శిస్తున్నారా? అని ప్రశ్నించారు. తన ఆత్మహత్యను రాజకీయం చేయవద్దని రోహిత్ తన అంతిమ లేఖలో రాస్తే రాజకీయ పార్టీలు మాత్రం ఆయన చివరి కోర్కెను కూడా తీర్చడం లేదని ఎద్దేవా చేశారు. ఈ సంఘటనకు ప్రపంచ వ్యాపిత మద్దతు కావాలని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ప్రస్తుత అల్లర్ల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉన్నట్టు అర్థమవుతుందన్నారు.

భారతీయ సంస్కృతిని చిన్నాభిన్నం చేయడమే ఈ శక్తుల ఉద్దేశంగా అభివర్ణించారు. ఈ విద్యార్ధి చనిపోవడానికి వేరే కారణాలు ఉన్నాయని, వాటిని కనుగొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీలకు ఎటువంటి సంబంధం లేదన్నారు. రోహిత్ కేసు తర్వాత పది మంది ప్రొఫెసర్లు రాజీనామా చేయడం కూడా బీజేపీని బదనాం చేయాలన్న కుట్రలో భాగమేనన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement