rohith suicide
-
హెచ్‌సీయూలో పరిస్థితి చక్కబెట్టేందుకు కమిటీ
హైదరాబాద్: హెచ్‌సీయూలో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులు చక్కదిద్దేందుకు యూనివర్సిటీ స్థాయి కమిటీని వేశారు. రోహిత్ ఆత్మహత్య ఘటన అనంతరం కొనసాగుతున్న ఆందోళనను విరమింపజేసి తిరిగి యధాస్థితికి తెచ్చేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో తెలియజేసేందుకు ప్రొఫెసర్ కామయ్య చైర్మన్ గా ఏడుగురితో కమిటీని వేశారు. ఈ నెల 24న నిర్వహించిన సమావేశంలో కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఈ నెల 26న వీసీ ఆమోద ముద్ర వేశారు. అయితే, దీనిపై మాత్రం రిజిస్ట్రార్ సంతకం ఉంది. ఈ కమిటీలో సభ్యులుగా ఎవరున్నారంటే.. 1. ప్రొఫెసర్ బీ కామయ్య, డీన్, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (కమిటీ చైర్మన్) 2. ప్రొఫెసర్ జీ సుదర్శనం(పొలికల్ సైన్స్) 3. ప్రొఫెసర్ చంద్రశేఖర్ రావు(సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ హెడ్) 4. ప్రొఫెసర్ ఎన్ సుధాకర్ రావ, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఆంత్రోపాలజీ 5. ప్రొఫెసర్ సరత్ జ్యోత్స్న రాణి, డిపార్ట్ మెంట్ తెలుగు 6. ప్రొఫెసర్ మీనా హరిహరణ్ (సెంటర్ ఫర్ హెల్త్ సైకాలజీ హెడ్) 7. డాక్టర్ నియాజ్ అహ్మద్, బయో టెక్నాలజీ, బయో ఇన్‌ఫార్మటిక్ హెడ్. వీరంతా విద్యార్థి నాయకులతో, జేఏసీ నాయకులతో చర్చించి వారి ప్రధాన డిమాండ్లు ఏమిటో తెలుసుకుంటారు. అనంతరం పరిష్కార మార్గాలు సూచిస్తారు. -
ఉద్దేశపూర్వకంగానే విద్యార్థులపై దాడి
♦ హెచ్‌సీయూ ఘటనలపై ఢిల్లీకి చెందిన నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ♦ వీసీ అప్పారావు విద్యార్థులను రెచ్చగొట్టారు ♦ ఏబీవీపీ విద్యార్థులతో కలసి పోలీసులను రప్పించారు ♦ పోలీసులతో కలసి విచ్చలవిడిగా దాడికి పాల్పడ్డారు ♦ ఈ ఘటనలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూలో వీసీ అప్పారావు ఉద్దేశపూర్వకంగానే విద్యార్థులను రెచ్చగొట్టి, పోలీసులతో దాడికి పాల్పడ్డారని ఢిల్లీకి చెందిన స్వతంత్ర నిజ నిర్ధారణ కమిటీ అభిప్రాయపడింది. రోహిత్ ఆత్మహత్యకు కారకులైనవారిని తీవ్రంగా శిక్షించాలని... వర్సిటీలో శాంతి నెలకొనాలంటే వీసీ అప్పారావును క్యాంపస్‌లోకి అనుమతించవద్దని పేర్కొంది. ఢిల్లీకి చెందిన వివిధ సంఘాలతో కూడిన నిజ నిర్ధారణ కమిటీ తన మధ్యంతర నివేదికను శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విడుదల చేసింది. హెచ్‌సీయూలో భావప్రకటనా స్వేచ్ఛకు, సమీకరణ స్వేచ్ఛకు, ప్రశ్నించే స్వేచ్ఛకు భంగం కలిగించడం ద్వారా అప్పారావు, ఆయన అనుచరులు, పోలీసులు హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆ నివేదికలో పేర్కొంది. 22వ తేదీన వీసీ అప్పారావు తనకు అనుకూలురైన కొందరు అధ్యాపకులు, 30 మంది ఏబీవీపీ విద్యార్థులతో కలసి పోలీసులను రప్పించి వ్యూహాత్మకంగానే విద్యార్థులపై దాడి చేయించినట్లు ఆరోపించింది. విద్యార్థినులని కూడా చూడకుండా పోలీసులు దుర్భాషలాడుతూ కొట్టారని, అత్యాచారం చేస్తామంటూ భయభ్రాంతులకు గురిచేశారని పలువురు విద్యార్థినులు చెప్పారని పేర్కొంది. నిర్బంధించిన విద్యార్థులను సైతం పోలీసు వాహనాల్లో విపరీతంగా కొట్టారని తెలిపింది. పోలీసుల దాడిలో గాయపడి, ఆసుపత్రిపాలైన ఉదయభాను చెప్పిన విషయాల్లో పోలీసుల క్రూరత్వం బట్టబయలైందని నివేదికలో పేర్కొంది. ఇప్పటికీ కూడా క్యాంపస్‌లోని విద్యార్థులు భయాందోళన నుంచి తేరుకోలేదని వెల్లడించింది. ఈ నెల 22న హెచ్‌సీయూలో జరిగిన ఘటనలపై న్యాయ విచారణ జరిపించాలని... అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని, వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని కమిటీ డిమాండ్ చేసింది. హ్యూమన్‌రైట్స్ డిఫెండర్ అలర్ట్ ఇండియా ెహ న్రీ, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తారారావు, ఇంటర్నేషనల్ మూవ్మెంట్ అగెనైస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ నుంచి బర్నార్డ్ ఫాతిమా, కఫిర్ నల్గుండ్వార్ రౌండ్ టేబుల్ ఇండియా నుంచి కెరుబా మునిస్వామి, సుప్రీంకోర్టు లాయర్ బీనా పల్లికల్, నేషనల్ క్యాంపెయిన్ ఆన్ దళిత్ హ్యూమన్ రైట్స్ నుంచి రమేష్నాథన్, నేషనల్ దళిత్ మూవ్మెంట్ ఫర్ దళిత్ రైట్స్ నుంచి అశోక్ కొత్వాల్, ఆలిండియా దళిత్ మహిళా అధికార్ మంచ్, ఆసియా దళిత్ రైట్స్ ఫోరం నుంచి పాల్ దివకార్ తదితరులు ఈ నిజనిర్ధారణ కమిటీలో ఉన్నారు. -
'ఇది సిరియానా.. పాకిస్థానా? మాకెందుకు చెప్పరు?'
తిరువనంతపురం: హెచ్‌సీయూలో జరుగుతున్న సంఘటనలపట్ల కేరళలో అసంతృప్తి చెలరేగింది. తమ కుమారుడిని అరెస్టుల చేసి కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని హెచ్‌సీయూలో చదువుతున్న ఓ విద్యార్థి తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మనమేం సిరియాలో ఉండటం లేదు. పాకిస్థాన్‌లో ఉండటం లేదు. అరెస్టు చేసినప్పుడు ఆ సమాచారం తల్లిదండ్రులు తెలియజేయడం పోలీసుల కనీస బాధ్యత' అని ఆమె పేర్కొంది. రోహిత్ ఆత్మహత్య ఘటన తర్వాత హెచ్‌సీయూలో రోజుకో పరిణామం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వారం ప్రారంభంలో హెచ్‌సీయూలో పాలక వర్గంపై నిరసనగా ధర్నా చేస్తున్న విద్యార్థుల్లో దాదాపు 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అందులో తమ కుమారుడు కూడా ఉన్నాడని సోషల్ మీడియా ద్వారా తెలిసిందని, పోలీసులు ఉండి కూడా తమకు ఈవిధంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. తమకు అధికారికంగా చెప్పకూడదా అంటూ ఏడ్చేశారు. పోలీసులుగానీ, యూనివర్సిటీ అధికారులు గానీ తమకు సమాచారం ఇవ్వలేదని వాపోయారు. గత మంగళవారం మాట్లాడిన తమ కుమారుడు ఇప్పటి వరకు ఏమై పోయాడో తెలియలేదని, ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుందని, తల్లిదండ్రులుగా తామెంత ఆందోళన చెంది ఉంటామో అర్థం చేసుకోలేరా అని ఆమె ప్రశ్నించారు. ఇదేం, సిరియా, పాకిస్థాన్ కాదుగా అని నిలదీశారు. -
వీసీని వెనక్కి పిలవాలన్న వీహెచ్
వరంగల్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ అప్పారావును వెంటనే రీకాల్ చేయాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. హన్మకొండలోని డీసీసీ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీలో శాంతిభ్రదతలు లేకపోవడం వల్ల విద్యార్థుల మధ్య బేధాభిప్రాయాలు తలెత్తుతున్నాయని, వీసీ అప్పారావు లాంటి వారు కొందరికి మద్దతు ఇవ్వడం వల్లే యూనివర్సిటీలో గొడవలు చెలరేగుతున్నాయన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలు యూనివర్సిటీల్లో కుల రాజకీయాలు నడుపుతున్నాయని, గతంలో ఇలాంటి రాజకీయాల వల్లే నక్సలిజం పుట్టిందన్నారు. మళ్లీ అదే పరిస్థితులు యూనివర్సిటీల్లో నెలకొనే అవకాశాలున్నాయన్నారు. యూనివర్సిటీల్లో శాంతిభద్రతలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాలని, వీసీని రీకాల్ చేసేందుకు కేంద్ర మానవ వనరుల శాఖకు సీఎం లేఖ రాయాలని ఆయన సూచించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, పీసీసీ కార్యదర్శులు ఈవీ.శ్రీనివాసరావు, కట్ల శ్రీను పాల్గొన్నారు. -
పిల్లాడిని రాజకీయాలకు వాడుకుంటారా?
న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్ సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై మరోసారి రాజ్యసభలో దద్దరిల్లింది. ప్రతిపక్షాల తీరుపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రోహిత్ ఆత్మహత్యను రాజకీయ లబ్దికి వాడుకుంటున్నాయని విమర్శించారు. ''పిల్లాడిని రాజకీయాలకు వాడుకుంటారా.. చర్చ పెట్టండి అన్నీ తెలుస్తాయి'' అని మండిపడ్డారు. రోహిత్ వేముల ఆత్మహత్యతో ప్రభుత్వానికి, బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఏఐసీసీ నాయకుడు, రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. రోహిత్ మృతిపై నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్ చేశారు. -
23న హెచ్‌సీయూ విద్యార్థుల చలో ఢిల్లీ
- 11 నుంచి తెలంగాణ, ఏపీల్లో బస్సు యాత్ర - కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన కార్యక్రమాలు హైదరాబాద్: హెచ్‌సీయూలో రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా విద్యార్థులు మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా చలో ఢిల్లీ కార్యక్రమంతోపాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో బస్సు యాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే తొలుత పేర్కొన్నట్లుగా చలో ఢిల్లీని ఈ నెల 20కి బదులుగా 23వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు విద్యార్థి జేఏసీ నాయకులు సోమవారం ప్రకటించారు. దీంతోపాటు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో పలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జేఏసీ కన్వీనర్ వెంకటేశ్ చౌహన్ చెప్పారు. దేశవ్యాప్తంగా కదిలి వచ్చే విద్యార్థులతో మూడు రోజుల పాటు ఆందోళనలు చేపడతామన్నారు. ఇక ఈనెల 11వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బస్సు యాత్ర చేపడతామని తెలిపారు. ఈ యాత్రలో భాగంగా వారం రోజుల పాటు ఉస్మానియా, కాకతీయ, మహత్మా గాంధీ, శాతవాహన, తెలంగాణ, ఆంధ్రా, ఎస్వీ, నాగార్జున, పద్మావతి, జేఎన్టీయూ, ద్రావిడ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలతో పాటు ప్రధాన విద్యాసంస్థలకు వెళ్లనున్నట్లు చెప్పారు. రిలే దీక్షలలో బిహార్ విద్యార్థులు రోహిత్ ఘటనకు సంఘీభావంగా హెచ్‌సీయూలో బిహార్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్నారు. ఈ విద్యార్థులకు ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకులు, మధ్యప్రదేశ్ గిరిజన సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. దీక్షలో జిక్రుల్లాఖాన్, విషాల్ కుమార్, జితేంద్ర కుమార్, కుమార్ సౌరభ్, ఆశుతోష్ పాండే, ఫైజుల్ ఇస్లాం, మృత్యుంజయ్ పాండే, దివాకర్ ఉపాధ్యాయ తదితరులు పాల్గొన్నారు. -
రోహిత్ ఓ మేధావి: పవన్ కల్యాణ్
హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్య తనకు బాధను కలిగించిందని ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అతడు దళితుడా మరింకేదైనా కులానికి చెందినవాడా అని కాకుండా ఓ మంచి మేధావి కుల వివక్షకారణంగా చనిపోయాడని చెప్పారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష ఉందని చెప్పారు. ప్రొఫెసర్లే స్వయంగా కుల విహార యాత్రలకు తీసుకెళుతుంటారని, చిన్ననాటి నుంచే తాను ఇలాంటివి చూస్తున్నానని చెప్పారు. | రోహిత్ ఆత్మహత్య విషయాన్ని అన్ని పార్టీల నేతలు ఆయా స్థాయిల్లోకి తీసుకెళుతున్నారని, అందుకే, తాను ఆ రాజకీయ నాయకుల్లో కలిసిపోవాలనుకోవడం లేదని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రశ్నించగా ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నందున తాను ఏ విధంగా స్పందిచబోనని చెప్పారు. తునిలో జరిగిన కాపు గర్జన హింసాత్మకంగా మారడంపై పవన్ కల్యాణ్ సోమవారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. -
‘వార్ జోన్’లుగా వర్సిటీలు
మేధావుల వ్యాఖ్య న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల్లో దళిత విద్యార్థుల అంశంపై రాజకీయ దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో.. విద్యాసంస్థలు వార్ జోన్లుగా మారుతున్నాయని మేధావులు ఆవేదన వ్యక్తం చేశారు. గత పది, పదిహేనేళ్లుగా పేద విద్యార్థులు వర్సిటీల్లో చేరి.. భిన్న సైద్ధాంతిక గ్రూపుల మధ్య బలైపోతున్నారని విమర్శించారు. ఢిల్లీలో 40 మంది జాతీయ, అంతర్జాతాయ మేధావులు (మోదీ ప్రభుత్వానికి అనుకూలమని భావిస్తున్నారు) సమావేశమై.. ఇటీవలి కాలంలో వర్సిటీల్లో జరుగుతున్న అంశాలపై చర్చించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత వర్సిటీల్లో నెలకొన్న పరిస్థితులు బయటపడుతున్నాయన్నారు. కొత్త ముద్ర వేసుకున్న ప్రొఫెసర్లు, ప్రభుత్వ యంత్రాంగంలో వారికి సహకరిస్తున్న అధికారుల కబంధ హస్తాల నుంచి విద్యావ్యవస్థను బయటపడేయాలన్నారు. ఐసీహెచ్ఆర్ సభ్యుడు ఎండీ శ్రీనివాస్, సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ సభ్యుడు మధు పూర్ణిమ కిశ్వార్, వివిధ ఐఐటీలు, ఐఐఎంలు, విదేశీ వర్సిటీల ప్రొఫెసర్లు తాము చర్చించిన అంశాలపై ఓ ప్రకటన విడుల చేశారు. వర్సిటీలు, విద్యాసంస్థల్లో కుల వివక్షకు మించి.. విద్యాసంస్థ ప్రాంగణంలో నెలకొంటున్న తీవ్రమైన సైద్ధాంతిక భేదాభిప్రాయాలతోనే.. విద్యా వాతావరణం పాడవుతోందన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలతోనే మొత్తం సంస్థ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. రోహిత్ ఆత్మహత్య మొదటిదేమీ కాదని.. అలాగని, కేంద్రం సరైన చర్యలు తీసుకోకపోతే చివరిది కూడా కాకపోవచ్చని అన్నారు. -
'రోహిత్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే'
భద్రాచలం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ ఆరోపించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో శనివారం గిరిజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక్కరోజు రోహిత్ జాగృతి దీక్షలో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీసీ అప్పారావుకు పదేళ్ల క్రితమే దళిత విద్యార్థులను వేధించిన చరిత్ర ఉందన్నారు. మరోసారి దళిత విద్యార్థులను యూనివర్సిటీ నుంచి బహిష్కరించి, రోహిత్ మరణానికి కారణమయ్యారన్నారు. కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరాని పదేపదే యూనివర్సిటీ అధికారులపై ఒత్తిడి తెచ్చి దళిత విద్యార్థులను బహిష్కరించి రోహిత్ చనిపోయే దాకా వేధించారని కృష్ణ అన్నారు. కేంద్ర మంత్రులిద్దరినీ బర్తరఫ్ చేయాలన్నారు. వీసీ అప్పారావును ఉద్యోగం నుంచి తొలగించి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సోందె వీరయ్య, ముర్రం వీరభద్రం, సోడె చలపతి తదితరులు పాల్గొన్నారు. -
'రోహిత్ ఘటన మా పరిధిలోకి రాదు'
హైదరాబాద్: హెచ్‌సీయూలో స్కాలర్ విద్యార్థి రోహిత్ ఆత్యహత్య ఘటన తమ పరిధిలోకి రాదని దానికి సంబంధించి కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హెచ్‌సీయూలో ఘటనలో తలదూర్చి చేతులు కాల్చుకోదల్చుకోవడం లేదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ ఘటనపై సీబీసీఐడీ విచారణకు సిఫారసు చేశామన్నారు. అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం ఎదురు చూస్తున్నామన్నారు. -
హెచ్‌సీయూలో రాహుల్ దీక్ష
♦ విద్యార్థులకు మద్దతుగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం ♦ మధ్యాహ్నం వరకు దీక్షలో రాహుల్... ♦ హెచ్‌సీయూలో కొవ్వొత్తుల ర్యాలీ సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూలో విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్షకు సంఘీభావంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దీక్షలో కూర్చున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హెచ్సీయూకు చేరుకున్న ఆయన రోహిత్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. రోహిత్ తల్లి రాధికను, సోదరుడు, సోదరిలను పరామర్శించి దీక్ష ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నం వరకూ దీక్ష కొనసాగనుంది. అంతకుముందు రోహిత్‌కు నివాళిగా వర్సిటీలో విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రోహిత్ కుటుంబ సభ్యులు, సహచర విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్‌గాంధీ శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. హెచ్‌సీయూలో విద్యార్థులు ఆందోళన చేస్తున్న వెలివాడ ప్రాంగణానికి చేరుకొని రోహిత్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడే ఉన్న రోహిత్ తల్లి రాధిక, సోదరుడు, సోదరిలతో మాట్లాడారు. సస్పెండైన విద్యార్థులు విజయ్, శేషయ్య, సుంకన్నతో పాటు విశాల్‌లు కూర్చున్న ఆమరణ దీక్ష శిబిరానికి చేరుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ తదితరులు ఉన్నారు. అయితే రాహుల్‌గాంధీ యూనివర్సిటీల్లో శవ రాజకీయాలు చేస్తున్నారంటూ ఏబీవీపీ కార్యకర్తలు హెచ్‌సీయూ గేటు వద్ద ఆందోళన చేశారు. వారు రాహుల్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించగా... పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలు ఉధృతం ఇక హెచ్‌సీయూలో విద్యార్థులు తమ నిరసనలను మరింత ఉధృతం చేశారు. శుక్రవారం వర్సిటీలోని పరిపాలనా విభాగాన్ని ముట్టడించారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారందరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిపాలనా విభాగంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బోధనేతర సిబ్బందిని అడ్డుకున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పరిపాలనా కార్యాలయం గేట్లను మూసివేసి నిరసనలు తెలిపారు. విద్యార్థులకు మద్దతుగా రెండో రోజు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ముగ్గురు అధ్యాపకులు పాల్గొన్నారు. సెలవుపై వెళ్లిన ఇన్చార్జి వీసీ ఇన్చార్జి వీసీ పదవి నుంచి విపిన్ శ్రీవాస్తవ వైదొలగాల్సిందేనని విద్యార్థులు భీష్మించడం, ఆందోళనలు ఉధృతం చేయడంతో.. శ్రీవాస్తవ సెలవుపై వెళ్లారు. శ్రీవాస్తవ నాలుగు రోజులపాటు సెలవుపై వెళుతున్నారని, ఆయన స్థానంలో వర్సిటీ ఇన్చార్జి వీసీగా బాధ్యతలను స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ డీన్ ఎం.పెరియస్వామి స్వీకరిస్తారని వర్సిటీ వర్గాలు ప్రకటించాయి. అసలు తన తల్లి అనారోగ్యం కారణంగా ఇన్చార్జి వీసీ శ్రీవాస్తవ నాలుగు రోజుల పాటు సెలవు తీసుకోనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ చెప్పారు. ఆయన తర్వాత సీనియర్ అయిన తమిళనాడుకు చెందిన కెమిస్ట్రీ అధ్యాపకుడు పెరియస్వామికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు అందేవరకు ఆయన ఇన్చార్జి వీసీగా కొనసాగుతారని తెలిపారు. సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి యత్నం రోహిత్ ఆత్మహత్యకు కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్థి నాయకులు సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు. ఓయూ విద్యార్థి జేఏసీ ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో వామపక్ష, దళిత విద్యార్థి సంఘాలు క్యాంపస్‌లోని ఆర్ట్స్ కళాశాల నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. వారిని పోలీసులు నిలువరించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పలువురు విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఏఐఎస్ఎఫ్ ఓయూ నాయకులు సీఎం క్యాంపు ఆఫీసును ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అరెస్ట్ చేసి పంజగుట్ట పీఎస్‌కు తరలించారు. కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు హెచ్సీయూకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రావడానికి నిరసనగా శనివారం రాష్ట్రవాప్తంగా కళాశాలల బంద్‌కు ఏబీవీపీ రాష్ట్ర విభాగం పిలుపునిచ్చింది. రాహుల్ రాకకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలలతోపాటు వర్సిటీల బంద్ చేపడుతున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ చెన్నకృష్ణారెడ్డి చెప్పారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: నారాయణ హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై రిటైర్డ్ జడ్జితో వేసిన ఏకసభ్య కమిషన్‌తో కాకుండా... సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. రిటైర్డ్ జడ్జి విచారణలో రోహిత్‌కు న్యాయం జరగదని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలు పదవిలో ఉండగా రోహిత్ ఆత్మహత్యపై నిష్పక్షపాత విచారణ జరగదని... అందుకే వారు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నేడు రోహిత్ విగ్రహావిష్కరణ రోహిత్ పుట్టినరోజును పురస్క రించుకుని శనివారం (30వ తేదీన) హెచ్‌సీయూలో ఆయన విగ్రహాన్ని ఆవిష్క రించాలని విద్యార్థి జేఏసీ నాయకులు నిర్ణయించారు. కేరళ ఫైన్ఆర్ట్స్ విద్యార్థులు అనిల్, సందీప్‌లు రోహిత్ విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. -
సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడి, ఆందోళన
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థి సంఘాల నేతలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఓయూ విద్యార్థులు ర్యాలీగా తరలివచ్చి కార్యాలయంలోకి దూసుకువచ్చారు. పోలీసులు వారిని అడ్డుకుని దాదాపు 30 మందిని అదుపులోకి తీసుకుని అంబర్పేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వేణు నేతృత్వంలో తరలివచ్చిన విద్యార్థులు సీఎం కార్యాలయం ముందు ఆందోళనకు యత్నించారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పంజాగుట్ట స్టేషన్‌కు తీసుకెళ్లారు. అరెస్టు అయిన వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన
నాగార్జున యూనివర్సిటీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ కు మద్దతుగా గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు బుధవారం బంద్ పాటిస్తున్నారు. రోహిత్ ఆత్మహత్య ఘటనకు నిరసనగా విద్యార్థి జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. ఉద్యోగులను విధులకు హాజరుకాకుండా అడ్డుకున్నారు. -
మరోసారి ఉద్రిక్తంగా ఉస్మానియా
హైదరాబాద్: ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ కు మద్దతుగా దండుగా కదిలింది. రోహిత్ కుటుంబానికి న్యాయం జరగాలి, కేంద్రమంత్రి దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, హెచ్ సీయూ వీసీ అప్పారావును తొలగించాలనే నినాదాలతో ఓయూ విద్యార్థులు ముందుకు కదిలారు. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం పాలక భవనం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. భారీ సంఖ్యలో విద్యార్థులు అక్కడికి తరలి రావడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పోలీసుల మధ్య తోపులాట కూడా చోటుచేసుకుంది. కొంతమంది విద్యార్థులను పోలీసులు ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. హెచ్ సీయూలో రోహిత్ ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో హెచ్‌సీయూ జాక్ దేశ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపునందుకునే ఉస్మానియా విద్యార్థులు మరోసారి కదం తొక్కారు. -
'సెంట్రల్ యూనివర్సిటీ ఆర్ఎస్ఎస్ అడ్డా'
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ లకి అడ్డాగా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ధ్వజమెత్తారు. వీసీ అప్పారావు తాను నిమిత్తుడనని చెప్పడమే అందుకు నిదర్శనమన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్టు చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. విద్యార్థి రోహిత్ మరణానికి ఆర్ఎస్ఎస్ కారణమని ఆయన ఆరోపించారు. మృతుడిపై మత తత్వ ముద్ర వేస్తున్నారని తెలిపారు. -
హెచ్‌సీయూ విద్యార్థులకు ఓయూ జేఏసీ మద్దతు
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన నిరసనల కార్యక్రమాలకు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ మద్దతు ప్రకటించింది. ఓయూ జేఏసీ రెండు రోజుల పాటు నిరసన తెలపనుంది. ఆ కార్యక్రమ వివరాలను జేఏసీ నాయకులు శనివారం హైదరాబాద్‌లో వెల్లడించారు. ఈ నెల 25 న హెచ్‌సీయూ ముట్టడితో పాటు 26 న పీపుల్స్ ప్లాజా నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు జేఏసీ తెలిపింది. పీహెచ్డీ విద్యార్థి రోహిత్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో గత వారం రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. -
పశ్చిమగోదావరిలో బంద్ పాక్షికం
ఏలూరు: దళిత సంఘాల జేఏసీ పిలుపు మేరకు పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. దళిత సంఘాల జేఏసీ నాయకులు ఏలూరు బస్టాండ్‌లో బస్సులను అడ్డుకున్నారు. అయితే, దుకాణాలు యథావిధిగానే తెరచుకుంటున్నాయి. బంద్ ప్రభావం పాక్షికంగా ఉంది. తణుకు పట్టణం సహా జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. -
ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలి
-
ఏయూలో కొనసాగుతున్న బంద్
ఏయూ క్యాంపస్: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ మృతికి నిరసనగా ఆంధ్రా యూనివర్సిటీ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు శుక్రవారం బంద్ నిర్వహిస్తున్నాయి. ఎస్ఎఫ్ఐ, మహిళా చేతన, సీఐటీయూ సహా వివిధ సంఘాలు, ప్రొఫెసర్లు, స్కాలర్లు రిజిస్ట్రార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి ఆందోళన చేపట్టారు. వర్సిటీలో మతోన్మాద శక్తులను తరిమికొట్టాలంటూ బీజేపీ, ఏబీవీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
నేనే బాధితుడిని: ఏబీవీపీ అధ్యక్షుడు
సెంట్రల్ వర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్ హైదరాబాద్: హెచ్‌సీయూలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలలో తానే బాధితుడినని... కానీ రాజకీయ పార్టీలు తననే బాధ్యుడిగా చేస్తుండడం ఆవేదనకు గురిచేస్తోందని హెచ్‌సీయూ ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్ పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతడి ఆత్మహత్యకు కొన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నాయన్నారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ లేఖకు, రోహిత్ ఆత్మహత్యకు సంబంధం లేదన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఏబీవీపీ రాష్ట్ర కార్యాలయంలో సుశీల్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. ‘గత ఆగస్ట్ 2న ఉగ్రవాది మెమన్ ఉరితీతకు వ్యతిరేకంగా క్యాంపస్‌లో నమాజ్ చేశారు. అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఎస్ఏ) వాళ్లు ప్రదర్శించిన పోస్టర్లలో ఒక మెమన్ను ఉరితీస్తే ప్రతి ఇంటి నుంచి మరో మెమన్ పుడతాడని రాశారు. దీన్ని నిరసిస్తూ నేను ‘ఏఎస్ఏ గూన్స్’ అని ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. దీంతో ఏఎస్‌ఏకు చెందిన 40 మంది అర్ధరాత్రి వచ్చి రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చి తిట్టుకుంటూ, క్షమాపణలు చెప్పాలంటూ దాడి చేశారు. నాకు రెండు నిమిషాలు సమయం ఇవ్వాలని కోరి పోలీసులకు ఫోన్ చేశాను. కొద్దిసేపటికి వర్సిటీ సెక్యురిటీ వ్యాన్, పోలీసులు రాగా... వ్యాన్‌లో కూర్చున్న తరువాత కూడా కొట్టుకుంటూ తీసుకెళ్లారు. వర్సిటీ సెక్యూరిటీ ఆఫీసుకు తీసుకెళ్లి క్షమాపణ లేఖ రాయించుకున్నారు. అక్కడే సెక్యూరిటీకి చెందిన కంప్యూటర్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి క్షమాపణ పత్రాన్ని అప్లోడ్ కూడా చేశారు. భయాందోళనలో కూరుకుపోయిన నేను.. మా అన్నకు ఫోన్ చేశాను. తాను వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. విషయం తెలుసుకుని మా అమ్మ వర్సిటీలోని వీసీ చాంబర్‌కు వచ్చారు. దాంతో 30-40 మంది ఏఎస్ఏ సభ్యులు అక్కడికి వచ్చి మా అమ్మ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కంప్యూటర్ ఎత్తిపడేశారు. ఈ విషయాలన్నీ వీసీ చాంబర్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి కూడా...’’ అని సుశీల్ చెప్పా రు. అనంతరం ఆ వీడియోలను విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. ఈ ఘటనపై విచారించి ఘటనతో సంబంధమున్న విద్యార్థులను వర్సిటీ సస్పెండ్ చేసిందన్నారు. వర్సిటీలో సస్పెండ్ ఘటనలు కొత్తేమీ కాదని, ఇప్పటివరకు ఏబీవీపీకి చెందిన 35మంది విద్యార్థులను సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం సస్పెండైన వారు సామాజిక బహిష్కరణ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తనను కొట్టిన పది రోజులకు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ఓ విద్యార్థినీ కొట్టారని... ఎస్ఎఫ్ఐనాయకులు సహా అనేకమంది విద్యా ర్థులపై దాడికి దిగుతున్నారన్నారు. క్యాంపస్‌లో దేశ విద్రోహ చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రొఫెసర్లు పాఠాలు చెప్పకుండా దేశ భద్రతకు విఘాతం కలిగించేలా చేస్తున్నారని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యప్ప ఆరోపించారు. -
రోహిత్ మృతిపై ప్రముఖుల వ్యాఖ్యలు
కులాన్ని బట్టి న్యాయం చేస్తారా? ‘‘రోహిత్ విషయంలో కుల ప్రస్తావన ఎందుకొస్తోంది, కులాన్ని బట్టి న్యాయాన్యాయాలను అంచనా వేస్తారా? కులాలకు అతీతంగా జీవించాలన్న స్పృహ ప్రతి ఒక్కరిలో రావాలి. ప్రతిభా పాటవాలు, వ్యక్తిత్వాన్ని బట్టి మాత్రమే మనిషిని అంచనా వేయాలి. ఓట్ల కోసమే పార్టీలు కుల, మత, ప్రాంతాల విభేదాలు సృష్టిస్తున్నాయి. ఎన్ని చట్టాలొచ్చినా వీటిని రూపుమాపలేం. మనిషి ఆలోచనలో మార్పు వస్తేనే అది సాధ్యం. నిజమైన సమానత్వం, సమాజంలో తలెత్తుకు తిరిగే పరిస్థితులను కల్పించాల్సిన బాధ్యత యువతపై ఉంది. తమ ఆవేశాన్ని, ఆలోచనలను కులరహిత సమాజం నిర్మించే దిశగా తీసుకెళ్లాలి. అందరికీ సమాన విద్య అందిన ప్పుడే ఇది సాధ్యం. హెచ్‌సీయూ విద్యార్థుల డిమాండ్లు నెరవేరుతాయని ఆశిస్తున్నా..’’ - లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ సామాజిక న్యాయానికై పోరాడాలి ‘‘సామాజిక న్యాయం జరిగే వరకు విద్యార్థులు ఉద్యమించాలి. సెంట్రల్ వర్సిటీలో ఉన్నత విద్యా ప్రమాణాలు ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ దానికి భిన్నమైన అప్రజాస్వామిక వాతావరణం కనిపిస్తోంది. పేద, దళిత విద్యార్థులు తెలుగు మీడియంలో చదివి సెంట్రల్ వర్సిటీలో సీటు సాధిస్తే విద్యార్థుల జీవితాలను బలిచేయడం సరైంది కాదు.’’ - టీజేఏసీ చైర్మన్ కోదండరాం ‘‘ఏబీవీపీ నాయకులను, వర్సిటీ వీసీని రోహిత్ దోషులుగా నిలబెట్టాడు. రోహిత్ రాసిన సూసైడ్ నోట్ ద్వారా ఇది స్పష్టమవుతోంది. కేంద్రం విశ్వవిద్యాలయాలను కాషాయమయం చేస్తోంది.’’ - విరసం నేత వరవరరావు ‘‘రోహిత్‌ను యాకుబ్ మెమెన్‌తో పోల్చుతూ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లు దారుణం. ఇంత నిర్లజ్జగా వ్యవహరించడం సిగ్గుచేటు. హెచ్‌సీయూలో జరిగిన ఘటనపై తన వైఖరి ఏమిటో ప్రధాని మోదీ వెల్లడించాలి..’’ - తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ రాజకీయ జోక్యం తగదు ‘‘విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల వ్యవహారాల్లో కేంద్ర మంత్రి దత్తాత్రేయ జోక్యం చేసుకుని రాజకీయం చేశారు. స్వతంత్ర ప్రతిపత్తితో కొనసాగే యూనివర్సిటీల ఔన్నత్యం కాపాడేందుకు అందరూ ప్రయత్నించాలి. రోహిత్ ఆత్మహత్యకు వీసీ, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి..’’ - మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ మోదీకి కనిపించడం లేదా? ‘‘కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అంతర్జాతీయ ఉద్యమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కనిపించ డం లేదా? విద్యార్థులు తలుచుకుంటే మీ ప్రభుత్వం కూలిపోతుందని గ్రహించాలి. ప్రపంచంలోనే విద్యార్థుల ఉద్యమాలు విశిష్టమైనవి. వేముల రోహిత్ దేశానికి ఉత్తమ శాస్త్రవేత్త అయ్యేవాడు. మీ ప్రభుత్వమే పొట్టన పెట్టుకుంది..’’ - ప్రజా గాయకుడు గద్దర్ -
వర్సిటీ అధికారుల తీరు వల్లే...
హెచ్‌సీయూలో ఘర్షణలపై గతంలోనే హైకోర్టుకు పోలీసుల నివేదన సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూలోని విద్యార్థి సంఘాలతో, సోషల్ మీడియాతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆ వర్సిటీ విద్యార్థులకు స్పష్టం చేశామని.. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటే తలెత్తే పరిణామాలను కూడా వివరించామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ గతంలోనే హైకోర్టుకు వివరించారు. విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు జరిగిన సమయంలో వర్సిటీ అధికారుల ఉదాసీన వైఖరివల్ల, కఠినంగా వ్యవహరించక పోతుండ టం వల్లే ఆ ఘటనలు పునరావృతం అవుతున్నట్లు విద్యార్థులు చెప్పారన్నారు. దాడికి పాల్పడ్డ వారితో పోలీసులు కుమ్కక్కయ్యారంటూ సుశీల్‌కుమార్ తల్లి చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కోర్టుకు నివేదించారు. మూడు నెలల కిందే..: సుశీల్‌పై దాడి నేపథ్యంలో అతడికి భద్రత కల్పించాలని కోరుతూ తల్లి వినయ హైకోర్టులో గత ఆగస్టు 27న పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు సి.వి.ఆనంద్ అక్టోబర్ 3న కౌంటర్ దాఖలు చేశారు. ‘‘హెచ్‌సీయూలో ఏబీవీపీ, ఏఎస్ఏలు క్రియాశీలక విద్యార్థి సంఘాలు. యాకుబ్ మెమన్ ఉరితీతను నిరసిస్తూ ఏఎస్ఏ ప్రదర్శన నిర్వహించింది. దాన్ని సుశీల్‌కుమార్ వ్యతిరేకించడంతో పాటు ఏఎస్ఏ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఏఎస్ఏ విద్యార్థులు సుశీల్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, క్షమాపణలు చెప్పాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో సుశీల్‌కు, ఏఎస్ఏ విద్యార్థులకు ఘర్షణ జరిగింది. సుశీల్‌కు గాయాలుకాగా ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులకు సమాచారం అందడంతో వారు వచ్చి సుశీల్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దాని ఆధారంగా ప్రశాంత్, రోహిత్ వేముల, విన్సెంట్, శేషు, సుగన్న తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుశీల్‌కు అయిన గాయాలు చిన్నవేననంటూ డాక్టర్లు మెడికల్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోంది’’ అని సి.వి.ఆనంద్ పేర్కొన్నారు. -
వీసీ దొంగచాటుగా ఎందుకొచ్చారు?
అప్పారావు తమ నివాసానికి రావడంపై రోహిత్ తల్లి రాధిక సాక్షి, హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా భద్రతతో హెచ్‌సీయూ వీసీ అప్పారావు తమ ఇంటికి రావడాన్ని రోహిత్ తల్లి రాధిక తీవ్రంగా తప్పుబట్టారు. ఏ తప్పు చేయనప్పుడు అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు. ఆయన యూనివర్సిటీకి ఎందుకు రావడం లేదని నిలదీశారు. తన కుమారుడి మరణానంతరం ఆమె మీడియా ముంగిటకొచ్చి తొలిసారిగా వర్సిటీలో మాట్లాడారు. కుమారుడిని తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. వీసీ తమ నివాసానికి వచ్చి తనతో మాట్లాడడానికి ప్రయత్నించగా... తాను తిరస్కరించినట్లు చెప్పారు. వీసీ ఏం చెప్పాలకున్నా తన కుమారుడి తోటి విద్యార్థుల ఎదుట వర్సిటీలో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వర్సిటీకి రాకున్నా.. తాను వర్సిటికి వెళ్లాక ఫోన్లో విద్యార్థుల నడుమ మాట్లాడాలని సూచించాననన్నారు. తన కుమారుడిని వర్సిటీ నుంచి ఎందుకు బహిష్కరించారో ఇప్పటికీ చెప్పలేదని పేర్కొన్నారు. బహిష్కరించిన సమయంలో కనీస బాధ్యతగా గార్డియన్ అయిన తల్లికి చెప్పాల్సిన అవసరం లేదా? అని నిలదీశారు. ‘‘నా బిడ్డ చేసిన తప్పేమిటో చెప్పాలి. మరో తల్లికి నాలా జరగకూడదు. నా కుమారుడి ఆత్మహత్య వెనుక ఎవరున్నారో తెలియాలి. వారికి శిక్షపడాలి. నా కుమారుడి ఆశయాలు నెరవేరే దాకా దీక్షలో కూర్చుంటా..’ అని రాధిక స్పష్టం చేశారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని, అవసరమైతే ఢిల్లీకైనా వెళతానని చెప్పారు. ఎస్సీయే..: రోహిత్ కులంపై వస్తున్న భిన్న వాదనలను అతని సోదరుడు రాజా కొట్టిపారేశారు. ‘‘మా అన్న మెరిట్ స్టూడెంట్. అతను కులం ఆధారంగా వర్సిటీలో ప్రవేశం పొందలేదు. మెరిట్ ప్రాతిపదికన సీటు సాధించాడు. అందుకు సంబంధించిన సర్టిఫికెట్లు కూడా నేనే అందజేశా. మాది ఎస్సీ సామాజిక వర్గమే. కుల విషయాన్ని పక్కనబెట్టి.. రోహిత్ ఎందుకు చనిపోయారో తేల్చాలి..’’ అని డిమాండ్ చేశారు. తమది నిరుపేద కుటుంబమని, అన్నయ్యే తమకు ఆధారమని పేర్కొన్నారు. ఆయన ఆశయాల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
దేశానికే అవమానకరం
రోహిత్‌ను ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పడం సిగ్గుచేటు: కేజ్రీవాల్ బీజేపీ గూండాగిరీని సహించబోం.. భావ ప్రకటనా స్వేచ్ఛను అణగదొక్కితే దేశం ముందుకు పోదు విద్యార్థుల పట్ల వీసీ నిర్ణయం జాతి వ్యతిరేకం వీసీ, కేంద్ర మంత్రుల మధ్య ఫోన్‌కాల్స్ డేటాను బయటపెట్టాలి విద్యార్థులంతా కలసికట్టుగా పోరాడాలని పిలుపు హెచ్‌సీయూలో దీక్ష చేస్తున్న విద్యార్థులకు ఢిల్లీ సీఎం పరామర్శ సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశానికే అవమానకరమని, అలాంటి మెరిట్ స్టూడెంట్ను గౌరవించాల్సింది పోయి ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పడం సిగ్గుచేటని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. వీసీలుగా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ముద్ర ఉన్నవారిని నియమిస్తూ... యూనివర్సిటీల్లో విద్యార్థులకు వ్యతిరేకంగా బీజేపీ యుద్ధం ప్రారంభించిందని ఆరోపించారు. బీజేపీ గుండాగిరీని సహించేది లేదని, విద్యార్థులంతా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. రోహిత్ మరణానికి కారకులైన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయతో పాటు వీసీ అప్పారావును వెంటనే తొలగించాలని... ఈ ముగ్గురి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను వెల్లడించాలని, వారి ఫోన్ కాల్‌డేటాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాల్లో భావ ప్రకటనా స్వేచ్ఛను అణగదొక్కితే దేశం ముందుకు పోదని... విజ్ఞానం పుట్టేదే వర్సిటీల్లో కాబట్టి విద్యార్థులకు విభిన్న ఆలోచనలు చేసే స్వేచ్ఛనివ్వాలని వ్యాఖ్యానించారు. గురువారం అరవింద్ కేజ్రీవాల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి వెలివాడ శిబిరాన్ని సందర్శించారు. విద్యార్థుల దీక్షకు సంఘీభావం ప్రకటించిన అనంతరం ప్రసంగించారు. నిజానిజాలను నిర్ధారించుకోకుండా విద్యార్థులను సస్పెండ్ చేయడం దారుణమని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అంబేద్కర్ విధానాలు, భావజాలాన్ని చర్చించుకునే వారిపై జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. విద్యార్థుల తప్పేమీ లేదని యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ అథారిటీ స్పష్టం చేసినా... కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ లేఖ రాయడం, దానిపై కేవలం రెండు నెలల వ్యవధిలో కేంద్ర మానవ వనరుల శాఖ ఐదుసార్లు రిమైండర్లు పంపడమేమిటని నిలదీశారు. రోహిత్ వంటి మెరిట్ స్టూడెంట్ను గౌరవించాల్సింది పోయి ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పడం సిగ్గుచేటని... ఇలాంటి దుశ్చర్య దేశానికే అవమానకరమని కేజ్రీవాల్ మండిపడ్డారు. స్మృతి ఇరానీ వ్యాఖ్యలు సిగ్గుచేటు.. దళితులు, దళితేతరుల మధ్య వివాదం కాదని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. వార్డెన్లందరూ దళితులే ఉన్నారని వారే రోహిత్‌ను సస్పెండ్ చేశారని చెప్పడం పచ్చి అబద్దమన్నారు. కులం మీద సర్టిఫికెట్ ఉన్నా సిగ్గులేకుండా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులపై చర్యల విషయంలో మానవ వనరుల శాఖ ఒక నిర్ణయం తీసుకున్నాక... ఇప్పుడు విచారణ జరపడమేమిటని ప్రశ్నించారు. ఏబీవీపీ నేత సుశీల్‌కుమార్‌ను కాపాడడం కోసం బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. యూనివర్సిటీలో సుశీల్‌పై దాడి జరగకపోయినా కట్టుకథలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సుశీల్‌కు దెబ్బలు తగలలేదని, ఘర్షణలు జరగలేదని రిజిస్ట్రార్ స్వయంగా హైకోర్టులో చెప్పారని... పేద దళిత విద్యార్థులను సస్పెండ్ చేస్తే తీవ్రంగా నష్టపోతారని కూడా అఫిడవిట్ పొందుపరిచారని కేజ్రీవాల్ గుర్తుచేశారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా కేంద్రమంత్రులు ఒత్తిడి చేయడం, దానికి వీసీ తలొగ్గి మెరిట్ స్టూడెంట్ను సస్పెండ్ చేయడం దారుణమని విమర్శించారు. ప్రస్తుత వీసీ అప్పారావు చీఫ్ వార్డెన్‌గా ఉన్నప్పుడే అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని, అలాంటి వ్యక్తికి యూనివర్సిటీ బాధ్యతలు అప్పగించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వీసీలుగా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ముద్ర ఉన్నవారినే నియమిస్తూ... దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో విద్యార్థులకు వ్యతిరేకంగా బీజేపీ యుద్ధం ప్రారంభించిందని ఆరోపించారు. బీజేపీ గుండాగిరీని సహించేది లేదని, విద్యార్థులంతా కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీ అన్ని రంగాల్లో విఫలం కేంద్రంలో ఉన్న బీజేపీకి ఎలాంటి ఎజెండా లేదని వారి పరిపాలన ద్వారా అర్థమవుతోందని కేజ్రీవాల్ విమర్శించారు. ‘‘ఏడాదిన్నర కు పైగా వారి పరిపాలన ద్వారా హిందువులతో సహా ఏ ఒక్క వర్గానికీ లబ్ధి చేకూర్చలేదు. వారికి కావాల్సిందల్లా అధికారం, డబ్బు. దానికోసం ఎన్ని డ్రామాలకైనా, ఎంతమందిని మభ్యపెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు..’’ అని పేర్కొన్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై అధికారాన్ని అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ఢిల్లీలో పోలీసు వ్యవస్థ తమ ప్రభుత్వం చేతుల్లో లేకపోవడంతో, వారి చేత అరాచకాలు సృష్టిస్తోందని ఆరోపించారు. అధికారంలో ఉన్న ఒక పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం దేశచరిత్రలో మొదటిసారని పేర్కొన్నారు. -
రోహిత్ మృతిపై రాహుల్ రాజకీయం: వెంకయ్య
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మండిపాటు చెన్నై, సాక్షి ప్రతినిధి: కాంగ్రెస్ పాలన నాటి దారుణాలను పట్టించుకోని రాహుల్‌గాంధీ ఈ రోజు రాష్ట్రానికి వచ్చి రాజకీయాలు చేస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. కన్యాకుమారి పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ 2008 నుంచి2014 వరకు కాంగ్రెస్ హయాంలో తొమ్మిది మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఆ నాడు రాహుల్‌గాంధీ ఏమాత్రం చింతించలేదని విమర్శించారు. ఈ రోజు తగుదునమ్మా అంటూ బాధితులను పరామర్శిస్తూ రాజకీయం చేస్తున్నారన్నారు. సదరు విద్యార్థే తన ఆత్మహత్యకు ఎవరూ కారకులు కాదనే విషయాన్ని సూసైడ్ నోట్లో పేర్కొనడాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. -
ఎన్డీఏలో రోహిత్ లొల్లి
కేంద్ర మంత్రులపై బీజేపీ నేత విమర్శ స్వతంత్ర విచారణకు ఎల్జేపీ డిమాండ్ ప్రధాని క్షమాపణ చెప్పాలన్న కాంగ్రెస్ న్యూఢిల్లీ: రోహిత్ ఆత్మహత్య, తదనంతర పరిణామాలపై అధికార పార్టీలోనూ భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయ ఈ కేసు విషయంలో సరిగా స్పందించలేదని.. రోహిత్ మృతికి వారి తీరే కారణమని బీజేపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు సంజయ్ పాశ్వాన్ విమర్శించారు. ప్రధాని జోక్యం చేసుకుని దీనిపై ఓ ప్రకటన చేయాలన్నారు. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన ఎల్జేపీ కూడా స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఎల్జేపీ ఎంపీ రామచంద్ర పాశ్వాన్ నాయకత్వంలోని ఎల్జేపీ కమిటీ హెచ్‌సీయూలోని విద్యార్థులతో మాట్లాడి నివేదికను పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌కు సమర్పించింది. స్మృతీ, దత్తాత్రేయను మంత్రివర్గం నుంచి తొలగించటంతోపాటు.. ప్రధాన మంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాగా, ఢిల్లీలో ఉన్న సమస్యలను పట్టించుకునేందుకు సమయంలేని కేజ్రీవాల్‌కు హైదరాబాద్ సమస్యలు కనిపించాయా అని ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి అశిష్ సూద్ విమర్శించారు. -
సస్పెన్షన్ ఎత్తివేత
నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేసిన హెచ్‌సీయూ పాలక మండలి పాలనా పదవుల నుంచి తప్పుకున్న 13 మంది ఎస్సీ, ఎస్టీ ప్రొఫెసర్లు.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై మండిపాటు.. విద్యార్థులకు సంఘీభావం ఐదోరోజూ ఆందోళనలతో అట్టుడికిన యూనివర్సిటీ రెండోరోజుకు చేరుకున్న విద్యార్థుల ఆమరణ దీక్ష రోహిత్ కుటుంబానికి 5 కోట్ల పరిహారమివ్వాలని డిమాండ్ విద్యార్థులకు మద్దతు ప్రకటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం, డి.రాజా సాధారణ పరిస్థితులు నెలకొనేలా సహకరించండి: వీసీ సాక్షి, హైదరాబాద్: రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) వెనక్కి తగ్గింది. రోహిత్‌తోపాటు మరో నలుగురు విద్యార్థులపై గతంలో విధించిన సస్పెన్షన్‌ను వర్సిటీ పాలక మండలి ఎత్తివేసింది. గురువారం అత్యవసరంగా సమావేశమైన పాలక మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే విద్యార్థులు మాత్రం శాంతించలేదు. తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైనవారిని శిక్షించాలని, వర్సిటీ వైస్ చాన్స్‌లర్ తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటివరకూ తమ పోరు ఆగబోదని తేల్చిచెప్పారు. తమ ఆందోళనలకు మద్దతుగా దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఈ నెల 25న హెచ్సీయూకు తరలిరానున్నారని వెల్లడించారు. మరోవైపు విద్యార్థులకు సంఘీభావంగా వర్సిటీలో ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన 13 మంది ప్రొఫెసర్లు పాలనాపరమైన పదవుల నుంచి తప్పుకున్నారు. ఉధృతంగా ఆందోళన: రోహిత్ ఆత్మహత్యకు కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వర్సిటీలో ఐదోరోజూ ఆందోళనలు న్నంటాయి. వర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. గురువారం వివిధ రాజకీయ పక్షాల ముఖ్య నేతలు వర్సిటీకి వచ్చి వారికి మద్దతు ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేత డి.రాజా, మాజీ ఎంపీ అజీజ్ పాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్రావు, డాక్టర్ చెరకు సుధాకర్, ప్రజాకవి గద్దర్ తదితరులు వారిలో ఉన్నారు. వివిధ వర్సిటీలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా పెద్దఎత్తున వర్సిటీకి తరలివ చ్చి ఆందోళనలో పాలుపంచుకున్నారు. వర్సిటీ పాలక మండలి సస్పెన్షన్‌ను ఎత్తివేయడంపై విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. సస్పెన్షన్ ఎత్తివేస్తూ మండలి వెలువరించిన పత్రాలను దహనం చేశారు. ‘‘ఇది సరిపోదు. వీసీ తప్పుకోవాలి. సస్పెన్షన్ ఎత్తివేత ఆహ్వానించదగ్గదే. కానీ ఈ సస్పెన్షన్ వల్లే మేం రోహిత్ ను కోల్పోయాం. అందుకే మీ నిర్ణయాన్ని అంగీకరించడం లేదు. రోహిత్ కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం అందించాలి. అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలి’’ అని రోహిత్‌తోపాటు సస్పెన్షన్‌కు గురైన విజయ్ కుమార్ స్పష్టంచేశారు. స్మృతి వ్యాఖ్యలపై దళిత ప్రొఫెసర్ల మండిపాటు ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్‌పై నిర్ణయం తీసుకున్న పాలక మండలి సబ్ కమిటీకి దళిత ప్రొఫెసర్ నేతృత్వం వహించారన్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలపైపై వర్సిటీలోని దళిత ప్రొఫెసర్లు మండిపడ్డారు. ఆ కమిటీకి వాస్తవానికి అగ్రవర్ణానికి చెందిన ప్రొఫెసర్ విపిన్ శ్రీవాస్తవ నేతృత్వం వహించగా, మంత్రి అవాస్తవాలు చెప్పారంటూ దుయ్యబట్టారు. ‘‘ఇలాంటి నిరాధార, అవాస్తవ ప్రకటన మంత్రి నుంచి రావడం దురదృష్టకరం. ఇది ఇక్కడ, వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న దళిత ప్రొఫెసర్ల స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. మంత్రి అవాస్తవ ప్రకటన చేసినందున మేం పాలనాపరమైన పదవుల నుంచి తప్పుకుంటున్నాం’’ అంటూ ఎస్సీ, ఎస్టీ ఫ్యాకల్టీ సభ్యుల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. వాస్తవాలు ఇలా ఉంటే రోహిత్ మృతికి కారణమైన తనను, తన సహచర కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను వెనకేసుకురావడానికి స్మృతి ఇరానీ ప్రయత్నించారని ప్రకటనలో దుయ్యబట్టారు. హెచ్‌సీయూలో ఇప్పటివరకు పాలక మండలిలో దళిత ప్రొఫెసర్‌కు ప్రాతినిధ్యమే లేదని ఫ్యాకల్టీ సభ్యుడొకరు తెపారు. వర్సిటీలో ఫ్యాకల్టీ, ఇతర విభాగాల్లో ఎస్టీ, ఎస్టీకి చెందిన దాదాపు 50 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా డిమాండ్లనూ పరిశీలిస్తాం సస్పెన్షన్ ఎత్తివేత మొదటి చర్య మాత్రమేనని విద్యార్థుల మిగతా డిమాండ్లను పరిశీలిస్తామని యూనివర్సిటీ డీన్(స్టూడెంట్ వెల్ఫేర్) ప్రకాశ్ బాబు చెప్పారు. విద్యార్థి సంఘాల జేఏసీని వీసీ కలిసి, వారితో మాట్లాడతారని పేర్కొన్నారు. విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టిందని ఆయన్ను ప్రశ్నించగా.. ‘‘ఈ అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. సస్పెన్షన్ ఎత్తివేతపై లాయర్లను సంప్రదించినా సంక్రాంతి సెలవుల కారణంగా వారి అభిప్రాయం అందడంలో ఆలస్యమైంది. అంతలోనే దురదృష్టకరమైన ఘటన(రోహిత్ ఆత్మహత్య) చోటుచేసుకుంది. ఈ రోజే న్యాయ సలహా అందింది. ఆ వెంటనే పాలక మండలి నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది’’ అని ఆయన వివరించారు. పరిస్థితులు చక్కబడేందుకు సహకరించండి: వీసీ హెచ్‌సీయూలో పరిస్థితులు చక్కబడేందుకు అందరూ సహకరించాలని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ అప్పారావు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. వర్సిటీలోని అంతర్గత వ్యవస్థలపై నమ్మకం ఉంచాలని, సమస్యల పరిష్కారానికి అనువైన పరిస్థితులు ఏర్పడేలా చూడాలని కోరారు. -
రోహిత్‌ది రాజకీయ హత్యే: సురవరం
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి వేముల రోహిత్‌ది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని... అందుకే రాజకీయం చేస్తున్నామని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాక ర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయల చర్యల కారణంగానే రోహిత్ చనిపోయారన్నారు. గురువారం సురవరం నేతృత్వంలో సీపీఐ నేతలు రాజ్యసభ ఎంపీ డి.రాజా, చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్‌పాష తదితరులు హెచ్‌సీయూను సందర్శించి, విద్యార్థులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ, ఏబీవీపీ తీరును సురవరం ఎండగట్టారు. యూకుబ్ మెమన్ ఉరిపై దేశవ్యాప్తంగా ఎవరి అభిప్రాయాలు వారు బహిరంగంగానే తెలిపారని... అలాంటి వారిపై బీజేపీ కావాలనే దుష్ర్పచారం చేస్తోందని దుయ్యబట్టారు. బాబ్రీ మసీదు విషయంలో బీజేపీ చేసిన వ్యవహారమేమిటని ప్రశ్నించారు. రోహిత్ విషయంలో పదే పదే కేంద్రమంత్రులు లేఖలు రాయడమంటే ప్రత్యక్షంగా కల్పించుకున్నట్లు కాదా అని సురవరం నిలదీశారు. స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలతో పాటు వర్సిటీ వీసీ అప్పారావును వెంటనే పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే ఎవరు ఏం చేయాలో, పుస్తకాలలో ఏం ఉండాలో చెప్పడంతో పాటు ఆఖరికి వంటింట్లో ఏం వండాలో కూడా వారే నిర్ణయించేస్తున్నారని మండిపడ్డారు. కాలేజీ మెట్లు కూడా ఎక్కని స్మృతి ఇరానీ కేంద్ర మానవ వనరుల మంత్రిగా కొనసాగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రోహిత్ ఆత్మహత్య అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని రాజ్యసభ సభ్యుడు డి.రాజా చెప్పారు. -
''హెచ్‌సీయూ' వెనుక విదేశీ హస్తం ఉంది!'
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య తర్వాత జరుగుతున్న ఆందోళనల వెనుక విదేశీ శక్తులున్నాయని బీజేపీ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్య బాధాకరమని, ఆయన కుటుంబానికి తమ పార్టీ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతుందన్నారు. అయితే ఈ సంఘటనను రాజకీయం చేస్తూ బీజేపీని అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని గురువారమిక్కడ మీడియాతో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయాలకు ఇదే పెద్ద నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ 8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారిలో 1.35 లక్షల మంది భారతీయులు ఉంటున్నారని, వారందరి కుటుంబాలను కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నేతలు పరామర్శిస్తున్నారా? అని ప్రశ్నించారు. తన ఆత్మహత్యను రాజకీయం చేయవద్దని రోహిత్ తన అంతిమ లేఖలో రాస్తే రాజకీయ పార్టీలు మాత్రం ఆయన చివరి కోర్కెను కూడా తీర్చడం లేదని ఎద్దేవా చేశారు. ఈ సంఘటనకు ప్రపంచ వ్యాపిత మద్దతు కావాలని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ప్రస్తుత అల్లర్ల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉన్నట్టు అర్థమవుతుందన్నారు. భారతీయ సంస్కృతిని చిన్నాభిన్నం చేయడమే ఈ శక్తుల ఉద్దేశంగా అభివర్ణించారు. ఈ విద్యార్ధి చనిపోవడానికి వేరే కారణాలు ఉన్నాయని, వాటిని కనుగొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీలకు ఎటువంటి సంబంధం లేదన్నారు. రోహిత్ కేసు తర్వాత పది మంది ప్రొఫెసర్లు రాజీనామా చేయడం కూడా బీజేపీని బదనాం చేయాలన్న కుట్రలో భాగమేనన్నారు. -
'నేతల్లారా.. హెచ్‌సీయూకి చెప్పులు వదిలి వెళ్లండి'
తిరువనంతపురం: విశ్వవిద్యాలయాల అంశాల్లో రాజకీయనాయకులెవరూ జోక్యం చేసుకోవద్దని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు పాల్పడిన అనంతరం జరుగుతున్న రాజకీయపరిణామాలపై ఆయన స్పందించారు. రాజకీయ నాయకులు వర్సిటీలోకి వెళ్లి ఇష్టమొచ్చినట్లు ప్రసంగాలు చేసి అక్కడి వాతావరణాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని చెప్పారు. నాయకులెవరూ విశ్వవిద్యాలయాల అంశాల్లో జోక్యం చేసుకోకూడదన్నదే తన సలహా అని చెప్పారు. యూనివర్సిటీని ప్రశాంతంగా వదిలేసి రాజకీయ నాయకులంతా వెనక్కి రావాలని విజ్ఞప్తి చేశారు. 'విశ్వవిద్యాలయం దేవాలయంలాంటిది. దేవాలయంలోకి వెళ్లేముందు చెప్పులు ఎలా వదిలి వెళతామో రాజకీయ నాయకులు కూడా యూనివర్సిటీ వెలుపలే రాజకీయాల చెప్పులు వదిలి వెళ్లాలి. మీరు అక్కడికి వెళితే సంతాపం తెలియజేయండి. అక్కడ పరిస్థితి ఏమిటో శ్రద్ధగా గమనించండి. ఎవరు నిజంగా ఆందోళన చెందుతున్నారో వారికి భరోసా ఇవ్వండి.. అంతేగానీ రాజకీయ ప్రసంగాలు చేయొద్దు. వర్సిటీ వాతావరణాన్ని కలుషితం చేసేలాగా ఈపార్టీ ఆ పార్టీ అంటూ ఆరోపణలకు దిగవద్దు' అంటూ వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అంతకు ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్ సీయూకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్‌కు సంతాపం వ్యక్తం చేసి విద్యార్థులతో మాట్లాడి వెళ్లిన నేపథ్యంలో ఆయన వెంకయ్యమాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. పిటిషన్ రూపంలో వచ్చిన ఓ లేఖనే దత్తాత్రేయ మానవ వనరులశాఖకు పంపించారని, ఆ లేఖే తిరిగి వీసీకి వెళ్లిందని ఆయన చెప్పారు. -
'ఆ గొడవలకు కులాల రంగు పూయడం సరికాదు'
హైదరాబాద్: యూనివర్సిటీ తగదాలకు కులాల రంగు పూయడం సరికాదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) హెచ్‌సీయూ నేత సుశీల్ కుమార్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో సుశీల్ మాట్లాడుతూ....హెచ్‌సీయూ ఘటనపై కొంతమంది కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించాడు. 40 మందికి పైగా వచ్చి నన్ను కొట్టినప్పుడు ఒక్కరు మాట్లాడలేదని...ఇప్పుడు మాట్లాడుతున్నవారందరూ అప్పుడేమయ్యారని ప్రశ్నించాడు. పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మృతి కారణంగా గత నాలుగు రోజులుగా సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. -
కులాల రంగు పూయడం సరికాదు
-
'రాజీనామాలకు సిద్ధం!'
-
బాబూ.. స్పందన లేదేం: మేరుగ
సాక్షి, హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్య ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఇంతవరకూ ఎందుకు స్పందించ లేదని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ప్రశ్నించారు. పలువురు మేధావులు, నేతలు రోహిత్ ఆత్మహత్యపై సంతాపం తెలుపుతుంటే... బాబు, ఏపీ మంత్రులు కిమ్మనక పోవడానికి కారణాలేమిటో దళితులకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
తమిళనాడులోనూ ‘రోహిత్’ ప్రకంపనలు
కేంద్ర మంత్రులను బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల డిమాండ్ చెన్నై, సాక్షి ప్రతినిధి: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై తమిళనాడులోనూ ప్రకంపనలు చెలరేగాయి. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన కేంద్ర మంత్రుల్ని బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాలు, రాజకీయ పక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపించి దోషులను శిక్షించాలని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ కోరారు. రోహిత్ ఆత్మహత్యను హిందూ మతోన్మాదుల హత్యగా డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి పేర్కొన్నారు. వర్సిటీలోని అవినీతిని ప్రశ్నించి నందుకే రోహిత్‌ను సస్పెండ్ చేశారని పీఎంకే అధ్యక్షుడు రాందాస్ విమర్శించారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు కారకులను శిక్షించాలని తమిళ మానిల కాంగెస్ అధ్యక్షుడు జీకే వాసన్ కోరారు. వర్సిటీ వీసీ అప్పారావును తొలగిం చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్, చిరుతైగళ్ కళగం అధ్యక్షుడు తిరుమావళవన్ డిమాండ్ చేశారు. -
రోహిత్‌కు ఏబీవీపీ నివాళులు
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌కు ఏబీవీపీ నివాళులర్పించింది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి, రోహిత్ చిత్రపటానికి బుధవారం ఏబీవీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. హెచ్‌సీయూలో ఇటీవల జరిగిన అన్ని ఘటనలపై సమగ్ర విచారణ జరిపించి, ఆ ఘటనలతో సంబంధం ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యతో హెచ్‌సీయూ వీసీ, హెచ్ఆర్డీకి ఎటువంటి సంబంధం లేదని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మట్ట రాఘవేందర్, రాష్ట్ర నాయకులు రాజేంద్రప్రసాద్, ఎల్లస్వామి పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్య చేసుకునేలా వర్సిటీ అధ్యాపకులు ప్రేరేపించారని, ఏఎస్ఏ విద్యార్థులను డీన్ ప్రకాశ్‌బాబు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, పౌరహక్కుల ఉద్యమ నేత హరగోపాల్, విరసం నేత వరవరరావు, సూరేపల్లి సుజాత రెచ్చగొట్టారని ఆరోపించారు. -
'రాజీనామాలకు సిద్ధం!'
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో రోహిత్ ఆత్మహత్యపై మళ్లీ ప్రకంపనలు మొదలయ్యాయి. యూనివర్సిటీ జేఏసీ పిలుపునకు వర్సిటీ దళిత ఉద్యోగులు స్పందించారు. పాలన హోదాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. స్మృతి ఇరానీపై వర్సిటీ దళిత ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు దళిత ఉద్యోగులు ప్రకటించారు. -
ఈ ప్రశ్నకు బదులేది ?
-
రోహిత్ ఆత్మహత్య కేసు దర్యాప్తు ముమ్మరం
-
దత్తన్న లేఖే ‘సెంట్రల్’
రోహిత్ ఆత్మహత్యకు కేంద్రబిందువుగా కేంద్రమంత్రి లేఖ ♦ ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్‌పై రోహిత్ దాడి చేసినట్లు రుజువులు లేవన్న వర్సిటీ విచారణ కమిటీ... దత్తాత్రేయను ఆశ్రయించిన సుశీల్‌కుమార్ ♦ వర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడి వినతిపత్రాన్ని జతచేస్తూ ఆగస్టు 17న హెచ్ఆర్డీకి ఉత్తరం రాసిన దత్తాత్రేయ ♦ ఏం చర్యలు తీసుకున్నారంటూ వర్సిటీ వీసీకి హెచ్ఆర్డీ నుంచి ఐదు వరుస లేఖలు ♦ సెప్టెంబర్ 3, 24, అక్టోబర్ 6, 20, నవంబర్ 19న లేఖల పరంపర ♦ ఆగస్టులోనే ప్రొఫెసర్ల ద్విసభ్య కమిటీ క్లీన్చిట్ ఇచ్చినా... చివరకు డిసెంబర్ 21న ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్ ♦ హాస్టల్, పరిపాలన భవనంలోకి అడుగుపెట్టరాదంటూ కఠినమైన ఆంక్షలు ♦ రాజకీయ ఒత్తిళ్ల వల్లే హెచ్ఆర్డీ జోక్యం చేసుకుందన్న విద్యార్థి సంఘాలు సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హెచ్‌సీయూలో రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య వివాదానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆగస్టు 17న రాసిన లేఖ కేంద్ర బిందువైంది. విశ్వవిద్యాలయం పరిధిలోని లోక్‌సభ సభ్యుడి హోదాలో దత్తాత్రేయ లేఖ రాయడం, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆ లేఖ వివరాలను ప్రస్తావిస్తూ ఐదు సార్లు వర్సిటీ వైస్ చాన్స్‌లర్‌కు లేఖ రాయడం వల్లే విద్యార్థులు సస్పెన్షన్‌కు గురయ్యారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ ఎంపీ హోదాలో దత్తాత్రేయ రాజకీయంగా ఒత్తిడి తేవడం, వర్సిటీ నుంచి సస్పెన్షన్‌తో వదిలిపెట్టకుండా హాస్టల్ కూడా ఖాళీ చేయాలనడం, పరిపాలన భవనంలోకి అడుగుపెట్టవద్దని ఆంక్షలు విధించినందువల్లే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డారని సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దత్తాత్రేయను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వర్సిటీ ఏబీవీపీ విభాగం అధ్యక్షుడు సుశీల్‌కుమార్ ఇచ్చిన వినతిపత్రాన్ని జత చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలంటూ దత్తాత్రేయ గతేడాది ఆగస్టులో కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. యాకూబ్ మెమన్ ఉరికి వ్యతిరేకంగా వర్సిటీలో నిరసనలు తెలిపిన ఘటనను ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. మెమన్ ఉరిపై నిరసన తెలియజేయడం ఏమిటని ప్రశ్నించినందుకు సుశీల్ కుమార్‌పై దాడికి పాల్పడ్డారని, ఫలితంగా ఆయన ఆస్పత్రిలో చేరారని, దాడికి కారకులపై చర్య తీసుకోవాలని దత్తాత్రేయ ఆ లేఖలో కోరారు. ఈ నేపథ్యంలో ఏ చర్యలు తీసుకున్నారంటూ హెచ్ఆర్డీ శాఖ పలుమార్లు వీసీకి లేఖలు రాసింది. లేఖల పరంపర ఇదీ..: హెచ్‌సీయూలో జాతి వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయంటూ దత్తాత్రేయ లేఖ రాసిన తర్వాత తగిన చర్యలు తీసుకోవాలంటూ హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ఐదు లేఖలు రాసింది. దత్తాత్రేయ లేఖను జత చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలంటూ సెప్టెంబర్ 3, అదేనెల 24న హెచ్ఆర్డీ ఉప కార్యదర్శి పేరిట వర్సిటీ వీసీకి లేఖలందాయి. ఆగస్టు 17నాటి దత్తాత్రేయ లేఖ, సెప్టెంబర్ 3, 24 తేదీల్లో ఉప కార్యదర్శి రాసిన లేఖలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ అక్టోబర్ 6, అదేనెల 20 తేదీల్లో సంయుక్త కార్యదర్శి పేరిట మరో లేఖ అందింది. అప్పటికీ వీసీ నుంచి సమాధానం లేకపోవడంతో నవంబర్ 19న హెచ్ఆర్డీ అండర్ సెక్రటరీ పేరిట ఇంకో లేఖ అందింది. దత్తాత్రేయ రాసిన లేఖపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలన్నదే ఈ లేఖల ఉద్దేశం. అండర్ సెక్రటరీ రాసిన చివరి లేఖలో మాత్రం... వర్సిటీలో అవాంఛనీయ ఘటనలకు పాల్పడుతున్న విద్యార్థులపై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించారు. హెచ్ఆర్డీ శాఖ నుంచి లేఖలు రావడంతో వీసీ ఒత్తిడికి లోనై రోహిత్‌తో పాటు ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్‌లోనూ కఠినమైన ఆంక్షలు మామూలుగా విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే వర్సిటీలో తరగతులకు హాజరవకుండా సస్పెన్షన్ విధిస్తారు. సస్పెన్షన్ ముగిసేదాకా ఎలాంటి అకడమిక్ కార్యకలాపాల్లో పాలు పంచుకోవడానికి వీలుండదు. కానీ రోహిత్‌తోపాటు నలుగురు విద్యార్థులపై హాస్టల్, భోజనశాలతో పాటు క్యాంపస్ ఆవరణలోని పరిపాలన భవనంలోకి అడుగుపెట్టకూడదని ఆంక్షలు విధించారు. సాధారణంగా విద్యార్థుల సస్పెన్షన్‌లో ఇలాంటి ఆంక్షలు ఉండవని విద్యార్థి సంఘాలంటున్నాయి. దానికి తోడు దత్తాత్రేయ లేఖ ఆధారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు వర్సిటీ అధికారులు విద్యార్థులకు చెప్పడం కూడా వారి ఆగ్రహానికి కారణమని ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రానికి నివేదించింది. మామూలుగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే వీసీ లేదా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశమై ఫిర్యాదులో నిజానిజాలు పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. అలాంటప్పు డు ఫిర్యాదు చేసినవారి వివరాలు బహిర్గతం చే యాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ రోహిత్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా ఆందోళనలు పెల్లు బుకడంతో వర్సిటీ అధికారులు తమ తప్పు లేదని చెప్పుకోవడానికి దత్తాత్రేయ లేఖను బహిర్గతం చేశారు.దాంతోపాటే హెచ్ఆర్డీ లేఖల వివరాలను కూడా విద్యార్థి సంఘాలకు అందించారు. వర్సిటీపై ఎలాంటి ఒత్తిడి తేలేదు: హెచ్ఆర్డీ సాక్షి,న్యూఢిల్లీ: రోహిత్ సస్పెన్షన్ విషయంలో హెచ్‌సీయూపై ఒత్తిడి తెచ్చినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర మానవ వనరుల శాఖ ఖండించింది. తాము కార్యాలయ విధానాల మాన్యువల్‌కు అనుగుణంగా వ్యవహరించామని శాఖ ప్రతినిధి ఘనశ్యామ్ గోయల్ మంగళవారం తెలిపారు. నిబంధనల ప్రకారం వీఐపీ రాసిన ఉత్తరాలకు 15 రోజుల్లో అవి అందినట్లుగా ధ్రువీకరించాల్సి ఉంటుందని, మరో 15 రోజుల్లో జవాబు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అయితే వర్సిటీ నుంచి స్పందన రాకపోవడంతో రిమైండర్లు పంపించాల్సి వచ్చింద న్నారు. పెండింగ్‌లో ఉన్న హామీలు, వీఐపీల సూచనల వివరాలను కూడా కేబినెట్ సమావేశాల్లో మంత్రిత్వ శాఖ అందివ్వాల్సి ఉంటుందన్నారు. జనవరి 7న మంత్రిత్వ శాఖకు హెచ్‌సీయూ జవాబు పంపించిందని అధికారులు తెలిపారు. హెచ్‌సీయూలో గత ఆరు నెలలుగా చోటుచేసుకున్న పరిణామాలివీ.. జూలై 30: యాకూబ్ మెమన్ ఉరి. అదే రోజు వర్సిటీలో ఉరికి వ్యతిరేకంగా అంబేద్కర్ విద్యార్థి సంఘం (ఏఎస్ఏ) నిరసనలు ఆగస్టు 3: అంబేద్కర్ విద్యార్థి సంఘంలో అవివేకులున్నారని, వారివి పోకిరి చేష్టలు అంటూ ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్ ఫేస్బుక్ స్టేటస్‌ను అప్డేట్ చేశారు ఆగస్టు 4: హెచ్‌సీయూ క్యాంపస్‌లో రోహిత్, ఇతర విద్యార్థులు తనను కొట్టారంటూ సుశీల్‌కుమార్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు ఆగస్టు 4-13: ఏబీవీపీ, ఏఎస్యూ మధ్య గొడవలు. క్యాంపస్‌లో మీటింగ్‌కు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరు. దాడి చేసిన విద్యార్థులపై చర్య తీసుకోవాలని డిమాండ్. ఘటనపై విచారణకు ఆదేశించిన వైస్ చాన్స్‌లర్. సుశీల్‌కుమార్‌పై రోహిత్ దాడి చేసినట్లు ఎలాంటి రుజువులు లేవని తేల్చిచెప్పిన ప్రొఫెసర్ ఆర్.పి.శర్మ, ప్రొఫెసర్ అలోక్ పాండే విచారణ కమిటీ ఆగస్టు 17: హెచ్‌సీయూ క్యాంపస్‌లో సుశీల్‌కుమార్‌పై ఘటనకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాసిన కేంద్రమంత్రి దత్తాత్రేయ సెప్టెంబర్ 3: దత్తాత్రేయ లేఖలో వివరాలను ఉటంకిస్తూ హెచ్‌సీయూ వీసీకి మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శి లేఖ సెప్టెంబర్ 24: సెప్టెంబర్ 3 నాటి లేఖకు వివరణ కోరుతూ వీసీకి ఉప కార్యదర్శి లేఖ అక్టోబర్ 6: దత్తాత్రేయ లేఖ, ఉపకార్యదర్శి మెమోలకు సంబంధించి వివరణ కోరుతూ వీసీ కి లేఖ రాసిన హెచ్ఆర్డీ సంయుక్త కార్యదర్శి అక్టోబర్ 20: అంతకుముందు రాసిన లేఖలకు సంబంధించి తీసుకున్న చర్యలపై వివరణ కోరుతూ వీసీకి సంయుక్త కార్యదర్శి లేఖ నవంబర్ 19: దత్తాత్రేయ లేఖ, ఉప కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి లేఖలకు వివరణ ఇవ్వకపోవడంపై వైస్ చాన్స్‌లర్‌కు హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లేఖ డిసెంబర్ 21: రోహిత్ సహా ఐదుగురు విద్యార్థులను వర్సిటీ నుంచి సస్పెండ్ చేసిన వీసీ జనవరి 17: రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య -
రోహిత్ మృతి దురదృష్టకరం
అంబేడ్కర్ మనవడు ఆనంద్ తేల్ తుంబ్డే ఆవేదన కల్వకుర్తి రూరల్/వెల్దండ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య అత్యంత దురదృష్టకరమని అంబేడ్కర్ మనవడు, ప్రొఫెసర్ ఆనంద్ తేల్ తుంబ్డే వ్యాఖ్యానించారు. రాజకీయ కారణాలతోనే వర్సిటీ వైస్ చాన్స్లర్పై ఒత్తిడి తెచ్చి ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో విలేకరులతో మాట్లాడారు. ఏబీవీపీ, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయన్న విషయం తేటతెల్లమవుతుందని చెప్పారు. దళితులను సమాజానికి దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రత్నం తదితరులు ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలం తాండ్ర గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు. -
దత్తాత్రేయ రాజీనామా చేయాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాజీనామా చేయాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. వీసీ అప్పారావును వెంటనే సస్పెండ్ చేసి, ఈ ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పేర్కొన్నారు. మంగళవారం మఖ్దూంభవన్‌లో పార్టీనాయకులు అజీజ్ పాషా, సిద్ధి వెంకటేశ్వర్లు, కూనంనేని సాంబశివరావు, పశ్యపద్మతో కలసి మాట్లాడుతూ.. కులతత్వం, తీవ్రవాద, జాతి వ్యతిరేక రాజకీయాలకు హెచ్‌సీయూ నెలవుగా మారిందని వ్యాఖ్యానించారు. రోహిత్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
స్వతంత్ర న్యాయ కమిటీతో విచారణ జరపాలి: జేపీ
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై ప్రభుత్వ అధికారులతో కాకుండా స్వతంత్ర న్యాయ కమిటీతో సమగ్ర విచారణ జరిపించాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో కుల వివక్ష కారణంగా ఓ పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం భారతీయులంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం అని పేర్కొన్నారు. కాగా, కులం పేరు సూచించే తోకలను తీసేసుకోవాలని ఆయన యువతను కోరారు. కులం, మతం సంబంధం లేకుండా కులాంతర వివాహాలు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. -
రాహుల్ రాజకీయం చేస్తున్నారు
రోహిత్ ఆత్మహత్యపై కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూలో రోహిత్ ఆత్మహత్యను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాజకీయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. యూనివర్సిటీలో విద్యార్థి సమస్యలను రాజకీయ చేయడం దురదృష్టకరమని, ఇది ఆయనకు తగదని అన్నారు. కిషన్‌రెడ్డి పార్టీ నేతలు కె.లక్ష్మణ్, చింతా సాంబమూర్తి తదితరులతో కలసి హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. దేశద్రోహం నేరం కింద యాకుబ్ మెమన్ ఉరితీతను నిరసించిన విద్యార్థులతో వర్సిటీలో వాదోపవాదాలు జరిగాయని, ఈ సందర్భంగా ఏబీవీపీ నేత సుశీల్‌కుమార్‌పై దాడులు చేశారన్నారు. వారి సస్పెన్షన్‌తో కేంద్రమంత్రి దత్తాత్రేయకు నేరుగా సంబంధం లేదని, వర్సిటీ వీసీకి ఆయన లేఖ రాయలేదని పేర్కొన్నారు. దేశంలో అనేక సంఘటనలు, ఆత్మహత్యలు వేర్వేరు కారణాలతో జరుగుతున్నాయని, ప్రతీ దానిని రాజకీయ కోణంలోనే చూడటం మంచిదికాదని హెచ్చరించారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని చింతా సాంబమూర్తి విమర్శించారు. దళితుడే తొలి సీఎం అని చెప్పి మాటతప్పిన కేసీఆర్‌కు దళితుల ప్రస్తావన తెచ్చే అర్హత లేదన్నారు. -
దత్తాత్రేయను బర్తరఫ్ చేయాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కారణమని, ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. యూనివర్సిటీ వీసీని వెంటనే తొలగించి రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని పేర్కొన్నారు. వర్సిటీలో విద్యార్థుల బహిష్కరణ అప్రజాస్వామికమని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బహిష్కరణను నిరసిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించినపుడు రోహిత్ తనతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. చిన్ని చిన్ని ఘర్షణలను ఆసరాగా చేసుకుని దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు వీసీపై తీవ్ర ఒత్తిడిని తీసుకురావడం వల్లే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. -
రోహిత్ ఆత్మహత్య కేసు దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి వర్సిటీ వీసీ అప్పారావు, కేంద్రమంత్రి దత్తాత్రేయ తదితరులపై నమోదైన కేసు దర్యాప్తును గచ్చిబౌలి పోలీసులు ముమ్మరం చేశారు. మాదాపూర్ డీసీపీ కార్తికేయ ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు మంగళవారం పలువురి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. రోహిత్ ఆత్మహత్య పూర్వాపరాలకు సంబంధించి ప్రాథమిక నివేదికను రూపొందించి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. అత్యంత సున్నితమైన అంశం కావడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాల సేకరణ, వాంగ్మూలాల నమోదు పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. దత్తాత్రేయ, రామచంద్రరావులపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మృతికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు కారకులని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ ఫిబ్రవరి 1 లోగా విచారణ నివేదికను కమిషన్‌కు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, సైబరాబాద్ సీపీ, హెచ్‌సీయూ వీసీలను ఆదేశించింది. హెచ్‌సీయూలో ఏబీవీపీ విద్యార్థులు రోహిత్‌తో పాటు పలువురు దళిత విద్యార్థులపై దాడులు చేయడమే కాకుండా గూండాలుగా ప్రచారం చేస్తూ కేసులు పెట్టారని పిడమర్తి ఆరోపించారు. దాడి చేసిన వారికి మద్దతు పలుకుతూ దళిత విద్యార్థులను వర్సిటీ నుంచి బహిష్కరించాలని దత్తాత్రేయ, రామ చంద్రరావులు వీసీపై ఒత్తిడి తెచ్చారన్నారు. దీంతో మనస్థాపానికి గురై రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఘటనకు బాధ్యులైన వారిద్దరినీ పదవి నుంచి తొలగించి, వీసీపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
'దళిత విద్యార్థులనే సస్పెండ్ చేయడం దారుణం'
హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ...దళిత విద్యార్థులనే కారణంతో హెచ్‌సీయూలో సోషల్ బాయ్‌కాట్ చేయడం దారుణమన్నారు. యూనివర్సిటీ కులాల కంపు రావణ కాష్టంగా మారిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని....మిగిలిన నలుగురి విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. ఈ ఘటనపై ఉన్నత స్ధాయి కమిటీని నియమించి నిజాలను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.