రోహిత్ ఆత్మహత్య కేసు దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి వర్సిటీ వీసీ అప్పారావు, కేంద్రమంత్రి దత్తాత్రేయ తదితరులపై నమోదైన కేసు దర్యాప్తును గచ్చిబౌలి పోలీసులు ముమ్మరం చేశారు. మాదాపూర్ డీసీపీ కార్తికేయ ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
పోలీసులు మంగళవారం పలువురి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. రోహిత్ ఆత్మహత్య పూర్వాపరాలకు సంబంధించి ప్రాథమిక నివేదికను రూపొందించి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. అత్యంత సున్నితమైన అంశం కావడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాల సేకరణ, వాంగ్మూలాల నమోదు పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
దత్తాత్రేయ, రామచంద్రరావులపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు
హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మృతికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు కారకులని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్సీ ఫిబ్రవరి 1 లోగా విచారణ నివేదికను కమిషన్‌కు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, సైబరాబాద్ సీపీ, హెచ్‌సీయూ వీసీలను ఆదేశించింది.
హెచ్‌సీయూలో ఏబీవీపీ విద్యార్థులు రోహిత్‌తో పాటు పలువురు దళిత విద్యార్థులపై దాడులు చేయడమే కాకుండా గూండాలుగా ప్రచారం చేస్తూ కేసులు పెట్టారని పిడమర్తి ఆరోపించారు. దాడి చేసిన వారికి మద్దతు పలుకుతూ దళిత విద్యార్థులను వర్సిటీ నుంచి బహిష్కరించాలని దత్తాత్రేయ, రామ చంద్రరావులు వీసీపై ఒత్తిడి తెచ్చారన్నారు. దీంతో మనస్థాపానికి గురై రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఘటనకు బాధ్యులైన వారిద్దరినీ పదవి నుంచి తొలగించి, వీసీపై చర్యలు తీసుకోవాలని కోరారు.