ఉద్దేశపూర్వకంగానే విద్యార్థులపై దాడి
♦ హెచ్‌సీయూ ఘటనలపై ఢిల్లీకి చెందిన నిజ నిర్ధారణ కమిటీ నివేదిక
♦ వీసీ అప్పారావు విద్యార్థులను రెచ్చగొట్టారు
♦ ఏబీవీపీ విద్యార్థులతో కలసి పోలీసులను రప్పించారు
♦ పోలీసులతో కలసి విచ్చలవిడిగా దాడికి పాల్పడ్డారు
♦ ఈ ఘటనలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూలో వీసీ అప్పారావు ఉద్దేశపూర్వకంగానే విద్యార్థులను రెచ్చగొట్టి, పోలీసులతో దాడికి పాల్పడ్డారని ఢిల్లీకి చెందిన స్వతంత్ర నిజ నిర్ధారణ కమిటీ అభిప్రాయపడింది. రోహిత్ ఆత్మహత్యకు కారకులైనవారిని తీవ్రంగా శిక్షించాలని... వర్సిటీలో శాంతి నెలకొనాలంటే వీసీ అప్పారావును క్యాంపస్‌లోకి అనుమతించవద్దని పేర్కొంది. ఢిల్లీకి చెందిన వివిధ సంఘాలతో కూడిన నిజ నిర్ధారణ కమిటీ తన మధ్యంతర నివేదికను శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విడుదల చేసింది.
హెచ్‌సీయూలో భావప్రకటనా స్వేచ్ఛకు, సమీకరణ స్వేచ్ఛకు, ప్రశ్నించే స్వేచ్ఛకు భంగం కలిగించడం ద్వారా అప్పారావు, ఆయన అనుచరులు, పోలీసులు హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆ నివేదికలో పేర్కొంది. 22వ తేదీన వీసీ అప్పారావు తనకు అనుకూలురైన కొందరు అధ్యాపకులు, 30 మంది ఏబీవీపీ విద్యార్థులతో కలసి పోలీసులను రప్పించి వ్యూహాత్మకంగానే విద్యార్థులపై దాడి చేయించినట్లు ఆరోపించింది. విద్యార్థినులని కూడా చూడకుండా పోలీసులు దుర్భాషలాడుతూ కొట్టారని, అత్యాచారం చేస్తామంటూ భయభ్రాంతులకు గురిచేశారని పలువురు విద్యార్థినులు చెప్పారని పేర్కొంది.
నిర్బంధించిన విద్యార్థులను సైతం పోలీసు వాహనాల్లో విపరీతంగా కొట్టారని తెలిపింది. పోలీసుల దాడిలో గాయపడి, ఆసుపత్రిపాలైన ఉదయభాను చెప్పిన విషయాల్లో పోలీసుల క్రూరత్వం బట్టబయలైందని నివేదికలో పేర్కొంది. ఇప్పటికీ కూడా క్యాంపస్‌లోని విద్యార్థులు భయాందోళన నుంచి తేరుకోలేదని వెల్లడించింది. ఈ నెల 22న హెచ్‌సీయూలో జరిగిన ఘటనలపై న్యాయ విచారణ జరిపించాలని... అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని, వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని కమిటీ డిమాండ్ చేసింది.
హ్యూమన్‌రైట్స్ డిఫెండర్ అలర్ట్ ఇండియా ెహ న్రీ, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తారారావు, ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ అగెనైస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ నుంచి బర్నార్డ్ ఫాతిమా, కఫిర్ నల్గుండ్‌వార్ రౌండ్ టేబుల్ ఇండియా నుంచి కెరుబా మునిస్వామి, సుప్రీంకోర్టు లాయర్ బీనా పల్లికల్, నేషనల్ క్యాంపెయిన్ ఆన్ దళిత్ హ్యూమన్ రైట్స్ నుంచి రమేష్‌నాథన్, నేషనల్ దళిత్ మూవ్‌మెంట్ ఫర్ దళిత్ రైట్స్ నుంచి అశోక్ కొత్వాల్, ఆలిండియా దళిత్ మహిళా అధికార్ మంచ్, ఆసియా దళిత్ రైట్స్ ఫోరం నుంచి పాల్ దివకార్ తదితరులు ఈ నిజనిర్ధారణ కమిటీలో ఉన్నారు.