VC Appa Rao
-
మీ చేతుల మీదుగా పట్టా తీసుకోను...
హెచ్‌సీయూ స్నాతకోత్సవంలో వీసీ అప్పారావుకు విద్యార్థి షాక్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వార్షికోత్సవంలో వైస్‌చాన్సలర్ పొదిలి అప్పారావుకు పరాభవం ఎదురైంది. ఆయన చేతుల మీదుగా పీహెచ్డీ పట్టా స్వీకరించేందుకు ఓ పరిశోధక విద్యార్థి నిరాకరించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో శనివారం నిర్వహించిన హెచ్‌సీయూ 18వ స్నాతకోత్సవ వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫిలాసఫీలో పీహెచ్డీ పట్టా తీసుకోవాల్సిందిగా పరిశోధక విద్యార్థి సుంకన్నను ఆహ్వానించడంతో వేదికపైకి వెళ్లారు. వీసీ అప్పారావు అందిస్తున్న పట్టాను తీసుకోకుండా అలాగే నించున్నారు. ‘రోహిత్‌తోపాటు ఐదుగురు దళిత విద్యార్థుల రస్టికేషన్లో ప్రధాన నిందితుడు, రోహిత్ ఆత్మహత్యకు కారకుడైన మీ చేతుల మీదుగా పట్టాను స్వీకరించే కంటే ఓ క్లర్క్ చేతులపైగా నేను పట్టా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాను.’ అని స్టేజీపైనే వీసీకి తేల్చి చెప్పారు. దీంతో ప్రొ వీసీ అయిన బిపిన్ శ్రీవాస్తవ చేత సుంకన్నకు పట్టాను ఇప్పించారు. దీనిపైన విసి అప్పారావుని వివరణ కోరగా అది అతని అభిప్రాయమనీ, తానేం చేయలేననీ, దీన్ని ఇష్యూ చేయొద్దని సమాధానమిచ్చారు. మా ఉద్యమం ఆగిపోలేదు... పట్టాను తిరస్కరించిన సుంకన్న ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘అప్పారావు అంతా అయిపోయిందనుకుంటున్నారు. కానీ మా ఉద్యమం ఆగిపోలేదనీ, మా స్ట్రగుల్ కొనసాగుతుందనీ చెప్పేందుకే నేను వీసీ చేతుల మీదుగా పట్టాను తీసుకునేందుకు తిరస్కరించాను. గతంలో కూడా నేను ఇదే యూనివర్సిటీ నుంచి ఎంఏ ఫిలాసఫీ, ఎంఫిల్లోనూ పట్టాలు తీసుకున్నాను. కానీ ఎప్పుడూ తిరస్కరించలేదు. అప్పుడు వీసీలు అప్పారావులాగా వ్యవహరించలేదు. కానీ అప్పారావు దళిత విద్యార్థులను అణచివేయాలని ప్రయత్నించారు. వివక్షతో ఆత్మహత్యలకు పురిగొల్పారు. రోహిత్ లాంటి మేధావి చనిపోవడానికి కారకుడయ్యారు. మమ్మల్ని రస్టికేట్ చేసి వేధించి, చివరకు హాస్టల్ నుంచి గెంటించాడు. రోడ్డుమీదపడ్డ మమ్మల్ని వదలకుండా వేధించారు. వెలివాడలో ఉన్నా, వెలివాడను కూడా కూలగొట్టించాడు. ఈ రోజు హెచ్‌సీయూ క్యాంపస్‌లో విద్యార్థులంతా అనుక్షణం భయంభయంగా బతుకుతున్నారంటే కారణం అప్పారావే. అందుకే అతని నుంచి పట్టాను తిరస్కరించి మా పోరాటాన్ని కొనసాగిస్తున్నట్టు అతనికి అర్థమయ్యేలా చెప్పాను.’ అని సుంకన్న చెప్పారు. అప్పారావుని, రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారందరినీ శిక్షించినప్పుడే మా పోరాటం ఆగుతుందని ఆయన స్పష్టం చేశారు. యువతరమే దేశానికి వెన్నెముక: బిబేక్ డెబ్రాయ్ హెచ్‌సీయూ వీసీ అప్పారావు అధ్యక్షతన జరిగిన స్నాతకోత్సవంలో 1564 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. ఇందులో 267 మందికి పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేశారు. చదువులో అత్యధిక ప్రతిభ కనబర్చిన 99 మంది విద్యార్థులకు అవార్డులిచ్చారు. డాక్టర్ బిబేక్ దెబ్రాయ్ మాట్లాడుతూ ఈ దేశాన్ని ముందుకు నడిపించేది యువతరమేనని అన్నారు. వీసీ అప్పారావు మాట్లాడుతూ 4 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సెంట్రల్ యూనివర్సిటీ నాణ్యతాపరంగానూ, అన్ని విషయాల్లోనూ ముందున్నదన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎస్.వేణుగోపాల్, తెలుగు విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ డి.వెంకటేశ్వర్రావు, స్కూల్ ఆఫ్ లైఫ్ సెన్సైస్ డాక్టర్ ఇ.సురేష్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న అలోక్ కుమార్ మిశ్రాలకు డాక్టర్ బిబేక్ దెబ్రయ్ చేతులమీదుగా చాన్సలర్ అవార్డులు అందజేశారు. -
స్కాలర్స్ లిస్టు పంపండి: వీసీ అప్పారావు
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకున్న పరిశోధక విద్యార్థుల జాబితా పంపాలంటూ వివిధ విభాగాల డీన్లకు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ అప్పారావు ఆదేశాలు జారీచేశారు. కోర్సు పూర్తి అయినా కాకున్నా ఐదేళ్లు పూర్తయితే విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేయాలని డీన్లకు తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా విద్యార్థులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే డీన్స్కి ఆదేశాలు జారీచేసినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గతంలో వర్సిటీలో వివిధ కోర్సులు చేస్తున్న విద్యార్థుల కాలపరిమితి పూర్తయినప్పటికీ గైడ్ అనుమతితో గడువు పెంచుకునే అవకాశం ఉండేది. ఇప్పుడా అవకాశం లేకుండా చేసి విద్యార్థులను క్యాంపస్ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అంబేడ్కర్ అసోసియేషన్ కన్వీనర్ మున్నా, ఎస్సీ, ఎస్టీ ఫ్యాకల్టీ ఆరోపించారు. -
హెచ్‌సీయూ పదవులకు ఎస్సీ, ఎస్టీ అధ్యాపకుల రాజీనామా
సాక్షి, హైదరాబాద్: హెచ్ సీయూ వైస్ చాన్స్‌లర్ అప్పారావు రాకను వ్యతిరేకిస్తూ సెంట్రల్ యూనివర్సిటీలో వివిధ పదవులు నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు గురువారం రాజీనామా చేశారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వీసీ అప్పారావు రాజీనామా చేయాలని, ప్రొఫెసర్ శ్రీవాస్తవ వీసీ పదవిని చేపట్టరాదని ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులంతా తమ అధికార పదవులకు గతంలో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వీసీగా పెరియసామి నియామకం అనంతరం రాజీనామాలను ఉపసంహరించుకున్నారు. మళ్లీ ఈ నెల 22 నుంచి అప్పారావు వీసీగా కొనసాగడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పదిహేను మంది ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు తమ పదవులకు రాజీనామా చేస్తూ ఆ మేరకు లేఖను వీసీ అప్పారావుకు పంపారు. ఈ రాజీనామా లేఖలో వీసీగా అప్పారావు రాకతో క్యాంపస్‌లో శాంతియుత వాతావరణం దెబ్బతిన్నదని, దీనికి వ్యతిరేకంగా అత్యంత శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను ప్రధానంగా దళిత విద్యార్థులను టార్గెట్ చేసి మరీ లాఠీచార్జి చేయించడం, అరెస్టులకు పాల్పడటం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను శాంత పరిచేందుకు ప్రయత్నిస్తున్న అధ్యాపకులు రత్నం, తథాగత్‌లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తే దాన్ని ఖండించాల్సింది పోయి వారిపై తప్పుడు కేసులు బనాయించారని పేర్కొంటూ 15 మందితో కూడిన ఎస్సీ, ఎస్టీ అధ్యాపక బృందం రాజీనామా సమర్పించింది. -
వీసీ అప్పారావును రీకాల్ చేయాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ వీసీ అప్పారావును రీకాల్ చేయడానికి బదులుగా అకడమిక్ కౌన్సిల్ సమావేశం ద్వారా కేంద్రం ఆయనకు నైతిక బలాన్ని చేకూర్చడం పట్ల సీపీఐ నిరసన వ్యక్తం చేసింది. రోహిత్ ఆత్మహత్య తర్వాత ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హెచ్‌సీయూ ఘటనపై సీఎం స్పందిస్తూ అప్పారావును రీకాల్ చేయాల్సిందిగా ప్రధానిని కోరతానని ప్రకటించినట్లు ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గుర్తుచేశారు. విశ్వవిద్యాలయాల్లో ప్రశాంత పరిస్థితిని నెలకొల్పడానికి వీసీ అప్పారావును వెంటనే రీకాల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటివరకు సీఎం నుంచి ఎలాంటి స్పందన లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఆ సీట్లో కూర్చునే అర్హత లేదు
♦ హెచ్‌సీయూ వీసీ అప్పారావుపై అకడమిక్ కౌన్సిల్ సభ్యుల మండిపాటు ♦ తక్షణమే పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ ♦ సమావేశంలోనే వీసీని కడి గేసిన సభ్యులు.. పలువురు వాకౌట్ ♦ చీఫ్ ఎగ్జామినర్ పదవి నుంచి తప్పుకున్న ప్రొఫెసర్ కృష్ణ సాక్షి, హైదరాబాద్: ‘‘మీకు ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదు. వైస్ చాన్స్‌లర్ పదవికి మీరు అనర్హులు..’’ అంటూ హెచ్‌సీయూ వీసీ అప్పారావును వర్సిటీ అకడమిక్ కౌన్సిల్ సభ్యులు కడిగిపారేశారు! వీసి పదవికి తక్షణమే రాజీనామా చేయాలంటూ పలువురు సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వీసీ అప్పారావు బుధవారం తన నివాసంలోనే వర్సిటీ అకడమిక్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వీసీపై మండలి సభ్యులు మండిపడ్డట్టు తెలిసింది. కౌన్సిల్ భేటీని రద్దు చేయాలని పదేపదే విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా వీసీ తన కుర్చీ పట్టుకు వేలాడుతున్నారని ప్రొఫెసర్లు దుయ్యబట్టారు. కౌన్సిల్‌లోని సగం మందికిపైగా సభ్యులు ఈ భేటీకి హాజరుకాలేదు. హాజరైన వారిలో కొందరు వీసీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మధ్యలోనే బయటకు వచ్చారు. మిగిలిన వారు వీసీపై నిరసన ప్రకటిస్తూ సమావేశంలోనే పాల్గొన్నట్టు సమాచారం. పరిశోధక వ్యాసాలు కాపీ కొట్టారు ప్రముఖ రచయిత్రి, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నందినీ సుందర్ ఈ భేటీలో కౌన్సిల్ ఎక్సటెర్నల్ మెంబర్ హోదాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె వీసీపై నిప్పులు చెరిగారు. ‘‘పరిశోధక వ్యాసాలను కాపీ కొట్టిన మీకు ఈ కుర్చీలో కూర్చునే నైతిక అర్హత లేదు. మీరు ఆ స్థానంలో కూర్చోవడాన్ని నేను అంగీకరించలేను. మీపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు జ్యుడీషియల్ ఎంక్వయిరీ జరుగుతోంది. మీరు చూపిన వివక్ష వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నట్టు ఎన్నో స్వచ్ఛంద కమిటీలు తేల్చి చెప్పాయి. 2007 నుంచి 2014 వరకు ఏడేళ్లలో మీరు రాసిన పరిశోధక వ్యాసాల్లో ఇతరుల వాక్యాలను నేరుగా కాపీ కొట్టారు. ఒక ఉన్నతమైన విద్యాసంస్థకు అధిపతిగా ఉండాల్సిన వీసీ.. కాపీ కొట్టినట్లు వెల్లడైన తర్వాత ఇక ఆ పదవిలో కొనసాగే అర్హత ఉండదు’’ అంటూ ఆమె అప్పారావు ముఖం మీదే అన్నారు. తక్షణమే వీసీ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలకు ప్రొఫెసర్ శ్రీపతిరాముడు మద్దతు పలికారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన అప్పారావుకు వీసీగా కొనసాగే అర్హత లేదంటూ సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. ప్రొఫెసర్ దీపా శ్రీనివాస్, ప్రొఫెసర్ సునీతారాణి, ప్రొఫెసర్ రత్నం కూడా వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భేటీ నుంచి బయటకు వచ్చారు. చీఫ్ ఎగ్జామినర్ రాజీనామా వీసీ అప్పారావు అధ్యక్షతన పని చేయలేనంటూ అకడమిక్ కౌన్సిల్ కన్వీనర్ వి.కృష్ణ.. చీఫ్ ఎగ్జామినర్ పదవికి రాజీనామా చేశారు. అప్పారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనా మళ్లీ పదవి చేపట్టడం దుర్మార్గమంటూ ఆయన కూడా సమావేశాన్ని బహిష్కరించారు. అప్పారావు పదవి నుంచి తప్పుకోవడమొక్కటే సమస్యలకు పరిష్కారమని పేర్కొన్నారు. -
హెచ్ సీయూలో ఉద్రిక్తత
విద్యార్థుల చలో హెచ్ సీయూ పిలుపు, వీసీ అప్పారావు ఆధ్వర్యంలో అకడమిక్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోహిత్ వేముల మృతికి కారణమైన వీసీ అప్పారావును తొలగించాలని, రోహిత్ యాక్ట్ తీసుకురావాలనే డిమాండ్ తో హెచ్ సీయూ జాక్ బుధవారం చలో హెచ్ సీయూకి పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో వర్సిటీ వద్ద భద్రత కట్టు దిట్టం చేశారు. మీడియాతో సహా.. బయటి వారిని వర్సిటీలోకి అనుమతించడం లేదు. మరో వైపు యూనివర్సిటీ వీసీ అప్పారావు ఆధ్వర్యంలో అకడమిక్ కౌన్సిల్ సమావేశం జరగ నుంది. కౌన్సిల్ సమావేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని విద్యార్థి జేఏసీ స్పష్టం చేసింది. -
కదంతొక్కిన విద్యార్థులు
♦ హెచ్‌సీయూలో తరగతుల బహిష్కరణ.. జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ♦ వీసీగా అప్పారావు ఉన్నంతకాలం ఆందోళన చేస్తామని స్పష్టీకరణ ♦ వర్సిటీలో పరిస్థితులపై హెచ్చార్సీకి వివరణ అందజేసిన వీసీ అప్పారావు హైదరాబాద్: హెచ్‌సీయూ వీసీ అప్పారావు తిరి గి వర్సిటీలోకి రావడం, విద్యార్థులపై పోలీ సు లు లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ సోమవారం విద్యార్థులు కదంతొక్కారు. విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తరగతులను బహిష్కరిం చి.. ర్యాలీని నిర్వహించారు. వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట ధర్నా నిర్వహిం చారు. వీసీని తొలగించాల్సిందేని, అప్పటివరకు ఆందోళన విరమించబోమని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. రోహిత్ ఆత్మహత్య సహా అనేక పరి ణామాలకు కారణమైన వీసీని విధుల తొలగిం చాల్సిందేనని, అరెస్టు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని విద్యార్థి జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలని.. పోలీసులను క్యాం పస్ నుంచి పంపించాలని డిమాండ్ చేశారు. బెయిల్‌పై హర్షం హెచ్‌సీయూలో అరెస్టై రిమాండ్‌లో ఉన్న విద్యార్థులు, ప్రొఫెసర్లకు మధ్యంతర బెయిల్ రావడంతో విద్యార్థులంతా హర్షం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం క్యాంపస్ నుంచి ప్రధాన ద్వారం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల సహకారంతోనే బెయిల్ మంజూరైం దని విద్యార్థి నేత జుహెల్ కేపీ పేర్కొన్నారు. మరోవైపు విద్యార్థులు తరగతులను బహిష్కరించడంతో వీసీ నివాసం వద్ద పోలీసు బందోబస్తును తగ్గించారు. వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద హెచ్‌సీయూ భద్రతా సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఐడీ కార్డులున్న విద్యార్థులు, సిబ్బందిని లోపలికి అనుమతిస్తున్నారు. హెచ్చార్సీకి నివేదిక అందజేసిన వీసీ రోహిత్ ఆత్మహత్య తదనంతర పరిణా మాల్లో వర్సిటీ విద్యార్థులకు కనీస సదుపాయాలు కూడా అందడం లేదన్న ఫిర్యాదుపై మానవ హక్కుల కమిషన్ సోమవారం విచారణ చేపట్టింది. మధ్యాహ్నం 12.30 గంట లకు గట్టి పోలీసు బందోబస్తు మధ్య వీసీ అప్పారావు ఈ విచారణకు హాజరయ్యారు. వర్సిటీలోని పరిణామాలపై హెచ్చార్సీ చైర్మన్ జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రూకు ఒక నివేదికను అందజేశారు. వర్సిటీలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. బయటకు వచ్చిన అనంతరం మీడియా ప్రతినిధులు వీసీ అప్పారావును వివరాలడిగే ప్రయత్నం చేయగా... మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. -
ఉద్దేశపూర్వకంగానే విద్యార్థులపై దాడి
♦ హెచ్‌సీయూ ఘటనలపై ఢిల్లీకి చెందిన నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ♦ వీసీ అప్పారావు విద్యార్థులను రెచ్చగొట్టారు ♦ ఏబీవీపీ విద్యార్థులతో కలసి పోలీసులను రప్పించారు ♦ పోలీసులతో కలసి విచ్చలవిడిగా దాడికి పాల్పడ్డారు ♦ ఈ ఘటనలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూలో వీసీ అప్పారావు ఉద్దేశపూర్వకంగానే విద్యార్థులను రెచ్చగొట్టి, పోలీసులతో దాడికి పాల్పడ్డారని ఢిల్లీకి చెందిన స్వతంత్ర నిజ నిర్ధారణ కమిటీ అభిప్రాయపడింది. రోహిత్ ఆత్మహత్యకు కారకులైనవారిని తీవ్రంగా శిక్షించాలని... వర్సిటీలో శాంతి నెలకొనాలంటే వీసీ అప్పారావును క్యాంపస్‌లోకి అనుమతించవద్దని పేర్కొంది. ఢిల్లీకి చెందిన వివిధ సంఘాలతో కూడిన నిజ నిర్ధారణ కమిటీ తన మధ్యంతర నివేదికను శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విడుదల చేసింది. హెచ్‌సీయూలో భావప్రకటనా స్వేచ్ఛకు, సమీకరణ స్వేచ్ఛకు, ప్రశ్నించే స్వేచ్ఛకు భంగం కలిగించడం ద్వారా అప్పారావు, ఆయన అనుచరులు, పోలీసులు హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆ నివేదికలో పేర్కొంది. 22వ తేదీన వీసీ అప్పారావు తనకు అనుకూలురైన కొందరు అధ్యాపకులు, 30 మంది ఏబీవీపీ విద్యార్థులతో కలసి పోలీసులను రప్పించి వ్యూహాత్మకంగానే విద్యార్థులపై దాడి చేయించినట్లు ఆరోపించింది. విద్యార్థినులని కూడా చూడకుండా పోలీసులు దుర్భాషలాడుతూ కొట్టారని, అత్యాచారం చేస్తామంటూ భయభ్రాంతులకు గురిచేశారని పలువురు విద్యార్థినులు చెప్పారని పేర్కొంది. నిర్బంధించిన విద్యార్థులను సైతం పోలీసు వాహనాల్లో విపరీతంగా కొట్టారని తెలిపింది. పోలీసుల దాడిలో గాయపడి, ఆసుపత్రిపాలైన ఉదయభాను చెప్పిన విషయాల్లో పోలీసుల క్రూరత్వం బట్టబయలైందని నివేదికలో పేర్కొంది. ఇప్పటికీ కూడా క్యాంపస్‌లోని విద్యార్థులు భయాందోళన నుంచి తేరుకోలేదని వెల్లడించింది. ఈ నెల 22న హెచ్‌సీయూలో జరిగిన ఘటనలపై న్యాయ విచారణ జరిపించాలని... అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని, వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని కమిటీ డిమాండ్ చేసింది. హ్యూమన్‌రైట్స్ డిఫెండర్ అలర్ట్ ఇండియా ెహ న్రీ, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తారారావు, ఇంటర్నేషనల్ మూవ్మెంట్ అగెనైస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ నుంచి బర్నార్డ్ ఫాతిమా, కఫిర్ నల్గుండ్వార్ రౌండ్ టేబుల్ ఇండియా నుంచి కెరుబా మునిస్వామి, సుప్రీంకోర్టు లాయర్ బీనా పల్లికల్, నేషనల్ క్యాంపెయిన్ ఆన్ దళిత్ హ్యూమన్ రైట్స్ నుంచి రమేష్నాథన్, నేషనల్ దళిత్ మూవ్మెంట్ ఫర్ దళిత్ రైట్స్ నుంచి అశోక్ కొత్వాల్, ఆలిండియా దళిత్ మహిళా అధికార్ మంచ్, ఆసియా దళిత్ రైట్స్ ఫోరం నుంచి పాల్ దివకార్ తదితరులు ఈ నిజనిర్ధారణ కమిటీలో ఉన్నారు. -
హెచ్ఆర్సీ ముందు హాజరైన వీసీ
హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్శిటీ వ్యవహారం హెచ్ఆర్సీకి చేరింది. యూనివర్శిటీలో విద్యార్థులకు భోజన వసతి సౌకర్యాలు కల్పించడం లేదంటూ ఆమ్ఆద్మీపార్టీ నేత విశ్వేశ్వరరావు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీంతో హెచ్ ఆర్సీ వీసీకి నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీసీ అప్పారావు శనివారం హెచ్చార్సీ ముందు వివరణ ఇచ్చారు. -
రోహిత్ ఆత్మహత్య కేసు దర్యాప్తు ముమ్మరం
-
రోహిత్ ఆత్మహత్య కేసు దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి వర్సిటీ వీసీ అప్పారావు, కేంద్రమంత్రి దత్తాత్రేయ తదితరులపై నమోదైన కేసు దర్యాప్తును గచ్చిబౌలి పోలీసులు ముమ్మరం చేశారు. మాదాపూర్ డీసీపీ కార్తికేయ ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు మంగళవారం పలువురి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. రోహిత్ ఆత్మహత్య పూర్వాపరాలకు సంబంధించి ప్రాథమిక నివేదికను రూపొందించి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. అత్యంత సున్నితమైన అంశం కావడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాల సేకరణ, వాంగ్మూలాల నమోదు పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. దత్తాత్రేయ, రామచంద్రరావులపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మృతికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు కారకులని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ ఫిబ్రవరి 1 లోగా విచారణ నివేదికను కమిషన్‌కు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, సైబరాబాద్ సీపీ, హెచ్‌సీయూ వీసీలను ఆదేశించింది. హెచ్‌సీయూలో ఏబీవీపీ విద్యార్థులు రోహిత్‌తో పాటు పలువురు దళిత విద్యార్థులపై దాడులు చేయడమే కాకుండా గూండాలుగా ప్రచారం చేస్తూ కేసులు పెట్టారని పిడమర్తి ఆరోపించారు. దాడి చేసిన వారికి మద్దతు పలుకుతూ దళిత విద్యార్థులను వర్సిటీ నుంచి బహిష్కరించాలని దత్తాత్రేయ, రామ చంద్రరావులు వీసీపై ఒత్తిడి తెచ్చారన్నారు. దీంతో మనస్థాపానికి గురై రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఘటనకు బాధ్యులైన వారిద్దరినీ పదవి నుంచి తొలగించి, వీసీపై చర్యలు తీసుకోవాలని కోరారు.