మీ చేతుల మీదుగా పట్టా తీసుకోను... | VC Appa Rao Shock in HCU convocation | Sakshi
Sakshi News home page

మీ చేతుల మీదుగా పట్టా తీసుకోను...

Published Sun, Oct 2 2016 3:53 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

మీ చేతుల మీదుగా పట్టా తీసుకోను...

మీ చేతుల మీదుగా పట్టా తీసుకోను...

హెచ్‌సీయూ స్నాతకోత్సవంలో వీసీ అప్పారావుకు విద్యార్థి షాక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వార్షికోత్సవంలో వైస్‌చాన్సలర్ పొదిలి అప్పారావుకు పరాభవం ఎదురైంది. ఆయన చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టా స్వీకరించేందుకు ఓ పరిశోధక విద్యార్థి నిరాకరించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో శనివారం నిర్వహించిన హెచ్‌సీయూ 18వ స్నాతకోత్సవ వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫిలాసఫీలో పీహెచ్‌డీ పట్టా తీసుకోవాల్సిందిగా పరిశోధక విద్యార్థి సుంకన్నను ఆహ్వానించడంతో వేదికపైకి వెళ్లారు. వీసీ అప్పారావు అందిస్తున్న పట్టాను తీసుకోకుండా అలాగే నించున్నారు.
‘రోహిత్‌తోపాటు ఐదుగురు దళిత విద్యార్థుల రస్టికేషన్‌లో ప్రధాన నిందితుడు, రోహిత్ ఆత్మహత్యకు కారకుడైన మీ చేతుల మీదుగా పట్టాను స్వీకరించే కంటే ఓ క్లర్క్ చేతులపైగా నేను పట్టా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాను.’ అని స్టేజీపైనే వీసీకి తేల్చి చెప్పారు. దీంతో ప్రొ వీసీ అయిన బిపిన్ శ్రీవాస్తవ చేత సుంకన్నకు పట్టాను ఇప్పించారు. దీనిపైన విసి అప్పారావుని వివరణ కోరగా అది అతని అభిప్రాయమనీ, తానేం చేయలేననీ, దీన్ని ఇష్యూ చేయొద్దని సమాధానమిచ్చారు.

మా ఉద్యమం ఆగిపోలేదు...
పట్టాను తిరస్కరించిన సుంకన్న ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘అప్పారావు అంతా అయిపోయిందనుకుంటున్నారు. కానీ మా ఉద్యమం ఆగిపోలేదనీ, మా స్ట్రగుల్ కొనసాగుతుందనీ చెప్పేందుకే నేను వీసీ చేతుల మీదుగా పట్టాను తీసుకునేందుకు తిరస్కరించాను. గతంలో కూడా నేను ఇదే యూనివర్సిటీ నుంచి ఎంఏ ఫిలాసఫీ, ఎంఫిల్‌లోనూ పట్టాలు తీసుకున్నాను. కానీ ఎప్పుడూ తిరస్కరించలేదు. అప్పుడు వీసీలు అప్పారావులాగా వ్యవహరించలేదు. కానీ అప్పారావు దళిత విద్యార్థులను అణచివేయాలని ప్రయత్నించారు.

వివక్షతో ఆత్మహత్యలకు పురిగొల్పారు. రోహిత్ లాంటి మేధావి చనిపోవడానికి కారకుడయ్యారు. మమ్మల్ని రస్టికేట్ చేసి వేధించి, చివరకు హాస్టల్ నుంచి గెంటించాడు. రోడ్డుమీదపడ్డ మమ్మల్ని వదలకుండా వేధించారు. వెలివాడలో ఉన్నా, వెలివాడను కూడా కూలగొట్టించాడు. ఈ రోజు హెచ్‌సీయూ క్యాంపస్‌లో విద్యార్థులంతా అనుక్షణం భయంభయంగా బతుకుతున్నారంటే కారణం అప్పారావే. అందుకే అతని నుంచి పట్టాను తిరస్కరించి మా పోరాటాన్ని కొనసాగిస్తున్నట్టు అతనికి అర్థమయ్యేలా చెప్పాను.’ అని సుంకన్న చెప్పారు. అప్పారావుని, రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారందరినీ శిక్షించినప్పుడే మా పోరాటం ఆగుతుందని ఆయన స్పష్టం చేశారు.
 
యువతరమే దేశానికి వెన్నెముక: బిబేక్ డెబ్రాయ్
హెచ్‌సీయూ వీసీ అప్పారావు అధ్యక్షతన జరిగిన స్నాతకోత్సవంలో 1564 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. ఇందులో 267 మందికి పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేశారు. చదువులో అత్యధిక ప్రతిభ కనబర్చిన 99 మంది విద్యార్థులకు అవార్డులిచ్చారు. డాక్టర్ బిబేక్ దెబ్రాయ్ మాట్లాడుతూ ఈ దేశాన్ని ముందుకు నడిపించేది యువతరమేనని అన్నారు. వీసీ అప్పారావు మాట్లాడుతూ 4 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సెంట్రల్ యూనివర్సిటీ నాణ్యతాపరంగానూ, అన్ని విషయాల్లోనూ ముందున్నదన్నారు.

అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎస్.వేణుగోపాల్, తెలుగు విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ డి.వెంకటేశ్వర్‌రావు, స్కూల్ ఆఫ్ లైఫ్ సెన్సైస్ డాక్టర్ ఇ.సురేష్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న అలోక్ కుమార్ మిశ్రాలకు డాక్టర్ బిబేక్ దెబ్రయ్ చేతులమీదుగా చాన్సలర్ అవార్డులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement