ఉన్నత విద్యావంతులు ఈ ఉద్యోగానికి అర్హులు కారని స్పష్టం చేస్తున్న నోటిఫికేషన్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అది కేవలం ఓ సబార్డినేట్ పోస్టు.. సూటిగా చెప్పాలంటే ఆఫీస్ బాయ్ ఉద్యోగం. ఈ పోస్టుకు అర్హత ఏడో తరగతి పాస్ లేదా పదో తరగతి ఫెయిల్. పదో తరగతి పాస్ అయినా.. అంతకుమించి విద్యార్హతలు ఉన్నా.. వారు అనర్హులు. కానీ విచిత్రంగా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు, పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులే కావడం గమనార్హం.
దరఖాస్తు చేసుకోవడమే కాదు, పరీక్ష రాసి పాసై ఎంపికయ్యారు. ఇక్కడే వివాదం చెలరేగుతోంది. ఈ ఏడాది జూన్ 23న కోర్టు సబార్డినేట్ పోస్టుల్లో గోల్‌మాల్ శీర్షికన ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం ప్రచురించడంతో ఈ వ్యవహారంపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అసలేం జరిగింది?
రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్టుల్లోని దాదాపు 686 ఆఫీస్ సబార్డినేట్/అటెండర్ పోస్టుల భర్తీకి 2019 జూలైలో నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి జిల్లాలవారీగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌లో ఆదిలాబాద్‌లో 40, కరీంనగర్ 96, ఖమ్మం 78, మహబూబ్‌నగర్ 79, మెదక్ 86, నిజామాబాద్ 80, నల్లగొండ 64, రంగారెడ్డి 45, వరంగల్ 47, హైదరాబాద్‌లోని వివిధ కోర్టుల్లో 71 పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు ఏడో తరగతి పాస్ లేదా పదో తరగతి ఫెయిల్ అయిన అభ్యర్థులు మాత్రమే అర్హులని, ఉన్నత విద్యావంతులు ఈ ఉద్యోగానికి అర్హులు కారని నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయి 2019 నవంబర్‌లో అభ్యర్థులంతా ఆన్‌లైన్‌లో పరీక్ష రాశారు. 2021 జూలైలో ఎంపికైన అభ్యర్థుల్లో 1:3 ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్, అనంతరం ఇంటర్వ్యూలకు పిలిచారు.
ప్రైవేటులో ఉన్నతోద్యోగులే..
ఈ విషయంలో వరుస ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కరీంనగర్ జిల్లాలో ఎంపికైన 395 మందిలో 195 మంది ఓవర్ క్వాలిఫైడ్‌గా గుర్తించి వారిని పక్కనబెట్టారు. మిగిలిన వారికి 2022 ఫిబ్రవరిలో తిరిగి ఇంటర్వ్యూలు నిర్వహించి 93 మందితో తుది జాబితా ప్రకటించారు. ఈ జాబితాలోనూ ఓవర్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నారని పదో తరగతి ఫెయిలైన అభ్యర్థులు ఆరోపించారు.
ఇదే విషయాన్ని జూన్ 23న ‘సాక్షి’ కరీంనగర్ ఎడిషన్‌లో బయటపెట్టింది. దీనిపై స్పందించిన కరీంనగర్, రామగుండం కమిషనరేట్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల్లో చాలా మంది తాము అనర్హులమని అంగీకరించారు. ఇప్పటికే కరీంనగర్ స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ దర్యాప్తులో ఓవర్ క్వాలిఫైడ్‌గా తేలిన వారి జాబితా సిద్ధమైంది. వారంతా వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉన్నత ఉద్యోగాల్లో ఉండటం గమనార్హం.
ఎందుకు చిక్కడం లేదు..?
ఎంపికైన అభ్యర్థుల్లో కొందరు తమ నిజమైన అర్హతలు దాచి దరఖాస్తు చేస్తే.. మరికొందరు ఏకంగా కొన్ని స్కూళ్లలో చదవకపోయినా.. చదివినట్లు నకిలీ సర్టి ఫికెట్లు సృష్టించి ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అభ్య ర్థుల్లో 90% మంది తెలుగు మీడియం విద్యార్థులు. 2000 సంవత్సరం తరువాత చాలామటుకు ప్రైవేటు తెలుగు మీడియం స్కూళ్లు మూతబడ్డాయి. ఆ స్కూళ్ల రికార్డులు లభించకపోవడంతో ఎవరు ఏ స్కూలు విద్యార్థులో నిర్ధా రించడంలో అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల్లో ఎంపికైన చాలామందిలో ఓవర్‌క్వాలిఫైడ్ అభ్యర్థులున్నారని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు సిద్దిపేట జిల్లాలో ఇవే పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల్లో ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు ఉన్నారని, వారికి టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ ఐడీలు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ విషయంలో హుస్నాబాద్ నుంచి ఎంపికైన అభ్యర్థి ఉన్నత విద్యావంతుడంటూ హుజూరాబాద్‌కు చెందిన కత్తి రమేశ్ అనే వ్యక్తి సాక్ష్యాధారాలతో హైకోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment