Ph.D. Graduate
-
Anita Sharma: కదలండి కదిలించండి
ఆమె పోలియో బాధితురాలు. ఐ.ఐ.ఎం. ఇండోర్‌లో పీహెచ్డీ చేసిన విద్యాధికురాలు. కాని ఆమె తన జీవితాన్ని దివ్యాంగుల కోసం అంకితం చేసింది. పట్టుదలగా డ్రైవింగ్ నేర్చుకోవడమేగాక దివ్యాంగులకు డ్రైవింగ్ నేర్పించే స్కూల్ నడుపుతోంది. ఏయే పరికరాలు అమర్చడం ద్వారా దివ్యాంగులు సులభంగా డ్రైవ్ చేయవచ్చో తెలుపుతోంది. ‘డ్రైవ్ ఆన్ మై ఓన్’ సంస్థ నడుపుతున్న డాక్టర్ అనితా శర్మ గురించి. అనితాశర్మకు కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనిపించింది. జైపూర్ ఆమెది. జైపూర్‌లో పదిహేను, ఇరవై కాల్స్ చేసింది. ఎవరూ నేర్పించము అన్నారు. ఢిల్లీలో నేర్పుతారేమోనని అక్కడా ఒక పది, ఇరవై కాల్స్ చేసింది. అక్కడా ఎవరూ నేర్పము అన్నారు. కారణం? అనిత కుడికాలుకు పోలియో ఉంది. పోలియోతో బాధ పడుతున్నవారికి, లేదా ఇతర దివ్యాంగులకు కారు డ్రైవింగ్ నేర్పించే తర్ఫీదు డ్రైవింగ్ స్కూల్స్‌కు లేదు. అలా చేయడానికి అవసరమైన మోడిఫైడ్ కార్లు వారి దగ్గర ఉండవు. దివ్యాంగులు చక్రాల కుర్చీకి పరిమితం కావలసిందేనా? వారు తమకు తాముగా బయటకు తిరగకూడదా అనుకుంది అనితా శర్మ. తల్లి సహాయంతో... అనితా శర్మ ఇండోర్ ఐ.ఐ.ఎంలో పీహెచ్డీ చేసింది. అమృతసర్ ఐ.ఐ.ఎంలో ్ర΄÷ఫెసర్ ఉద్యోగం సం΄ాదించింది. అయితే ఆమెకు కారు నడ΄ాలన్న కోరిక మాత్రం తీరలేదు. ‘మొదట నేను అదనపు చక్రాలు బిగించిన టూ వీలర్ నడి΄ాను. నా ఆనందానికి అవధుల్లేవు. కారు నడిపితే ఎంత బాగుండో అనిపించింది. హ్యాండ్ కంట్రోల్ ఉండేలా కారును మోడిఫై చేయించి మా అమ్మ సహాయంతో నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఎప్పుడైనా ఎక్కడికైనా నా కారులో ప్రయాణించగలను. నేను కారు నడపడం చూసి చాలామంది దివ్యాంగులు మాకు నేర్పించవచ్చు కదా అనడిగేవారు. వారి కోసం పని చేయాలనిపించింది. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేసి‘డ్రైవ్ ఆన్ మై ఓన్’ సంస్థ స్థాపించాను. దివ్యాంగులకు కారు డ్రైవింగ్ నేర్పించి, సొంత కారు కొనుక్కోవడంలో అవసరమైన సాయం చేయడమే మా సంస్థ ఉద్దేశం’ అంటుందామె. కస్టమైజ్డ్ కార్లు అనితాశర్మ సంస్థ దివ్యాంగుల కోసం డ్రైవింగ్ క్లాసులు నిర్వహిస్తుంది. వెబినార్లు, సెమినార్లు నిర్వహిస్తుంది. దివ్యాంగుల కమ్యూనిటీలో ఒకరికొకరికి పరిచయాలు చేసి ్రపోత్సహించుకునేలా చేస్తుంది. శారీరక పరిమితులను అనుసరించి కారులో ఎటువంటి మోడిఫికేషన్ చేస్తే కారు నడపవచ్చో సూచిస్తుంది. ఆ మోడిఫికేషన్ పరికరాలు సమకూర్చడంలో సాయం చేస్తుంది. ఆ తర్వాత కార్ల రిజిస్ట్రేషన్, జిఎస్టి వంటివి దివ్యాంగుల పక్షంలో జరిగేలా చూస్తుంది. ‘ఇదంతా చేయడానికి మేము కొంత ఫీజు తీసుకుంటాం. దివ్యాంగులు ఛారిటీ మీద కాకుండా తమ కాళ్ల మీద తాము బతకాలన్నదే నా ఉద్దేశం’ అంటుంది అనితా శర్మ. కుటుంబ సభ్యులు ‘దివ్యాంగులు కారు నడపడానికి వారి కుటుంబసభ్యులను ఒప్పించడమే పెద్ద సమస్య. దివ్యాంగులు కారు నడపగలరు. వారిని డ్రైవింగ్ సీట్లో స్లయిడర్స్ ద్వారా సులువుగా చేర్చవచ్చు. కాళ్లతో పని లేకుండా చేతులతోనే మొత్తం కంట్రోల్ చేయొచ్చు. వారికి తిరగాలని ఉంటుంది. ధైర్యం చెప్పి సహకరించి తిరగనివ్వండి’ అని సూచిస్తోంది అనితా శర్మ. -
ఏడో తరగతి కొలువుకు పీజీ అభ్యర్థుల ఎంపిక!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అది కేవలం ఓ సబార్డినేట్ పోస్టు.. సూటిగా చెప్పాలంటే ఆఫీస్ బాయ్ ఉద్యోగం. ఈ పోస్టుకు అర్హత ఏడో తరగతి పాస్ లేదా పదో తరగతి ఫెయిల్. పదో తరగతి పాస్ అయినా.. అంతకుమించి విద్యార్హతలు ఉన్నా.. వారు అనర్హులు. కానీ విచిత్రంగా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు, పీహెచ్డీ చేసిన అభ్యర్థులే కావడం గమనార్హం. దరఖాస్తు చేసుకోవడమే కాదు, పరీక్ష రాసి పాసై ఎంపికయ్యారు. ఇక్కడే వివాదం చెలరేగుతోంది. ఈ ఏడాది జూన్ 23న కోర్టు సబార్డినేట్ పోస్టుల్లో గోల్మాల్ శీర్షికన ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం ప్రచురించడంతో ఈ వ్యవహారంపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగింది? రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్టుల్లోని దాదాపు 686 ఆఫీస్ సబార్డినేట్/అటెండర్ పోస్టుల భర్తీకి 2019 జూలైలో నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి జిల్లాలవారీగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్లో ఆదిలాబాద్‌లో 40, కరీంనగర్ 96, ఖమ్మం 78, మహబూబ్‌నగర్ 79, మెదక్ 86, నిజామాబాద్ 80, నల్లగొండ 64, రంగారెడ్డి 45, వరంగల్ 47, హైదరాబాద్‌లోని వివిధ కోర్టుల్లో 71 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఏడో తరగతి పాస్ లేదా పదో తరగతి ఫెయిల్ అయిన అభ్యర్థులు మాత్రమే అర్హులని, ఉన్నత విద్యావంతులు ఈ ఉద్యోగానికి అర్హులు కారని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయి 2019 నవంబర్‌లో అభ్యర్థులంతా ఆన్లైన్లో పరీక్ష రాశారు. 2021 జూలైలో ఎంపికైన అభ్యర్థుల్లో 1:3 ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్, అనంతరం ఇంటర్వ్యూలకు పిలిచారు. ప్రైవేటులో ఉన్నతోద్యోగులే.. ఈ విషయంలో వరుస ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కరీంనగర్ జిల్లాలో ఎంపికైన 395 మందిలో 195 మంది ఓవర్ క్వాలిఫైడ్‌గా గుర్తించి వారిని పక్కనబెట్టారు. మిగిలిన వారికి 2022 ఫిబ్రవరిలో తిరిగి ఇంటర్వ్యూలు నిర్వహించి 93 మందితో తుది జాబితా ప్రకటించారు. ఈ జాబితాలోనూ ఓవర్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నారని పదో తరగతి ఫెయిలైన అభ్యర్థులు ఆరోపించారు. ఇదే విషయాన్ని జూన్ 23న ‘సాక్షి’ కరీంనగర్ ఎడిషన్‌లో బయటపెట్టింది. దీనిపై స్పందించిన కరీంనగర్, రామగుండం కమిషనరేట్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల్లో చాలా మంది తాము అనర్హులమని అంగీకరించారు. ఇప్పటికే కరీంనగర్ స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ దర్యాప్తులో ఓవర్ క్వాలిఫైడ్‌గా తేలిన వారి జాబితా సిద్ధమైంది. వారంతా వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉన్నత ఉద్యోగాల్లో ఉండటం గమనార్హం. ఎందుకు చిక్కడం లేదు..? ఎంపికైన అభ్యర్థుల్లో కొందరు తమ నిజమైన అర్హతలు దాచి దరఖాస్తు చేస్తే.. మరికొందరు ఏకంగా కొన్ని స్కూళ్లలో చదవకపోయినా.. చదివినట్లు నకిలీ సర్టి ఫికెట్లు సృష్టించి ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అభ్య ర్థుల్లో 90% మంది తెలుగు మీడియం విద్యార్థులు. 2000 సంవత్సరం తరువాత చాలామటుకు ప్రైవేటు తెలుగు మీడియం స్కూళ్లు మూతబడ్డాయి. ఆ స్కూళ్ల రికార్డులు లభించకపోవడంతో ఎవరు ఏ స్కూలు విద్యార్థులో నిర్ధా రించడంలో అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల్లో ఎంపికైన చాలామందిలో ఓవర్‌క్వాలిఫైడ్ అభ్యర్థులున్నారని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు సిద్దిపేట జిల్లాలో ఇవే పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల్లో ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు ఉన్నారని, వారికి టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఐడీలు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ విషయంలో హుస్నాబాద్ నుంచి ఎంపికైన అభ్యర్థి ఉన్నత విద్యావంతుడంటూ హుజూరాబాద్‌కు చెందిన కత్తి రమేశ్ అనే వ్యక్తి సాక్ష్యాధారాలతో హైకోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ నడుస్తోంది. -
మీ చేతుల మీదుగా పట్టా తీసుకోను...
హెచ్‌సీయూ స్నాతకోత్సవంలో వీసీ అప్పారావుకు విద్యార్థి షాక్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వార్షికోత్సవంలో వైస్‌చాన్సలర్ పొదిలి అప్పారావుకు పరాభవం ఎదురైంది. ఆయన చేతుల మీదుగా పీహెచ్డీ పట్టా స్వీకరించేందుకు ఓ పరిశోధక విద్యార్థి నిరాకరించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో శనివారం నిర్వహించిన హెచ్‌సీయూ 18వ స్నాతకోత్సవ వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫిలాసఫీలో పీహెచ్డీ పట్టా తీసుకోవాల్సిందిగా పరిశోధక విద్యార్థి సుంకన్నను ఆహ్వానించడంతో వేదికపైకి వెళ్లారు. వీసీ అప్పారావు అందిస్తున్న పట్టాను తీసుకోకుండా అలాగే నించున్నారు. ‘రోహిత్‌తోపాటు ఐదుగురు దళిత విద్యార్థుల రస్టికేషన్లో ప్రధాన నిందితుడు, రోహిత్ ఆత్మహత్యకు కారకుడైన మీ చేతుల మీదుగా పట్టాను స్వీకరించే కంటే ఓ క్లర్క్ చేతులపైగా నేను పట్టా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాను.’ అని స్టేజీపైనే వీసీకి తేల్చి చెప్పారు. దీంతో ప్రొ వీసీ అయిన బిపిన్ శ్రీవాస్తవ చేత సుంకన్నకు పట్టాను ఇప్పించారు. దీనిపైన విసి అప్పారావుని వివరణ కోరగా అది అతని అభిప్రాయమనీ, తానేం చేయలేననీ, దీన్ని ఇష్యూ చేయొద్దని సమాధానమిచ్చారు. మా ఉద్యమం ఆగిపోలేదు... పట్టాను తిరస్కరించిన సుంకన్న ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘అప్పారావు అంతా అయిపోయిందనుకుంటున్నారు. కానీ మా ఉద్యమం ఆగిపోలేదనీ, మా స్ట్రగుల్ కొనసాగుతుందనీ చెప్పేందుకే నేను వీసీ చేతుల మీదుగా పట్టాను తీసుకునేందుకు తిరస్కరించాను. గతంలో కూడా నేను ఇదే యూనివర్సిటీ నుంచి ఎంఏ ఫిలాసఫీ, ఎంఫిల్లోనూ పట్టాలు తీసుకున్నాను. కానీ ఎప్పుడూ తిరస్కరించలేదు. అప్పుడు వీసీలు అప్పారావులాగా వ్యవహరించలేదు. కానీ అప్పారావు దళిత విద్యార్థులను అణచివేయాలని ప్రయత్నించారు. వివక్షతో ఆత్మహత్యలకు పురిగొల్పారు. రోహిత్ లాంటి మేధావి చనిపోవడానికి కారకుడయ్యారు. మమ్మల్ని రస్టికేట్ చేసి వేధించి, చివరకు హాస్టల్ నుంచి గెంటించాడు. రోడ్డుమీదపడ్డ మమ్మల్ని వదలకుండా వేధించారు. వెలివాడలో ఉన్నా, వెలివాడను కూడా కూలగొట్టించాడు. ఈ రోజు హెచ్‌సీయూ క్యాంపస్‌లో విద్యార్థులంతా అనుక్షణం భయంభయంగా బతుకుతున్నారంటే కారణం అప్పారావే. అందుకే అతని నుంచి పట్టాను తిరస్కరించి మా పోరాటాన్ని కొనసాగిస్తున్నట్టు అతనికి అర్థమయ్యేలా చెప్పాను.’ అని సుంకన్న చెప్పారు. అప్పారావుని, రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారందరినీ శిక్షించినప్పుడే మా పోరాటం ఆగుతుందని ఆయన స్పష్టం చేశారు. యువతరమే దేశానికి వెన్నెముక: బిబేక్ డెబ్రాయ్ హెచ్‌సీయూ వీసీ అప్పారావు అధ్యక్షతన జరిగిన స్నాతకోత్సవంలో 1564 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. ఇందులో 267 మందికి పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేశారు. చదువులో అత్యధిక ప్రతిభ కనబర్చిన 99 మంది విద్యార్థులకు అవార్డులిచ్చారు. డాక్టర్ బిబేక్ దెబ్రాయ్ మాట్లాడుతూ ఈ దేశాన్ని ముందుకు నడిపించేది యువతరమేనని అన్నారు. వీసీ అప్పారావు మాట్లాడుతూ 4 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సెంట్రల్ యూనివర్సిటీ నాణ్యతాపరంగానూ, అన్ని విషయాల్లోనూ ముందున్నదన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎస్.వేణుగోపాల్, తెలుగు విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ డి.వెంకటేశ్వర్రావు, స్కూల్ ఆఫ్ లైఫ్ సెన్సైస్ డాక్టర్ ఇ.సురేష్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న అలోక్ కుమార్ మిశ్రాలకు డాక్టర్ బిబేక్ దెబ్రయ్ చేతులమీదుగా చాన్సలర్ అవార్డులు అందజేశారు.