రోహిత్ మృతి దురదృష్టకరం
అంబేడ్కర్ మనవడు ఆనంద్ తేల్ తుంబ్డే ఆవేదన
కల్వకుర్తి రూరల్/వెల్దండ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య అత్యంత దురదృష్టకరమని అంబేడ్కర్ మనవడు, ప్రొఫెసర్ ఆనంద్ తేల్ తుంబ్డే వ్యాఖ్యానించారు. రాజకీయ కారణాలతోనే వర్సిటీ వైస్ చాన్స్‌లర్‌పై ఒత్తిడి తెచ్చి ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో విలేకరులతో మాట్లాడారు. ఏబీవీపీ, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయన్న విషయం తేటతెల్లమవుతుందని చెప్పారు. దళితులను సమాజానికి దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు.
సమావేశంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రత్నం తదితరులు ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలం తాండ్ర గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు.