అంబేద్కర్ విగ్రహం ధ్వంసం
శ్రీరంగాపూర్‌లో ఘటన పాక్షికంగా దెబ్బతిన్న వైనం
నిందితులను కఠినంగా శిక్షించాలి
దళిత సంఘాల నాయకుల ఆందోళన
పదిమంది కేసులు నమోదు చేసిన పోలీసులు
శ్రీరంగాపూర్ (పెబ్బేరు) : మండలంలోని శ్రీరంగాపూర్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని కొందరు దుండగులు రాళ్లతో దాడిచేయడంతో విగ్రహం పాక్షికంగా దెబ్బతింది. విగ్రహం దెబ్బతిన్న విషయాన్ని బుధవారం ఉదయం గుర్తించిన దళితసంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో శ్రీరంగాపూర్ గ్రామ అంబేద్కర్ యువజన సంఘం, ఇతర దళిత సంఘాల నాయకులు విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారినిశిక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వనపర్తి ఆర్డీఓ రాంచందర్, ఇన్‌చార్జి తహశీల్దార్ రాజేందర్‌గౌడ్, కొత్తకోట సీఐ కిషన్, పెబ్బేరు ఎస్‌ఐ ప్రకాష్‌యాదవ్ ఆందోళనకారులతో మాట్లాడారు. నిందితులను త్వరలోనే పట్టుకొని కేసులు నమోదు చేస్తామని హామీనిచ్చారు.
పది మందిపై కేసులు నమోదు
వనపర్తి డీఎస్పీ జోగుల చెన్నయ్య ఆదేశాలతో కొత్తకోట సీఐ కిషన్, పెబ్బేరు ఎస్‌ఐ ప్రకాష్ యాదవ్, ఇతర సిబ్బంది బుధవారం అంబేద్కర్ విగ్రహం ధ్వంసం సంఘటనపై విచారణ చేశారు. బోనాల పండుగ సందర్భంగా మంగళవారం అర్థరాత్రి మద్యం కోసం గ్రామానికి చెందిన కేశపాగ కుర్మన్నతో అదే గ్రామానికి చెందిన కొందరు దాడిచేసినట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు నిర్థారించారు. ఇదే గ్రామానికి చెందిన సంపత్‌కుమార్, రంగస్వామినాయుడు, క్రాంతికుమార్, వెంకటేష్, స్వామి, దేవదాసు, రవి, నరసింహ, రవి, పరమేష్‌లపై వివిధ సెక్షన్లపై కేసు నమోదు చేశారు.
వీరిలో ప్రస్తుతం ఐదు మంది పోలీసుల అదుపులో ఉన్నారు. హోటల్ నిర్వాహకుడు కేశపాగ కుర్మన్న ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు నమోదు చేసినట్లు కొత్తకోట సీఐ కిషన్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటస్వామి, మాజీ ఉప సర్పంచ్ బీసన్న, నాయకులు బుచ్చన్న, ఎల్లస్వామి, చంద్రయ్య, కురుమన్న, బాలస్వామి, ఎల్లస్వామి, పర్వతాలు, చెన్నమ్మ, దేవమ్మ, మణ్యం, గంధం రాజశేఖర్, వివిధ గ్రామాల దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.