‘వార్ జోన్’లుగా వర్సిటీలు
మేధావుల వ్యాఖ్య
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల్లో దళిత విద్యార్థుల అంశంపై రాజకీయ దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో.. విద్యాసంస్థలు వార్ జోన్లుగా మారుతున్నాయని మేధావులు ఆవేదన వ్యక్తం చేశారు. గత పది, పదిహేనేళ్లుగా పేద విద్యార్థులు వర్సిటీల్లో చేరి.. భిన్న సైద్ధాంతిక గ్రూపుల మధ్య బలైపోతున్నారని విమర్శించారు. ఢిల్లీలో 40 మంది జాతీయ, అంతర్జాతాయ మేధావులు (మోదీ ప్రభుత్వానికి అనుకూలమని భావిస్తున్నారు) సమావేశమై.. ఇటీవలి కాలంలో వర్సిటీల్లో జరుగుతున్న అంశాలపై చర్చించారు.
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత వర్సిటీల్లో నెలకొన్న పరిస్థితులు బయటపడుతున్నాయన్నారు. కొత్త ముద్ర వేసుకున్న ప్రొఫెసర్లు, ప్రభుత్వ యంత్రాంగంలో వారికి సహకరిస్తున్న అధికారుల కబంధ హస్తాల నుంచి విద్యావ్యవస్థను బయటపడేయాలన్నారు. ఐసీహెచ్‌ఆర్ సభ్యుడు ఎండీ శ్రీనివాస్, సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ సభ్యుడు మధు పూర్ణిమ కిశ్వార్, వివిధ ఐఐటీలు, ఐఐఎంలు, విదేశీ వర్సిటీల ప్రొఫెసర్లు తాము చర్చించిన అంశాలపై ఓ ప్రకటన విడుల చేశారు. వర్సిటీలు, విద్యాసంస్థల్లో కుల వివక్షకు మించి.. విద్యాసంస్థ ప్రాంగణంలో నెలకొంటున్న తీవ్రమైన సైద్ధాంతిక భేదాభిప్రాయాలతోనే.. విద్యా వాతావరణం పాడవుతోందన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలతోనే మొత్తం సంస్థ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. రోహిత్ ఆత్మహత్య మొదటిదేమీ కాదని.. అలాగని, కేంద్రం సరైన చర్యలు తీసుకోకపోతే చివరిది కూడా కాకపోవచ్చని అన్నారు.