హెచ్‌సీయూలో ఘర్షణలపై గతంలోనే హైకోర్టుకు పోలీసుల నివేదన
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూలోని విద్యార్థి సంఘాలతో, సోషల్ మీడియాతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆ వర్సిటీ విద్యార్థులకు స్పష్టం చేశామని.. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటే తలెత్తే పరిణామాలను కూడా వివరించామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ గతంలోనే హైకోర్టుకు వివరించారు. విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు జరిగిన సమయంలో వర్సిటీ అధికారుల ఉదాసీన వైఖరివల్ల, కఠినంగా వ్యవహరించక పోతుండ టం వల్లే ఆ ఘటనలు పునరావృతం అవుతున్నట్లు విద్యార్థులు చెప్పారన్నారు. దాడికి పాల్పడ్డ వారితో పోలీసులు కుమ్కక్కయ్యారంటూ సుశీల్‌కుమార్ తల్లి చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కోర్టుకు నివేదించారు.
మూడు నెలల కిందే..: సుశీల్‌పై దాడి నేపథ్యంలో అతడికి భద్రత కల్పించాలని కోరుతూ తల్లి వినయ హైకోర్టులో గత ఆగస్టు 27న పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు సి.వి.ఆనంద్ అక్టోబర్ 3న కౌంటర్ దాఖలు చేశారు. ‘‘హెచ్‌సీయూలో ఏబీవీపీ, ఏఎస్‌ఏలు క్రియాశీలక విద్యార్థి సంఘాలు. యాకుబ్ మెమన్ ఉరితీతను నిరసిస్తూ ఏఎస్‌ఏ ప్రదర్శన నిర్వహించింది. దాన్ని సుశీల్‌కుమార్ వ్యతిరేకించడంతో పాటు ఏఎస్‌ఏ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఏఎస్‌ఏ విద్యార్థులు సుశీల్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, క్షమాపణలు చెప్పాలని ఒత్తిడి చేశారు.
ఈ క్రమంలో సుశీల్‌కు, ఏఎస్‌ఏ విద్యార్థులకు ఘర్షణ జరిగింది. సుశీల్‌కు గాయాలుకాగా ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులకు సమాచారం అందడంతో వారు వచ్చి సుశీల్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దాని ఆధారంగా ప్రశాంత్, రోహిత్ వేముల, విన్సెంట్, శేషు, సుగన్న తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుశీల్‌కు అయిన గాయాలు చిన్నవేననంటూ డాక్టర్లు మెడికల్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోంది’’ అని సి.వి.ఆనంద్ పేర్కొన్నారు.