ప్రశాంత్ న్యాయవాదికి ఆటంకాలు కలిగించవద్దు
హెచ్‌సీయూ వర్గాలకు హైకోర్టు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ పీహెచ్‌డీ విద్యార్థి ప్రశాంత్‌ను కలిసేందుకు అతని తరఫు న్యాయవాదికి ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దని హైకోర్టు గురువారం యూనివర్సిటీ వర్గాలకు స్పష్టం చేసింది. ప్రశాంత్‌ను కలిసే విషయంలో ముందస్తు సమాచారంతో వెళ్లాలని అతని తరఫు న్యాయవాదికి తేల్చి చెప్పింది. అంతేకాక తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ హెచ్‌సీయూ వీసీ అప్పారావు దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు మరోసారి ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ అప్పారావు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ప్రశాంత్ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను గురువారం న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ విచారించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, తన క్లయింట్ ప్రశాంత్‌ను కలిసేందుకు యూనివర్సిటీకి వెళితే వర్సిటీ భదత్రా సిబ్బంది అడ్డుకుని బెదిరించారని తెలిపారు. దీనికి యూనివర్సిటీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా రావడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, క్లయింట్‌ను కలిసే హక్కు న్యాయవాదికి ఉందన్నారు. ప్రశాంత్‌ను కలిసే విషయంలో వర్సిటీ వర్గాలకు ముందస్తు సమాచారం ఇచ్చి వెళ్లాలని అతని తరఫు న్యాయవాదికి స్పష్టం చేశారు.