బయటి వ్యక్తులను అడుగు పెట్టనివ్వొద్దు
పసంగాలకు ఎవరికీ అనుమతినివ్వడానికి వీల్లేదు
హెచ్‌సీయూ, పోలీసు వర్గాలకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లోకి బయట వ్యక్తులెవరూ అడుగుపెట్టడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సమావేశాలు పెట్టి, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి యూనివర్సిటీ విద్యా వాతావరణాన్ని చెడగొట్టేందుకు ఏ వ్యక్తికి గానీ, సంఘాలకు గానీ, రాజకీయ పార్టీలకు గానీ అనుమతినివ్వరాదని అటు యూనివర్సిటీ వర్గాలను, ఇటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల పూర్తి పాఠం సిద్ధం కాకపోవడంతో మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. హెచ్‌సీయూలో నెలకొన్న వివాదాలను పరిష్కరించి విద్యా వాతావరణాన్ని కాపాడాలని, ఇందుకు ఓ మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిని విచారించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాజ్యంలో తాజాగా వినోద్‌కుమార్ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారించారు. హెచ్‌సీయూలో నెలకొని ఉన్న పరిస్థితుల్లో పలువురు వ్యక్తులు, సంఘాలు, రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాయని.. దీనివల్ల పరిస్థితులు దారుణంగా తయారువుతున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది నజీర్‌ఖాన్ వివరించారు.