ఎనిమిది వర్సిటీలకు కొత్త వీసీలు | Vice chancellor to appoint for eight universities | Sakshi
Sakshi News home page

ఎనిమిది వర్సిటీలకు కొత్త వీసీలు

Published Tue, Jul 26 2016 2:44 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

Vice chancellor to appoint for eight universities

- నియామక ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
- హైకోర్టు తుది తీర్పునకు లోబడే ఉంటాయని స్పష్టీకరణ
- ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్లకు ప్రాధాన్యం.. నియమితులైనవారిలో ఐదుగురు రిటైర్డ్ ప్రొఫెసర్లు
- వెంటనే బాధ్యతలు స్వీకరించిన వీసీలు
- త్వరలోనే మరో మూడు వర్సిటీలకు వీసీల నియామకాలు

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు ప్రభుత్వం వైస్ చాన్స్‌లర్ (వీసీ)లను నియమించింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మహాత్మాగాంధీ వర్సిటీకి ఇదివరకే అల్తాఫ్ హుస్సేన్‌ను వీసీగా నియమించగా... సోమవారం ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూహెచ్, అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ, పాలమూరు, తెలంగాణ, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, జయశంకర్ వ్యవసాయ వర్సిటీలకు వీసీలను నియమిస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు.
 
 ఇంకా కరీంనగర్‌లోని శాతవాహన, హైదరాబాద్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, బాసరలోని ఆర్‌జీయూకేటీలకు వీసీలను నియమించాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో వాటికి కూడా వీసీలను నియమించే అవకాశముంది. ఇక ప్రస్తుతం వీసీలుగా నియమితులైన వారు మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నియామకాలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. మరోవైపు నియామక ఉత్తర్వులు జారీ కాగానే సోమవారం వీసీలంతా ఆయా యూనివర్సిటీల్లో బాధ్యతలు స్వీకరించారు.
 
 రెండేళ్లుగా ఇన్‌చార్జుల పాలన: రాష్ట్రంలోని వర్సిటీలన్నీ సుమారు గత రెండేళ్ల పాటు ఇన్‌చార్జుల పాలనలోనే ఉన్నాయి. రాష్ట్ర విభజనకు ముందే 2013 డిసెంబర్‌లో అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ వీసీ పోస్టు ఖాళీ కాగా.. 2013 అక్టోబర్‌లో జేఎన్‌ఏఎఫ్‌ఏయూ వీసీ పోస్టు, 2014లో ఉస్మానియా, జేఎన్టీయూహెచ్, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, తెలుగు వర్సిటీ, పాలమూరు, మహాత్మాగాంధీ వర్సిటీల వీసీ పోస్టులు ఖాళీ అయ్యాయి. మహాత్మాగాంధీ వర్సిటీకి ఇటీవల వీసీని నియమించగా, 8 వర్సిటీలకు సోమవారం వీసీలను నియమించారు.
 
 ఐదుగురు రిటైర్ అయినవారే..: ప్రస్తుతం వీసీలుగా నియమితులైనవారిలో ఐదుగురు రిటైర్డ్ ప్రొఫెసర్లే. ముగ్గురు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్న వారు. ఓయూలో పనిచేసిన వారికే వీసీల నియామకాల్లో ప్రాధాన్యం దక్కింది. సోమవా రం నియమితులైన వారిలో ఐదుగురు ఓయూకి చెందినవారుకాగా.. ఇద్దరు కాకతీయ యూనివర్సిటీకి చెందినవారు.

కొత్తగా నియమితులైన వీసీల వివరాలివీ..
 జూనియర్ లెక్చరర్ నుంచి వీసీగా..
 కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా నియామకమైన రిటైర్డ్ ప్రొఫెసర్ సాయన్న స్వస్థలం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కోరట్‌పల్లి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన.. 1955 ఆగస్టు 18న  జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1978లో బీఎస్సీ ఎంపీసీ, 1980లో ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తి చేశారు. 1981-1983 వరకు ప్రభుత్వ జూనియర్ లెక్చరర్‌గా పనిచేశారు. 1988లో ఉస్మానియా వర్సిటీలోనే ఫిజిక్స్ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. అనంతరం ఓయూలోనే 1989లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరారు. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా పదోన్నతులు పొందారు. ఉస్మానియా వర్సిటీలో పలు పరిపాలనా పదవులు కూడా నిర్వహించిన ఆయన.. కొద్దికాలం క్రితం రిటైరయ్యారు.
 
 ఉద్యమంలో పాల్గొన్న ‘తెలంగాణ’ వీసీ
 నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్‌గా నియమితులైన రిటైర్డ్ ప్రొఫెసర్ పి.సాంబయ్య స్వస్థలం వరంగల్ జిల్లా పరకాల మండలంలోని నాగారం గ్రామం. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆయన.. కాకతీయ యూనివర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1984లో హన్మకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా చేరారు. 1992లో కేయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియూమకమయ్యారు. అనంతరం ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న సాంబయ్య.. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు  సన్నిహితుడిగా మెదిలారు. కాకతీయ వర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఏడాది కింద రిటైరయ్యారు.
 
 ప్రజా ఉద్యమాల నుంచి..
 అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ వీసీగా నియమితులైన రిటైర్డ్ ప్రొఫెసర్ కె.సీతారామారావు స్వస్థలం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఉప్పరపెల్లి. హన్మకొండలోని గోపాలపురంలో వారి కుటుంబం స్థిరపడింది. కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ చేసిన సీతారామారావు.. 1978లో అదే వర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. 1987లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా, 1999లో ప్రొఫెసర్‌గా పదోన్నతులు పొందారు. రెండేళ్ల కింద రిటైరయ్యారు. వామపక్ష భావజాలాన్ని అనుసరించే సీతారామారావు కాకతీయ వర్సిటీలో విద్యార్థులతో కలసి ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా విద్యావంతుల వేదిక బాధ్యుడిగా కృషి చేశారు. ప్రొఫెసర్ జయశంకర్‌తో కలసి పలు ప్రజాస్వామిక ఉద్యమాల్లో పాల్గొన్నారు.
 
 మారుమూల ప్రాంతం నుంచి..
 పాలమూరు వర్సిటీ వీసీగా నియామకమైన భూక్యా రాజారత్నం స్వస్థలం ఖమ్మం జిల్లా గార్ల మండలం పుల్లూరు. తల్లిదండ్రులు భూక్యా అంబ్రు, లక్ష్మి. ఇంటర్ వరకు వరంగల్ జిల్లా డోర్నకల్‌లో చదువుకున్న ఆయన.. ఖమ్మంలో డిగ్రీ పూర్తిచేశారు. 1979లో ఖమ్మం జిల్లా పరిషత్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేశారు. 1984లో కాకతీయ వర్సిటీలో ఎంకామ్ పూర్తి చేసి.. 1987లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో డిగ్రీ లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరారు. 1992లో పాలమూరు పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదోన్నతి పొందారు. 2008లో ఓయూకి బదిలీ అయిన ఆయన.. ఓయూ పరీక్షల విభాగంలో అదనపు కంట్రోలర్‌గా పనిచేశారు. 2010 నుంచి 2016 ఏప్రిల్ వరకు ఓయూ గెస్ట్‌హౌస్ డెరైక్టర్‌గా, ఆ తర్వాత వీసీగా ఎంపికయ్యే వరకు సికింద్రాబాద్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు.
 
 ఉస్మానియా వీసీగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
 ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం 24వ వీసీగా నియమితులైన ప్రొఫెసర్ రామచంద్రం స్వస్థలం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం చామలోని బావి. నిరుపేద పద్మశాలి కుటుం బంలో జన్మించారు. తండ్రి నరహరి, తల్లి అంతమ్మ. రామచంద్రం పదోతరగతి వరకు పిట్టలగూడెం, కొప్పోలు పాఠశాలల్లో చదివారు. 1979లో ఇంటర్, 1983లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1983లోనే కేరళలోని కోచిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరారు. ఏడాదిపాటు పనిచేసిన అనంతరం ఓయూకి వచ్చి 1985లో ఎంటెక్ పూర్తి చేశారు. 1988లో ఉస్మానియాలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. 1991లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా, 2005లో ప్రొఫెసర్‌గా పదోన్నతులు పొందారు. నిబంధనలను కచ్చితంగా అమలు చేసే ఆయనకు మితభాషిగా,  వివాదరహితుడిగా పేరుంది. వీసీగా ఎంపికయ్యే వరకు ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. వీసీగా ఎంపికైన నేపథ్యంలో ఆయన సోమవారమే బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోజూ 4 కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకున్నానని, మెరిట్ స్కాలర్‌షిప్‌తో ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. తాను ఉస్మానియాలోనే చదువుకుని, ఉద్యోగం చేసినవాడిని కాబట్టి.. ఇక్కడి సమస్యలన్నీ తెలుసన్నారు.
 
 ఇంజనీరింగ్ విద్యకు చిరునామా
 జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నూతన వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎ.వేణుగోపాలరెడ్డికి బోధనా వృత్తిలో 35 ఏళ్ల అనుభవముంది. నల్లగొండ జిల్లా తంగడపల్లిలో 1955 డిసెంబర్ 10న ఓ వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. ఐఐటీ ఢిల్లీ నుంచి ఎంటెక్, ఐఐటీ రూర్కీలో పీహెచ్‌డీ పట్టా పొందారు. 1980లో జేఎన్టీయూలో లెక్చరర్‌గా చేరారు. అక్కడ 17 ఏళ్లపాటు పనిచేసి.. 1997లో ఓయూకి మారారు.  పలు పదోన్నతులు పొందారు. 2008-11 మధ్య ఓయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. ఈ సమయంలో   చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. యూజీసీ నుంచి ఇంజనీరింగ్ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. 2010లో ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐఎస్‌టీఈ) నుంచి ‘ద బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజ్’ అవార్డును అందుకోవడంలో ఆయన పాత్ర ఉంది. ఓయూ దూర విద్యా కేంద్రం సిలబస్ కోసం మూడు పుస్తకాలు రాశారు. జాతీయ స్థాయిలో 25, అంతర్జాతీయ స్థాయిలో 60 పరిశోధన పత్రాలు సమర్పించారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో ‘డిజైన్ ఫర్ మాన్యుఫాక్చరింగ్’ పీజీ కోర్సుకు రూపకల్పన చేశారు. 3 అంతర్జాతీయ సదస్సులను నిర్వహించారు.
 
 తెలుగు వర్సిటీకి ఆచార్యుడు
 శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా నియమితులైన ఆచార్య ఎస్‌వీ సత్యనారాయణ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కవి. 1954లో హైదరాబాద్‌లోని పాతబస్తీలో జన్మించిన ఆయన.. నాంపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, గవర్నమెంట్ సిటీ కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా విశ్వవిద్యా లయంలో ఎంఏ తెలుగు, ఇంగ్లిష్ పూర్తి చేశారు. 1989లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. 1979 నుంచి 1991 వరకు బాగ్‌లింగంపల్లిలో అంబేద్కర్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసిన ఆయన... అనంతరం ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. తెలుగు శాఖలో ఆచార్యులుగా, శాఖాధిపతిగా, పరిశోధనా పర్యవేక్షకుడిగా సేవలందించారు. 2014 ఆగస్టులో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ హోదాలో రిటైరయ్యారు. సత్యనారాయణ 25 పుస్తకాలు రాశారు. మరో 25 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. 50కిపైగా రిసెర్చ్ పబ్లికేషన్లు, 200కుపైగా సాహిత్య ప్రచురణలు వెలువరించారు. ఆయన రచనలపై కాకతీయ, మద్రాస్ వర్సిటీల్లో పరిశోధనలు జరుగుతుండడం విశేషం. చాలా కాలంగా తెలుగు వర్సిటీ సెనెట్ సభ్యులుగా కూడా కొనసాగుతున్నారు.
 
 వ్యవసాయ అభివృద్ధికి కృషి
 ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తొలి వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు చేపట్టిన వెలిచాల ప్రవీణ్‌రావు స్వస్థలం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామం. అగ్రికల్చర్‌లో ఎమ్మెస్సీ చేసిన ప్రవీణ్‌రావు తొలుత ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రీసెర్చ్ అసోసియేట్‌గా పనిచేశారు. అనంతరం జగిత్యాల మండలంలోని పొలాస వ్యవసాయ పరిశోధన కేంద్రంలో 1985-90 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత మహారాష్ట్రలో పీహెచ్‌డీ చేసిన ప్రవీణ్‌రావు.. అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతిపై ఉమ్మడి రాష్ట్రంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి (హైదరాబాద్‌కు) బదిలీ అయ్యారు. 2001లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. ఉమ్మడి ఏపీలోని ఎన్జీరంగా వర్సిటీలో 2012-14 వరకు రిజిస్ట్రార్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజన జరిగి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఏర్పాటైనప్పటి నుంచి వర్సిటీ ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రావు విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు సొంతంగా ప్రవేశ పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. వర్సిటీలో ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని స్పష్టం చేశారు. వర్సిటీలో, ఆరుబయటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.

 వీసీలుగా నియమితులైన వారు వీరే..
 యూనివర్సిటీ        పేరు    
 ఉస్మానియా    ఎస్.రామచంద్రం    
     (ఓయూ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో ప్రొఫెసర్)
 కాకతీయ    ఆర్.సాయన్న    
     (ఓయూ ఫిజిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్)
 జేఎన్టీయూహెచ్    ఎ.వేణుగోపాల్‌రెడ్డి    
     (ఓయూ సీఎస్‌ఈ విభాగంలో రిటైర్డ్ ప్రొఫెసర్)
 తెలంగాణ    పి. సాంబయ్య    
     (కేయూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో రిటైర్డ్ ప్రొఫెసర్)
 తెలుగు వర్సిటీ    ఎస్వీ సత్యనారాయణ    
     (ఓయూ తెలుగు విభాగంలో రిటైర్ ్డ ప్రొఫెసర్)
 అంబేడ్కర్ ఓపెన్    కె.సీతారామారావు    
     (కేయూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో రిటైర్డ్ ప్రొఫెసర్)
 పాలమూరు    బి. రాజారత్నం    
     (ఓయూ కామర్స్ విభాగంలో ప్రొఫెసర్)
 జయశంకర్ వర్సిటీ    వి.ప్రవీణ్‌రావు    
     (జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ప్రత్యేకాధికారి)
  బ్రాకెట్‌లో: ప్రస్తుతం వీసీలైన వారు ఇప్పటివరకూ నిర్వహించిన బాధ్యతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement