ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సభలు, సమావేశాల నిమిత్తం రాజకీయ పార్టీలకు అనుమతులు ఇవ్వొద్దని....
వర్సిటీ రిజిస్ట్రార్, సిటీ పోలీసులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సభలు, సమావేశాల నిమిత్తం రాజకీయ పార్టీలకు అనుమతులు ఇవ్వొద్దని ఓయూ రిజిస్ట్రార్, హైదరాబాద్ సిటీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఉస్మానియాలో రాజకీయ సభలు, సమావేశాల వల్ల విశ్వవిద్యాలయ విద్యా వాతావరణం కలుషితమవుతోందంటూ న్యాయ విద్యార్థి ఓసా రాహుల్ బుధవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని గురువారం జస్టిస్ కోదండరామ్ విచారించారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.ఎ.ముకీద్ వాదనలు వినిపిస్తూ.. వర్సిటీ ప్రాంగణంలో రాజకీయ సభలు, సమావేశాలతో విద్యా వాతావరణాన్ని, ప్రశాంతతను చెడగొట్టి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు. ఈ సభలు, సమావేశాల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని, దీని వల్ల విద్యార్థులు గ్రూపులుగా విడిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. దీనివల్ల వారు చదువుపై దృష్టి సారించలేకపోతున్నారని ఆయన కోర్టుకు నివేదించారు.
వాదనలు విన్న న్యాయమూర్తి ఉస్మానియా వర్సిటీలో రాజకీయ సభలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వొద్దని యూనివర్సిటీ రిజిస్ట్రార్, హైదరాబాద్ సిటీ పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలలో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.