హైకోర్టును విభజించాల్సిందే.. | Have to divide the high court is must | Sakshi
Sakshi News home page

హైకోర్టును విభజించాల్సిందే..

Published Sat, Jul 2 2016 2:54 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

హైకోర్టును విభజించాల్సిందే.. - Sakshi

హైకోర్టును విభజించాల్సిందే..

- ముక్తకంఠంతో నినదించిన రాజకీయ పార్టీలు
- ప్రత్యేక హైకోర్టు నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష
- లక్ష్యాన్ని సాధించే వరకూ ఉద్యమిస్తామని ఉద్ఘాటన  
- రేపు సీజేఐని కలవనున్న న్యాయవాదులు
- సమ్మెలోకి న్యాయశాఖ ఉద్యోగులు
- ఎక్కడికక్కడ స్తంభించిన న్యాయ వ్యవస్థ
 
 సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హైకోర్టు న్యాయవాదుల కోసం మాత్రమే కాదని, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో నినదించాయి. ప్రత్యేక హైకోర్టుతోనే సంపూర్ణ తెలంగాణ సాధ్యమని ఉద్ఘాటించాయి. ఇందుకోసం న్యాయవాదులు చేస్తున్న ఉద్యమానికి తెలంగాణ సమాజం మొత్తం అండగా ఉండాలని పిలుపునిచ్చాయి. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, న్యాయాధికారులు ప్రాథమిక కేటాయింపులు రద్దు చేసి న్యాయాధికారులపై వెంటనే సస్పెన్షన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద శుక్రవారం న్యాయవాదుల సంఘాలు మహాధర్నా చేపట్టాయి. ఈ ధర్నాకు అన్ని రాజకీయ పక్షాల నాయకులు, ఉద్యోగ సంఘాల నేతలు, ప్రజాసంఘాల నేతలు హాజరై ప్రసంగించారు.

 కేంద్రం జోక్యం చేసుకోవాలి: ఉత్తమ్
 న్యాయవాదుల విధుల బహిష్కరణ, న్యాయాధికారుల మూకుమ్మడి సెలవులు, న్యాయశాఖ ఉద్యోగుల సమ్మెతో న్యాయవ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని హైకోర్టును విభజించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సులువుగా జరిగినా హైకోర్టు విభజన మాత్రం ఇంత క్లిష్టంగా మారడం బాధాకరమన్నారు. ప్రత్యేక హైకో ర్టు కోసం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో గట్టిగా నిలదీస్తారన్నారు. న్యాయస్థానాల్లో పోలీసులను మోహరించ డం సరికాదని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.

 బాబూ.. హైకోర్టును ఎందుకు తరలించడం లేదు?: చాడ వెంకట్‌రెడ్డి
 కొందరు తమ స్వార్థ ప్రయోజనం కోసం, తెలంగాణపై ఇంకా పెత్తనం సాగించాలనే ఉద్దేశంతోనే హైకోర్టు విభజనను అడ్డుకుంటున్నారని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సచివాలయాన్ని, ఇతర ప్రభుత్వ విభాగాలను అమరావతికి తరలించిన చంద్రబాబునాయుడు...హైకోర్టును ఎందుకు తరలించడం లేదని నిలదీశారు.

 సస్పెన్షన్ దారుణం: ప్రభాకర్
 న్యాయమూర్తులను సస్పెండ్ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదని బీజేపీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ ప్రభాకర్ అన్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని శాంతి యుతంగా గవర్నర్‌కు వివరించేందుకు వెళ్లినవారిని సస్పెండ్ చేయడం దారుణమన్నారు. నీళ్లు, ఉద్యోగుల వివాదాలను పరిష్కరించినట్టే ఇద్దరు సీఎంలను కూర్చోబెట్టి హైకోర్టు విభజన సమస్య పరిష్కరించాలని గవర్నర్‌ను కోరారు.

 సీజేఐకి కనిపించడం లేదా?: నర్సయ్య
 న్యాయమూర్తుల పోస్టులు భర్తీ చేయనందుకే కన్నీళ్లు పెట్టుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి.. 25 వేల మంది న్యాయవాదుల కన్నీళ్లు కనిపించడం లేదా అని ఎంపీ బూర నర్సయ్య ప్రశ్నించారు. హైకోర్టు విభజన అంశం తమ పరిధిలో లేదంటూ కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటున్నారన్నారు. ఇక్కడ పోరాడేవాళ్లే గానీ భయపడేవాళ్లు ఎవరూ లేరని స్పష్టంచేశారు.

 వారు పట్టించుకోలేదు: అసదుద్దీన్
 ఉమ్మడి హైకోర్టు సహా తెలంగాణకు అన్యాయం చేసే అనేక అంశాలను పునర్విభజన ముసాయిదా చట్టంలోనే గుర్తించి తాను సవరణలకు పట్టుబట్టానని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అయితే తన అభ్యర్థనలను కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకోలేదని తెలిపారు.

 ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు
 న్యాయవాదుల ఉద్యమం ఉప్పెనలా ముందుకు సాగుతోందని, అంతిమ లక్ష్యాన్ని చేరుకునే వరకూ పోరు ఆపే ప్రసక్తే లేదని న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి అన్నారు. శాంతియుత ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని హైకోర్టు ప్రయత్నిస్తోందని హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహన్‌రావు అన్నారు. శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే వాటిని నేరమన్నట్లుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని పౌరహక్కుల సంఘం నేత, హైకోర్టు న్యాయవాది రఘునాథ్ మండిపడ్డారు. హైకోర్టు విభజనలో జాప్యంవల్లే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, శంకర్‌రావు అన్నారు. న్యాయవాదులు అండగా ఉన్నారనే ధైర్యంతోనే తాము తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడామని, ఇప్పుడు ఆ న్యాయవాదుల హక్కులకే భంగం కలుగుతోందని గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని సీపీఎం నేత వెంకట్ విమర్శించారు. కాగా, బీజేపీ లీగల్ సెల్ అధ్యక్షుడు రవీంద్ర విశ్వనాథ్ ప్రసంగాన్ని న్యాయవాదులు అడ్డుకున్నారు. ధర్నాకు తెలంగాణ నలుమూలల నుంచి పెద్దఎత్తున న్యాయవాదులు తరలివచ్చారు.

 సీజేఐని కలవనున్న న్యాయవాదులు
 సుప్రీంకోర్టు సీజే టీఎస్ ఠాకూర్‌ను కలిసి ఇక్కడ పరిస్థితిని వివరించనున్నట్లు హైకోర్టు తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గండ్ర మోహన్‌రావు తెలిపారు. ఆదివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇచ్చారని, న్యాయవాదుల సంఘాల ప్రతినిధుల బృందం ఆయన్ను కలుస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 తాళాలు కూడా తీసేవారు లేరు...
 తెలంగాణ వ్యాప్తంగా న్యాయశాఖ ఉద్యోగులు శుక్రవారం నుంచి సమ్మెలోకి దిగారు. ఉదయం 10 గంటలకే కోర్టు ఆవరణకు చేరుకున్న ఉద్యోగులు ప్రధాన ద్వారాల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. న్యాయాధికారులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగుల ఆందోళనలతో న్యాయవ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మూడ్రోజులుగా 120 మంది న్యాయాధికారులు సామూహికంగా సెలవు పెట్టడంతో కోర్టుల్లో కేసులు విచారించే పరిస్థితి లేదు. వీరు మరో 14 రోజులపాటు విధులకు హాజరయ్యే పరిస్థితి లేదు. వీరికి మద్దతుగా న్యాయశాఖ ఉద్యోగులు శుక్రవారం నుంచి సమ్మెలోకి దిగారు. దీంతో న్యాయస్థానాల తాళాలు తీసే పరిస్థితి కూడా లేదు. డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని ఉద్యోగుల సంఘం నేతలు ప్రకటించారు.
 
 తెలంగాణ మొత్తం అండగా నిలవాలి: కోదండరాం
 న్యాయవాదులు వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని చేయడం లేదని, తెలంగాణ సమాజం కోసం వారి భవిష్యత్తును పణంగాపెట్టి ఉద్యమం చేస్తున్నారని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. న్యాయవ్యవస్థలో తీవ్రమైన వివక్ష ఉంది కాబట్టే హైకోర్టు విభజన కావాలని ఇంతగా పట్టుబడుతున్నారన్నారు. న్యాయవాదులు, న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగుల ఆందోళనకు తెలంగాణ సమాజం మొత్తం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వారు చేసే ప్రతి ఆందోళన, ఉద్యమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
 
 రోడ్డెక్కే పరిస్థితి కల్పించడం సిగ్గుచేటు: జస్టిస్ చంద్రకుమార్
 చట్టాన్ని పరిరక్షించే, ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు అండగా నిలబడి న్యాయం కోసం పోరాడే న్యాయవాదులు వారి హక్కుల కోసం ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి కల్పించడం, తీర్పులు ఇచ్చే న్యాయమూర్తులు న్యాయం కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం సిగ్గుచేటని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ప్రత్యేక హైకోర్టుకు అడ్డంకిగా ఉన్న పునర్విభజన చట్టంలోని సెక్షన్ 30 సవరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలన్నారు. ఆప్షన్ విధానంలో కాకుండా సర్వీసు రిజిస్టర్‌లో పేర్కొన్న స్థానికత ఆధారంగా న్యాయాధికారులను కేటాయించాలన్నారు.
 
 మహాధర్నా తీర్మానాలివే..
 ► న్యాయాధికారుల ప్రాథమిక కేటా యింపులను వెంటనే రీకాల్ చేయాలి
 ► పునర్విభజన చట్టంలోని సెక్షన్ 80 ప్రకారం న్యాయాధికారుల కేటాయింపులకు కేంద్రం అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేయాలి
 ► న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలి
 ► పార్లమెంట్ సమావేశాలప్పుడు ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమంతో కేంద్రంపై ఒత్తిడి తేవాలి
 ► ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, న్యాయాధికారుల కేటాయింపుల్లో న్యాయం జరిగే వరకూ ఉద్యమాన్ని కొనసాగించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement