'నేతల్లారా.. హెచ్సీయూకి చెప్పులు వదిలి వెళ్లండి'
తిరువనంతపురం: విశ్వవిద్యాలయాల అంశాల్లో రాజకీయనాయకులెవరూ జోక్యం చేసుకోవద్దని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు పాల్పడిన అనంతరం జరుగుతున్న రాజకీయపరిణామాలపై ఆయన స్పందించారు. రాజకీయ నాయకులు వర్సిటీలోకి వెళ్లి ఇష్టమొచ్చినట్లు ప్రసంగాలు చేసి అక్కడి వాతావరణాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని చెప్పారు. నాయకులెవరూ విశ్వవిద్యాలయాల అంశాల్లో జోక్యం చేసుకోకూడదన్నదే తన సలహా అని చెప్పారు.
యూనివర్సిటీని ప్రశాంతంగా వదిలేసి రాజకీయ నాయకులంతా వెనక్కి రావాలని విజ్ఞప్తి చేశారు. 'విశ్వవిద్యాలయం దేవాలయంలాంటిది. దేవాలయంలోకి వెళ్లేముందు చెప్పులు ఎలా వదిలి వెళతామో రాజకీయ నాయకులు కూడా యూనివర్సిటీ వెలుపలే రాజకీయాల చెప్పులు వదిలి వెళ్లాలి. మీరు అక్కడికి వెళితే సంతాపం తెలియజేయండి. అక్కడ పరిస్థితి ఏమిటో శ్రద్ధగా గమనించండి. ఎవరు నిజంగా ఆందోళన చెందుతున్నారో వారికి భరోసా ఇవ్వండి.. అంతేగానీ రాజకీయ ప్రసంగాలు చేయొద్దు. వర్సిటీ వాతావరణాన్ని కలుషితం చేసేలాగా ఈపార్టీ ఆ పార్టీ అంటూ ఆరోపణలకు దిగవద్దు' అంటూ వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అంతకు ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్ సీయూకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్కు సంతాపం వ్యక్తం చేసి విద్యార్థులతో మాట్లాడి వెళ్లిన నేపథ్యంలో ఆయన వెంకయ్యమాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. పిటిషన్ రూపంలో వచ్చిన ఓ లేఖనే దత్తాత్రేయ మానవ వనరులశాఖకు పంపించారని, ఆ లేఖే తిరిగి వీసీకి వెళ్లిందని ఆయన చెప్పారు.