కేజ్రీవాల్‌పై రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ: ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ అబద్ధాలు మాట్లాడుతూ, తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారన్నారు. రాజకీయాలను మారుస్తానంటూ చిన్న కారులో వచ్చిన ఈ వ్యక్తి నేడు వాగన్ ఆర్ కారులో శీష్ మహల్‌కు వెళ్లే స్థాయికి ఎదిగారంటూ మండిపడ్డారు. ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో అధికార నివాసం శీష్ మహల్‌లో విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసిన ఈయన ఇప్పుడు ఇతర పార్టీలు అవినీతికి పాల్పడ్డాయంటూ విమర్శలు చేస్తున్నారన్నారు.
గత పదేళ్లలో అవినీతిలో మునిగి తేలడం, కాలుష్యాన్ని పెంచడం మినహా ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ చేసిందేమీ లేదన్నారు. సమాజంలో హింసను, విద్వేషాలను బీజేపీ వ్యాపింపజేస్తోందని, తమ కాంగ్రెస్‌పార్టీ మాత్రమే ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని చెప్పారు. తన మంత్రివర్గాన్ని నవ రత్నాలంటూ కేజ్రీవాల్ చెప్పుకుంటున్న వారిలో ఒక్కరూ ఓబీసీ, మైనారిటీ, దళిత, గిరిజన వర్గాలకు చెందిన వారు లేరన్నారు.
అందరూ అగ్ర కులాలకు చెందిన వారేనని రాహుల్ చెప్పారు. ‘ఢిల్లీ రాజకీయాల్లో మార్పు తెస్తానమంటూ ప్రకటించుకున్న కేజ్రీవాల్.. అతిపెద్ద మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. యమునా నదిలో మునిగి, యమునా జలాలను తాగుతానని ఐదేళ్ల క్రితం చెప్పిన కేజ్రీవాల్ ఆ విషయం మర్చేపోయారు’అని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి ఢిల్లీ ఎన్నికలు అవకాశవాద పోటీ కాదని చెప్పారు. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆశయాలను పరిరక్షించే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. మదీపూర్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడారు.
ఈ సందర్భంగా రాహుల్ బీజేపీపైనా విమర్శలు సంధించారు. సమాజంలో కులాలు, భాషల ప్రాతిపదికన విభేదాలు పెంచి, హింసను బీజేపీ ఎగదోస్తోందన్నారు. ప్రజలను సమస్యల నుంచి మళ్లించేందుకు, సంపదను బడా పారిశ్రామిక వేత్తల ధారాదత్తం చేసేందుకు కుట్రలు పన్నుతోందని చెప్పారు. టాప్ 25 పారిశ్రామికవేత్తలు తీసుకున్న రూ.16 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిన మోదీజీ..ఢిల్లీలోని విద్యార్థులు, చిరు వ్యాపారులు, గృహిణుల రుణాలెన్నిటిని రద్దు చేశారు? అంటూ ప్రశ్నించారు.
మోదీ, కేజ్రీవాల్ ఒక్కటే
అవినీతి విషయంలో ప్రధాని మోదీ, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఇద్దరూ ఒక్కటేనని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. ముస్తాఫాబాద్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఆమె.. విభేదాలు సృష్టించడమే బీజేపీ నైజమని చెప్పారు. మోదీ రాజ్‌మహల్ గురించి ఆప్ నేతలు మాట్లాడుతుంటే, కేజ్రీవాల్ శీష్ మహల్ గురించి బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని, ఈ రెండు పార్టీలు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు తెచ్చేందుకే తప్ప ప్రజలకు రహదారులు, మంచి నీరు, విద్య వంటి వాటి గురించి బీజేపీ మాట్లాడటం లేదని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్‌కు మోదీకి మధ్య తేడాయేలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment