Wagon R Car
-
సింగిల్ ఛార్జ్.. 230 కిమీ రేంజ్!.. మారుతి ఎలక్ట్రిక్ కారు
ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో మారుతి సుజుకి తన 'వ్యాగన్ఆర్'ను ఎలక్ట్రిక్ కారుగా లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ దీనిని 'ఈడబ్ల్యూఎక్స్' (eWX) పేరుతో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దీని కోసం పేటెంట్ దాఖలు చేసింది.2023 ఆటో ఎక్స్‌పోలో మొదటిసారి కనిపించిన ఈ కారు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు సీ షేప్ లైట్ క్లస్టర్లతో క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్ పొందుతుంది. ప్లాస్టిక్ క్లాడింగ్ బంపర్ ఉంటుంది. వీల్స్, సైడ్ స్కర్ట్‌లపై పసుపు రంగుతో ఉండటం చూడవచ్చు. ఇది ఒక ఫుల్ చార్జితో 230 కిమీ రేంజ్ అందిస్తుందని మారుతి సుజుకి పేర్కొంది. అయితే కచ్చితమైన గణాంకాలు లాంచ్ తరువాత తెలుస్తాయి.మారుతి సుజుకి ఈ కారును భారతదేశంలో లాంచ్ చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి హైబ్రిడ్ కార్లను లాంచ్ చేయాలనీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే స్విఫ్ట్ వంటి కార్లను హైబ్రిడ్ వెర్షన్లలో పరిచయం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. -
‘వ్యాగన్ఆర్ బీఎస్–6’ వెర్షన్
న్యూఢిల్లీ: బీఎస్–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న వ్యాగన్ఆర్ కారును శుక్రవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) ప్రకటించింది. నూతన ప్రమాణాలతో కూడిన 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కారు ధరల శ్రేణి రూ.5.15 లక్షల నుంచి రూ.5.96 లక్షలుగా నిర్ణయించింది. అయితే, ఢిల్లీ–ఎన్సీఆర్లో మోడల్ ఆధారంగా ధరల శ్రేణి రూ.5.10 లక్షల నుంచి రూ.5.91 లక్షలుగా కాగా.. మునుపటి వెర్షన్‌తో పోల్చితే అన్ని ప్రాంతాల్లో ఈ నూతన వ్యాగన్ఆర్ బీఎస్–6 కారు ధర రూ.16,000 వరకు పెరిగినట్లు తెలిపింది. కేవలం 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌లో మాత్రమే నూతన వెర్షన్ అందుబాటులో ఉన్నట్లు స్పష్టంచేసింది. మరోవైపు 1–లీటర్ పెట్రోల్ ఇంజిన్ వ్యాగన్ఆర్ ధరల్లో కూడా మార్పులు చేసింది. ఢిల్లీ–ఎన్సీఆర్లో ఈ మోడల్ ధరల శ్రేణి రూ.4.34 లక్షల నుంచి రూ.5.33 లక్షలు కాగా, మిగిలిన ప్రాంతాల్లో ధరల శ్రేణి రూ.4.39 లక్షల నుంచి రూ.5.38 లక్షలకు సవరించింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ కార్లు ఇప్పుడు ఏఐఎస్–145 భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు పేర్కొంది. -
ఆ కారును వదిలేసి వెళ్లిపోయారు!
సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారు దొరికింది. ఈ నెల 12న దొంగతనానికి గురైన ఆయన వ్యాగన్ ఆర్ కారును శనివారం ఘజియాబాద్‌లో పోలీసులు గుర్తించారు. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ ఇమేజ్‌కు ప్రతీకగా నిలిచిన ఈ కారును ఎవరు దొంగలించారనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. కానీ, ఘజియాబాద్ ప్రాంతంలో ఈ కారును వదిలేసి వెళ్లినట్టు తాజాగా గుర్తించారు. 2015 అసెంబ్లీ ఎన్నికల వరకు కేజ్రీవాల్ ఈ నీలిరంగు కారును ఉపయోగించారు. ఆయన సీఎం కావడంతో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ నేత వందన సింగ్ ఈ కారును ఉపయోగిస్తున్నారు. ఢిల్లీ సెక్రటేరియట్ వద్ద పార్క్ చేసి ఉన్నప్పుడు ఈ కారును దొంగలించినట్టు తెలుస్తోంది. ఈ వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. కేజ్రీవాల్ కారు దొంగతనంపై మీడియలో కథనాలు రావడం, సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఈ కారును వదిలేసి వెళ్లినట్టు తెలుస్తోంది. -
కేజ్రివాల్, నా కారు నాకిచ్చెయ్!
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గతేడాది వాడుకోమంటూ ఉచితంగా ఇచ్చిన నీలిరంగు ‘వ్యాగన్ ఆర్ కారు’ను తిరిగి తనకు ఇచ్చేయాల్సిందిగా బ్రిటన్‌లో ఉంటున్న ఒకప్పటి ఆప్ పార్టీ అభిమాని కుందన్ శర్మ డిమాండ్ చేస్తున్నారు. అలాగే పార్టీ కోసం తాను, తన భార్య ఇచ్చిన విరాళాలు కూడా తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరుతున్నారు. ఆయనలో ఈ మార్పునకు కారణం ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత కలహాలే. యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లాంటి సామాజిక కార్యకర్తలను పార్టీ నుంచి తొలగించడం పట్ల తీవ్ర అసంతృప్తికి గురైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుందన్ శర్మ తన కారును వెనక్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆ కారు ఎవరి వద్ద ఉందో తెలియదుగానీ కారు చుట్టూ పెద్ద కథే ఉంది. కేజ్రివాల్ మొదటి సారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు భద్రతా కారణాలరీత్య అధికార వాహనంలోకి మారారు. 1999లో రిజిస్టరైన వ్యాగన్ ఆర్ కారును ఉపయోగించకుండా పక్కన పడేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామా అనంతరం కూడా ఆ కారు తన కౌశాంబి అపార్ట్మెంట్లోనే ఉండింది. అయితే ఢిల్లీ ఆటోమొబైల్ చట్ట నిబంధనల ప్రకారం 15 ఏళ్ల కాలపరిమితి తీరిపోయిన వాహనాన్ని ఢిల్లీ వీధుల్లో నడపరాదు. ఆ ఉద్దేశంతో ఆ కారును ఎలాగైనా వదిలించుకోవాలని కేజ్రివాల్ చూశారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో రోహతక్ నుంచి పోటీ చేసిన ఆప్ అభ్యర్థికి ఉచితంగా ఇచ్చేశారు. ఆ కారు ఇంజన్ నుంచి వస్తున్న లొడలొడ శబ్దాన్ని సదరు ఆప్ అభ్యర్థి భరించలేక దాన్ని మరమ్మతు కోసం ఓ ఆటోమొబైల్ షోరూమ్ సర్వీసుకు ఇచ్చేశారు. మధ్యలో ఏం జరిగిందో తెలియదుగానీ ఆ షోరూమ్ సర్వీస్ వారు తిన్నగా ఆ కారును తీసుకొచ్చి కేజ్రివాల్ అపార్ట్మెంట్లో పార్కుచేసి తాళం చెవులను కేజ్రివాల్ లెటర్స్ బాక్సులో పడేసి, దాంతోపాటు ఓ లేఖ కూడా పెట్టి వెళ్లారు. ‘ఇస్కా ఫేర్ సే అచ్చితో ఆప్ కి సర్కార్ చలీ థి ఢిల్లీ మే’ అని ఆ లేఖలో ఉన్నట్టు కేజ్రివాల్ సన్నిహితులు చెబుతారు. తిరిగి తనవద్దకే వచ్చిన వ్యాగన్ ఆర్ కారును వదిలించుకోవడానికి కేజ్రివాల్ దాన్ని అమ్మకానికి పెట్టారు. అందుకు స్థానిక రేడియోలో ఓ యాడ్కూడా ఇచ్చారు. అయినా దాన్ని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు కారును ఏం చేయాలో సలహా ఇవ్వాల్సిందిగా అప్పటికి తనకు ఆప్తుడుగావున్న యోగేంద్ర యాదవ్‌ను అడిగాడట. పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అశుదోష్కు కారును గిఫ్ట్‌గా ఇవ్వాల్సిందిగా కేజ్రివాల్‌కు యాదవ్ సూచించారట. ఓ పార్టీ కార్యక్రమంలో యాదవ్ సూచించినట్టుగా అశుతోష్‌కు ఆ కారును కేజ్రివాల్ బహూకరించారు. కారిచ్చినందుకు కృతజ్ఞతలు ప్రకటించిన అశుతోష్, పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ఆ కారును ఉపయోగిస్తానని కూడా ఆ కార్యక్రమంలో వాగ్దానం చేశాడట. అశుతోష్‌కు కాస్త వినికిడి జ్ఞానం తక్కువ. లొడలొడ శబ్దం చేసే ఆ కారును ఆయన తప్ప మరెవరూ భరించలేరనే ఉద్దేశంతోనే యోగేంద్ర యాదవ్ ఆయనకివ్వాల్సిందిగా కేజ్రివాల్‌కు సూచించారని యదవ్ సన్నిహితుల సమాచారం.