కేజ్రివాల్, నా కారు నాకిచ్చెయ్! | UK AAP Supporter asks his Wagon R back | Sakshi
Sakshi News home page

కేజ్రివాల్, నా కారు నాకిచ్చెయ్!

Published Tue, Apr 7 2015 3:35 PM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

కేజ్రివాల్, నా కారు నాకిచ్చెయ్!

కేజ్రివాల్, నా కారు నాకిచ్చెయ్!

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గతేడాది వాడుకోమంటూ ఉచితంగా ఇచ్చిన నీలిరంగు ‘వ్యాగన్ ఆర్ కారు’ను తిరిగి తనకు ఇచ్చేయాల్సిందిగా బ్రిటన్‌లో ఉంటున్న ఒకప్పటి ఆప్ పార్టీ అభిమాని కుందన్ శర్మ డిమాండ్ చేస్తున్నారు. అలాగే పార్టీ కోసం తాను, తన భార్య ఇచ్చిన విరాళాలు కూడా తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరుతున్నారు. ఆయనలో ఈ మార్పునకు కారణం ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత కలహాలే.

యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లాంటి సామాజిక కార్యకర్తలను పార్టీ నుంచి తొలగించడం పట్ల తీవ్ర అసంతృప్తికి గురైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుందన్ శర్మ తన కారును వెనక్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆ కారు ఎవరి వద్ద ఉందో తెలియదుగానీ కారు చుట్టూ పెద్ద కథే ఉంది.

కేజ్రివాల్ మొదటి సారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు భద్రతా కారణాలరీత్య అధికార వాహనంలోకి మారారు. 1999లో రిజిస్టరైన వ్యాగన్ ఆర్ కారును ఉపయోగించకుండా పక్కన పడేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామా అనంతరం కూడా ఆ కారు తన కౌశాంబి అపార్ట్‌మెంట్‌లోనే ఉండింది. అయితే ఢిల్లీ ఆటోమొబైల్ చట్ట నిబంధనల ప్రకారం 15 ఏళ్ల కాలపరిమితి తీరిపోయిన వాహనాన్ని ఢిల్లీ వీధుల్లో నడపరాదు. ఆ ఉద్దేశంతో ఆ కారును ఎలాగైనా వదిలించుకోవాలని కేజ్రివాల్ చూశారట.

గత అసెంబ్లీ ఎన్నికల్లో రోహతక్ నుంచి పోటీ చేసిన ఆప్ అభ్యర్థికి ఉచితంగా ఇచ్చేశారు. ఆ కారు ఇంజన్ నుంచి వస్తున్న లొడలొడ శబ్దాన్ని సదరు ఆప్ అభ్యర్థి భరించలేక దాన్ని మరమ్మతు కోసం ఓ ఆటోమొబైల్ షోరూమ్ సర్వీసుకు ఇచ్చేశారు. మధ్యలో ఏం జరిగిందో తెలియదుగానీ ఆ షోరూమ్ సర్వీస్ వారు తిన్నగా ఆ కారును తీసుకొచ్చి కేజ్రివాల్ అపార్ట్‌మెంట్‌లో పార్కుచేసి తాళం చెవులను కేజ్రివాల్ లెటర్స్ బాక్సులో పడేసి, దాంతోపాటు ఓ లేఖ కూడా పెట్టి వెళ్లారు. ‘ఇస్‌కా ఫేర్ సే అచ్చితో ఆప్ కి సర్కార్ చలీ థి ఢిల్లీ మే’ అని ఆ లేఖలో ఉన్నట్టు కేజ్రివాల్ సన్నిహితులు చెబుతారు.

తిరిగి తనవద్దకే వచ్చిన వ్యాగన్ ఆర్ కారును వదిలించుకోవడానికి కేజ్రివాల్ దాన్ని అమ్మకానికి పెట్టారు. అందుకు స్థానిక రేడియోలో ఓ యాడ్‌కూడా ఇచ్చారు. అయినా దాన్ని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు కారును ఏం చేయాలో సలహా ఇవ్వాల్సిందిగా అప్పటికి తనకు ఆప్తుడుగావున్న యోగేంద్ర యాదవ్‌ను అడిగాడట. పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అశుదోష్‌కు కారును గిఫ్ట్‌గా ఇవ్వాల్సిందిగా కేజ్రివాల్‌కు యాదవ్ సూచించారట.

ఓ పార్టీ కార్యక్రమంలో యాదవ్ సూచించినట్టుగా అశుతోష్‌కు ఆ కారును కేజ్రివాల్ బహూకరించారు. కారిచ్చినందుకు కృతజ్ఞతలు ప్రకటించిన అశుతోష్, పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ఆ కారును ఉపయోగిస్తానని కూడా ఆ కార్యక్రమంలో  వాగ్దానం చేశాడట. అశుతోష్‌కు కాస్త వినికిడి జ్ఞానం తక్కువ. లొడలొడ శబ్దం చేసే ఆ కారును ఆయన తప్ప మరెవరూ భరించలేరనే ఉద్దేశంతోనే యోగేంద్ర యాదవ్ ఆయనకివ్వాల్సిందిగా కేజ్రివాల్‌కు సూచించారని యదవ్ సన్నిహితుల సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement