Hyderabad University
-
రసాయనిక శాస్త్రంతో మానవ మనుగడ
పద్మశ్రీ అవార్డు గ్రహీత గోవర్ధన్ మెహతా ట్రిపుల్ ఐటీలో జాతీయ స్థాయి సదస్సు నూతన ఆవిష్కరణపై చర్చలు బాసర : మానవుని మనుగడ రసాయనిక శాస్త్రంతో ముడి పడి ఉందని పద్మశ్రీ అవార్డు గ్రహీత, హైదరాబాద్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్ మెహతా అన్నారు. శనివారం బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో ‘రసాయనిక, పదార్థ శాస్త్రాల్లో ఇటీవల కాలంలో వస్తున్న పురోగతి’పై జాతీయ స్థాయి సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ శరీరానికే కాకుండా విశ్వవ్యాప్తమైన సృష్టి అంతా రసాయనాలతో నిండి ఉందని చెప్పారు. ఇటీవల కాలంలో నోటి, దంత క్యాన్సర్, ఎయిడ్స్ తదితర ప్రాణాంతక వ్యాధులపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కరించిన ఔషధాలు, వాటి పనితీరుపై ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. వ్యాధుల నివారణకు తయారు చేయాల్సిన డ్రాగ్ డిజైనింగ్‌లో అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. పలువురు రసాయనిక శాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్లు నానో మెటీరియల్, సెమీ కండక్టింగ్, పాలిమర్ మెడిసిన్ మందుల తయారీ గోడప్రతుల ద్వారా విద్యార్థులకు వివరించారు. ప్రపంచం మెుత్తాన్ని గడగడలాడించిన ఎబోలా, వ్యాధులకు మందు కనిపెట్టారని తెలిపారు. నానోటెక్నాలజీ ద్వారా ఆభరణాలు, పింగళి వస్తువుల తయారీకి ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీ కళాశాల వైస్‌ఛాన్స్‌లర్ సత్యనారాయణ మాట్లాడుతూ రసాయనిక, భౌతిక శాస్త్రంలో రీసెర్చ్ సెంటర్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో గోవర్ధన్‌మెహతా, ఢిల్లీ సీఎస్ఐఆర్టీ ప్రొఫెసర్ జేఎస్ యాదవ్, కళాశాల వైస్ ఛాన్స్లర్ సత్యనారాయణ మెుక్కలు నాటారు. సదస్సులో బాసర ఐఐఐటీ రయసానిక విభాగ అధిపతి రవివారల, శ్రీపాద్, వివిధ జిల్లాల రసాయనిక శాస్త్ర అధ్యాపకులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
'అసలు రోహిత్ దళితుడు కాదు'
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన పరిశోధక విద్యార్థి రోహిత్ ఘటన వేడి చల్లారకముందే దానికి మరింత ఆజ్యం పోసేలా కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ వ్యాఖ్యలు చేశారు. అసలు రోహిత్ దళితుడే కాదని అన్నారు. మహారాష్ట్రలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 'నా దగ్గర ఉన్న సమాచారం మేరకు ఆ విద్యార్థి(రోహిత్) దళితుడు కాదు. కానీ కొంతమంది అతడిని దళితుడిగా చెప్పారు. అసలు అతడు దళితుడు అని చేస్తున్న ప్రచారం పూర్తిగా ఆధారం లేనిది' అని ఆమె అన్నారు. ఈ నెల 17న రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి హెచ్‌సీయూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, ఆ పార్టీ విద్యార్థి విభాగం ఏబీవీపీవల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రతిపక్షాలు ఆరోపించాయి. రాహుల్ గాంధీ ఇదే అంశంతో ఎన్డీయేపై విరుచుపడ్డారు. ఈ నేపథ్యంలో సుష్మా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
'నేతల్లారా.. హెచ్‌సీయూకి చెప్పులు వదిలి వెళ్లండి'
తిరువనంతపురం: విశ్వవిద్యాలయాల అంశాల్లో రాజకీయనాయకులెవరూ జోక్యం చేసుకోవద్దని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు పాల్పడిన అనంతరం జరుగుతున్న రాజకీయపరిణామాలపై ఆయన స్పందించారు. రాజకీయ నాయకులు వర్సిటీలోకి వెళ్లి ఇష్టమొచ్చినట్లు ప్రసంగాలు చేసి అక్కడి వాతావరణాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని చెప్పారు. నాయకులెవరూ విశ్వవిద్యాలయాల అంశాల్లో జోక్యం చేసుకోకూడదన్నదే తన సలహా అని చెప్పారు. యూనివర్సిటీని ప్రశాంతంగా వదిలేసి రాజకీయ నాయకులంతా వెనక్కి రావాలని విజ్ఞప్తి చేశారు. 'విశ్వవిద్యాలయం దేవాలయంలాంటిది. దేవాలయంలోకి వెళ్లేముందు చెప్పులు ఎలా వదిలి వెళతామో రాజకీయ నాయకులు కూడా యూనివర్సిటీ వెలుపలే రాజకీయాల చెప్పులు వదిలి వెళ్లాలి. మీరు అక్కడికి వెళితే సంతాపం తెలియజేయండి. అక్కడ పరిస్థితి ఏమిటో శ్రద్ధగా గమనించండి. ఎవరు నిజంగా ఆందోళన చెందుతున్నారో వారికి భరోసా ఇవ్వండి.. అంతేగానీ రాజకీయ ప్రసంగాలు చేయొద్దు. వర్సిటీ వాతావరణాన్ని కలుషితం చేసేలాగా ఈపార్టీ ఆ పార్టీ అంటూ ఆరోపణలకు దిగవద్దు' అంటూ వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అంతకు ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్ సీయూకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్‌కు సంతాపం వ్యక్తం చేసి విద్యార్థులతో మాట్లాడి వెళ్లిన నేపథ్యంలో ఆయన వెంకయ్యమాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. పిటిషన్ రూపంలో వచ్చిన ఓ లేఖనే దత్తాత్రేయ మానవ వనరులశాఖకు పంపించారని, ఆ లేఖే తిరిగి వీసీకి వెళ్లిందని ఆయన చెప్పారు. -
'మేం న్యాయవిచారణకు సిద్ధం'
హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్య ఘటనపై న్యాయవిచారణకు సిద్ధమని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. నివేదిక ఆధారంగా దోషులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. హెచ్‌సీయూలో పీహెచ్డీ దళిత విద్యార్థి రోహిత్ ఏబీవీపీ విద్యార్థులతో వాగ్వాదం కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ పక్క బీజేపీపైనా, ఆ పార్టీ విద్యావిభాగం అయిన ఏబీవీపీపైన విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ విషయంపైనే స్పందించిన కిషన్ రెడ్డి పై విధంగా స్పందించారు. రోహిత్ మృతికి కారణమైన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. -
'నా రెండో బిడ్డను ఇక చదివించను'
హైదరాబాద్: తన కొడుకు డాక్టరేట్ చదివి.. సమాజంలో ఉన్నతస్థాయికి ఎదుగుతాడని ఆ తల్లి కలలు గన్నది. పెద్ద చదువులు చదువుతూ.. పెద్దవాడు అవుతాడని ఆశించింది. కానీ కళ్లముందే చెట్టంతా కొడుకు చేజారిపోయాడు. ఎదిగి వచ్చిన బిడ్డ తమను పేదరికం నుంచి బయటపడేస్తాడనుకుంటే.. యెదలో తీరని బాధను మిగిల్చిపోయాడు. వివక్ష, రాజకీయాలు, అణచివేత ఇలా కారణాలు ఏమైతేనేం.. యూనివర్సిటీలోనే తమ కొడుకు కన్నుమూసిన నేపథ్యంలో ఈ చదువులు మాకొద్దని ఆ తల్లి అంటోంది. తన రెండో కొడుకును ఎంతమాత్రం చదివించనని చెప్తోంది.. ఇది హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ తల్లి రాధిక ఆవేదన. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం రోహిత్ తల్లిని, కుటుంబసభ్యులని పరామర్శించారు. ఈ సందర్భంగా రోహిత్ తల్లి రాధిక బోరున విలపిస్తూ తన గోడును జగన్ వద్ద విన్నవించారు. రోహిత్ మృతికి హెచ్‌సీయూ వీసీనే కారణమని, ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆమె తెలిపారు. రోహిత్ సస్పెండ్ చేసినట్టు తమకు చెప్పలేదని, సస్పెండ్ చేశారని తెలిస్తే తాము అతన్ని ఇంటికి తెచ్చుకునేవాళ్లమన్నారు. కూలీపనులు చేస్తూ రోజుకు రూ. 150 తీసుకొచ్చి రోహిత్‌ను చదివించానని, కొడుకును సమాజంలో ఉన్నతస్థానంలో చూసుకోవాలనుకున్నానని తెలిపారు. తన కొడుకు పెద్దవాడు అవుతాడనుకుంటే శవమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం నుంచి బయటకు రావాలనే తాను కొడుకును చదివించానని, పుస్తకాలు కొనుక్కొనే స్థామత లేకపోవడంతో రోహిత్ లైబ్రరీలో చదువుకున్నాడని చెప్పారు. తన కొడుకు డాక్టరేట్ చదువాలని కలలు కన్నానని, అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తెలిపారు. రోహిత్‌కు తానంటే ఎంతో ఇష్టమని, చెట్టంతా కొడుకు పోయాడని రోదిస్తూ ఆమె జగన్‌కు తెలిపారు. ఇక తన రెండో బిడ్డను చదివించబోనని, ఇలాంటి చదువులు మాకొద్దని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. తన రెండో కొడుకుకు ఏదైనా దారి చూపించాలని వేడుకున్నారు. తన తల్లి కడుపు మాడ్చుకొని తమకు అన్నం పెట్టి పెంచి పెద్ద చేసిందని రోహిత్ కుటుంబసభ్యులు జగన్‌కు తెలిపారు. -
మానవతా దృక్పధంతో ఆలోచించండి: వైఎస్ జగన్
హైదరాబాద్: దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో హెచ్‌సీయూ వీసీ పేరు బలంగా వినిపిస్తోందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విద్యార్థులను కాపాడాల్సిన వీసీ, ఆపదలో వారికి మద్దతుగా ఉండాల్సిన వీసీ.. విద్యార్థులు చనిపోయేంత దూరం వెళ్లినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేలా వారి మానసిక స్థితిగతులను ప్రేరేపించడం బాధ కలిగిస్తున్నదని వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం ఉప్పల్‌లో రోహిత్ తల్లిని, ఇతర కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కనబెట్టి ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరముందని జగన్ పేర్కొన్నారు. హెచ్‌సీయూలో ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేయడంతో అందులో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పటికైనా మిగతా నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాల్సిన అవసరముందన్నారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రస్తుతం ఆ నలుగురు విద్యార్థులు టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తున్నారని, స్టైఫండ్ వస్తేగానీ వారు బతికే పరిస్థితి లేకపోవడం, వారి చదువులు ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని జగన్ కోరారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మనోధైర్యం కల్పించేందుకు బుధవారం తాను హెచ్‌సీయూ వెళుతున్నానని, సస్పెన్షన్ వ్యవహారంపై వారితో మాట్లాడతానని ఆయన చెప్పారు. -
మానవతా దృక్పధంతో ఆలోచించండి
-
రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా..!
హైదరాబాద్: దళిత పీహెచ్డీ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా ప్రముఖ కవి, సాహితీవేత్త అశోక్ వాజపేయి తనకు హెచ్‌సీయూ ప్రదానం చేసిన డీలిట్ పట్టాను మంగళవారం వాపస్ ఇచ్చేశారు. ప్రముఖ రచయిత ఎంఎం కల్బుర్గీ హత్యకు నిరసనగా 2015లో ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ ఆత్మహత్యకు పురికొల్పే పరిస్థితులను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కల్పించిందని, అందుకే తన డీలిట్ పట్టాను వాపస్ ఇచ్చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. 'హెచ్‌సీయూ దళిత వ్యతిరేక ధోరణి వల్ల ఓ యువ స్కాలర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పరిస్థితుల నడుమ ఆ వర్సిటీ ఇచ్చిన గౌరవ పురస్కారాన్ని నేను ఎలా అట్టిపెట్టుకొని ఉంచుకోవాలి' అని ఆయన విలేకరులతో వ్యాఖ్యానించారు. 'రోహిత్ ఆత్మహత్యతో యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని దర్యాప్తులో తేలితే.. అప్పుడు తిరిగి తీసుకొనే అంశాన్ని ఆలోచిస్తా. కానీ విద్యార్థులను హాస్టల్ నుంచి గెంటేశారు. వారు హాస్టల్ బయట టెంటు వేసుకొని ఉంటున్నారు. విద్యార్థులతో వ్యవహరించే పద్ధతి ఇదేనా?' అని ఆయన ఆవేదనగా ప్రశ్నించారు.