రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా..!
హైదరాబాద్: దళిత పీహెచ్‌డీ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా ప్రముఖ కవి, సాహితీవేత్త అశోక్ వాజపేయి తనకు హెచ్‌సీయూ ప్రదానం చేసిన డీలిట్ పట్టాను మంగళవారం వాపస్ ఇచ్చేశారు. ప్రముఖ రచయిత ఎంఎం కల్బుర్గీ హత్యకు నిరసనగా 2015లో ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేసిన సంగతి తెలిసిందే.
రోహిత్ ఆత్మహత్యకు పురికొల్పే పరిస్థితులను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కల్పించిందని, అందుకే తన డీలిట్ పట్టాను వాపస్ ఇచ్చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. 'హెచ్‌సీయూ దళిత వ్యతిరేక ధోరణి వల్ల ఓ యువ స్కాలర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పరిస్థితుల నడుమ ఆ వర్సిటీ ఇచ్చిన గౌరవ పురస్కారాన్ని నేను ఎలా అట్టిపెట్టుకొని ఉంచుకోవాలి' అని ఆయన విలేకరులతో వ్యాఖ్యానించారు.
'రోహిత్ ఆత్మహత్యతో యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని దర్యాప్తులో తేలితే.. అప్పుడు తిరిగి తీసుకొనే అంశాన్ని ఆలోచిస్తా. కానీ విద్యార్థులను హాస్టల్ నుంచి గెంటేశారు. వారు హాస్టల్ బయట టెంటు వేసుకొని ఉంటున్నారు. విద్యార్థులతో వ్యవహరించే పద్ధతి ఇదేనా?' అని ఆయన ఆవేదనగా ప్రశ్నించారు.