డాక్టర్ శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మక డి.లిట్ ప్రదానం
కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మకమైన డి.లిట్.(డాక్టర్ ఆఫ్ లెటర్స్) లభించింది. భారతీయ భాషలకు సాహిత్యానికి విశేషమైన సేవలు అందించినందుకు అదే విధంగా దాదాపు రెండు దశాబ్దాలుగా కేంద్ర సాహిత్య అకాడమీని అభివృద్ధి పథంలో నడిపించిన పరిపాలనా దక్షతకూ గుర్తింపుగా వారికి గౌరవ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీ ప్రదానం చేస్తున్నట్టు షహిద్ మహేంద్ర కర్మా విశ్వవిద్యాలయం, బస్తర్ ప్రకటించింది.
చత్తీస్ గడ్ రాష్ట్రంలోని జగదల్పూర్లో గల విశ్వవిద్యాలయంలో 2024 మార్చ్ 5వ తేదీన జరిగిన గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ ప్రదానోత్సవంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు డి.లిట్. డిగ్రీ ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మనోజ్ కుమార్ శ్రీ వాస్తవ ఇతర ప్రముఖులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. సాహిత్య సేవా రంగంలో అత్యంత అరుదైన, ప్రతిష్టాకరమైన గౌరవ డి.లిట్. డిగ్రీని స్వీకరించిన సందర్భంగా కళా సాహిత్య రంగాలకు, పరిపాలనా రాజకీయ రంగాలకూ చెందిన పలువురు ప్రముఖులు డాక్టర్ శ్రీనివాసరావు గారికి అభినందనలు తెలిపారు.
కృష్ణాజిల్లా పెదప్రోలు గ్రామానికి చెందిన కృత్తివెంటి శ్రీనివాసరావు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిషులో డాక్టరేట్ చేశారు. పలు గ్రంధాలు వెలువరించారు. దేశ విదేశాల్లో వందలాది సాహిత్య కార్యక్రమాలలో ప్రసంగించారు. భారత సాంస్కృతిక శాఖకు చెందిన ఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీకి కార్యదర్శి హోదాలో శ్రీనివాసరావు దాదాపు రెండు దశాబ్దాలుగా విశేషమైన సేవలందిస్తున్నారు.