మానవతా దృక్పధంతో ఆలోచించండి: వైఎస్ జగన్
హైదరాబాద్: దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో హెచ్‌సీయూ వీసీ పేరు బలంగా వినిపిస్తోందని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విద్యార్థులను కాపాడాల్సిన వీసీ, ఆపదలో వారికి మద్దతుగా ఉండాల్సిన వీసీ.. విద్యార్థులు చనిపోయేంత దూరం వెళ్లినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేలా వారి మానసిక స్థితిగతులను ప్రేరేపించడం బాధ కలిగిస్తున్నదని వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం ఉప్పల్‌లో రోహిత్ తల్లిని, ఇతర కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడారు.
ఇప్పటికైనా రాజకీయాలు పక్కనబెట్టి ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరముందని జగన్ పేర్కొన్నారు. హెచ్‌సీయూలో ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేయడంతో అందులో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పటికైనా మిగతా నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాల్సిన అవసరముందన్నారు.
సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రస్తుతం ఆ నలుగురు విద్యార్థులు టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తున్నారని, స్టైఫండ్ వస్తేగానీ వారు బతికే పరిస్థితి లేకపోవడం, వారి చదువులు ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని జగన్ కోరారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మనోధైర్యం కల్పించేందుకు బుధవారం తాను హెచ్‌సీయూ వెళుతున్నానని, సస్పెన్షన్ వ్యవహారంపై వారితో మాట్లాడతానని ఆయన చెప్పారు.