హెచ్సీయూ విద్యార్థి సంఘాలతో జగన్ భేటీ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. హెచ్సీయూ ప్రాంగణంలో విద్యార్థి సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. రోహిత్తో పాటు సస్పెన్షన్కు గురైన మరో నలుగురు విద్యార్థులతో జగన్ మాట్లాడారు. హెచ్సీయూ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. రోహిత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలని జగన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం జగన్ హైదరాబాద్‌లోని ఉప్పల్ బ్యాంక్ కాలనీలో రోహిత్ తల్లి రాధిక, తమ్ముడు రాజా చైతన్యకుమార్ అద్దెకు ఉంటున్న నివాసానికి వెళ్లి వారిని ఓదార్చారు. 'మీపక్షాన మేమున్నాం.. న్యాయం కోసం పోరాడదాం..' అని వారికి భరోసానిచ్చి కన్నీళ్లను తుడిచారు. దాదాపు 35 నిమిషాలపాటు అక్కడే ఉన్న వైఎస్ జగన్... రోహిత్ కుటుంబ పరిస్థితిని, జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.