'నా రెండో బిడ్డను ఇక చదివించను' | rohith mothers express her grief over son death | Sakshi
Sakshi News home page

'నా రెండో బిడ్డను ఇక చదివించను'

Published Tue, Jan 19 2016 8:12 PM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM

'నా రెండో బిడ్డను ఇక చదివించను' - Sakshi

'నా రెండో బిడ్డను ఇక చదివించను'

హైదరాబాద్‌: తన కొడుకు డాక్టరేట్ చదివి.. సమాజంలో ఉన్నతస్థాయికి ఎదుగుతాడని ఆ తల్లి కలలు గన్నది. పెద్ద చదువులు చదువుతూ.. పెద్దవాడు అవుతాడని ఆశించింది. కానీ కళ్లముందే చెట్టంతా కొడుకు చేజారిపోయాడు. ఎదిగి వచ్చిన బిడ్డ తమను పేదరికం నుంచి బయటపడేస్తాడనుకుంటే.. యెదలో తీరని బాధను మిగిల్చిపోయాడు. వివక్ష, రాజకీయాలు, అణచివేత ఇలా కారణాలు ఏమైతేనేం.. యూనివర్సిటీలోనే తమ కొడుకు కన్నుమూసిన నేపథ్యంలో ఈ చదువులు మాకొద్దని ఆ తల్లి అంటోంది. తన రెండో కొడుకును ఎంతమాత్రం చదివించనని చెప్తోంది.. ఇది హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ తల్లి రాధిక ఆవేదన. వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రోహిత్ తల్లిని, కుటుంబసభ్యులని పరామర్శించారు. ఈ సందర్భంగా రోహిత్ తల్లి రాధిక బోరున విలపిస్తూ తన గోడును జగన్‌ వద్ద విన్నవించారు.

రోహిత్ మృతికి హెచ్‌సీయూ వీసీనే కారణమని, ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆమె తెలిపారు. రోహిత్ సస్పెండ్ చేసినట్టు తమకు చెప్పలేదని, సస్పెండ్ చేశారని తెలిస్తే తాము అతన్ని ఇంటికి తెచ్చుకునేవాళ్లమన్నారు. కూలీపనులు చేస్తూ రోజుకు రూ. 150 తీసుకొచ్చి రోహిత్‌ను చదివించానని, కొడుకును సమాజంలో ఉన్నతస్థానంలో చూసుకోవాలనుకున్నానని తెలిపారు. తన కొడుకు పెద్దవాడు అవుతాడనుకుంటే శవమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం నుంచి బయటకు రావాలనే తాను కొడుకును చదివించానని, పుస్తకాలు కొనుక్కొనే స్థామత లేకపోవడంతో రోహిత్ లైబ్రరీలో చదువుకున్నాడని చెప్పారు.

తన కొడుకు డాక్టరేట్ చదువాలని కలలు కన్నానని, అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తెలిపారు. రోహిత్‌కు తానంటే ఎంతో ఇష్టమని, చెట్టంతా కొడుకు పోయాడని రోదిస్తూ ఆమె జగన్‌కు తెలిపారు. ఇక తన రెండో బిడ్డను చదివించబోనని, ఇలాంటి చదువులు మాకొద్దని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. తన రెండో కొడుకుకు ఏదైనా దారి చూపించాలని వేడుకున్నారు. తన తల్లి కడుపు మాడ్చుకొని తమకు అన్నం పెట్టి పెంచి పెద్ద చేసిందని రోహిత్ కుటుంబసభ్యులు జగన్‌కు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement