Union Minister M Venkaiah Naidu
-
'అది భస్మాసుర హస్తం.. మీకే డేంజర్'
-
'అది భస్మాసుర హస్తం.. మీకే డేంజర్'
హైదరాబాద్: పాకిస్థాన్‌లోని క్వెట్టాలో పోలీస్ అకాడమీపై ఉగ్రవాదులు దాడులు చేయడాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఖండించారు. 61మంది అమాయకులు బలయ్యారని అన్నారు. ఇప్పటికైనా పాకిస్థాన్ ఉగ్రవాదం విషయంలో వాస్తవాలు గ్రహించాలని, ఉగ్రవాదాన్ని దేశ విధానంగా కొనసాగించడం సాక్షాత్తు ఆత్మహత్యా సాదృశ్యమే అని చెప్పారు. 'ఉగ్రవాదం అనేది భస్మాసుర హస్తం. భస్మాసూరుడికి మీరు(పాక్) అవకాశం ఇస్తే చివరికి అది మిమ్మల్నే అంతం చేస్తుంది. మీరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే.. దాని బాధితులుగా మిగిలిపోతారు' అని వెంకయ్య హెచ్చరించారు. పాక్ ఉగ్రవాదాన్ని ఒక పాలసీగానే కాకుండా భారత్‌కు వ్యతిరేకంగా పెంచిపోషిస్తోందని అన్నారు. నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, పర్వేజ్ ముషార్రఫ్ ల మధ్య ఆగ్రా సమావేశం జరిగిందని, అందులో పాక్ తమ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతించదని హామీ ఇచ్చిందని, కానీ దానిని నిలబెట్టుకోవడంలో పాక్ విఫలమైందని మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం పాక్ నడుచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కన్నతల్లి, జన్మభూమిని మర్చిపోకూడదు
‘రామినేని’ పురస్కారాల్లో కేంద్ర మంత్రి వెంకయ్య వ్యాఖ్య హైదరాబాద్: కన్నతల్లి, జన్మభూమి, మాతృభాషలను ఎన్నటికీ మరిచిపోకూడదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇమేజ్ గార్డెన్స్‌లో డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పట్టుదల, కృషి ఉంటే ఎంతటి కష్టమైన పనినైనా సాధించవచ్చునని చెప్పారు. ఇలాంటి పురస్కారాల కార్యక్రమాలు కొత్త తరానికి ఉత్సాహం, ప్రేరణ కలిగిస్తాయన్నారు. మన దేశంలో పాముకు పాలు, చీమకు చక్కెర, చెట్టుకు బొట్టు పెట్టే గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయన్నారు. మన దేశంలో స్త్రీమూర్తిని లక్ష్మీదేవి, గంగా, యమున, సరస్వతి అంటూ ఉచ్ఛరిస్తామన్నారు. మోదీని మేకింగ్ డెవలపింగ్ ఇండియాగా అభివర్ణించారు. సంస్కృతి అంటే జీవన విధానం అని, మతం అంటే పూజా విధానం అని, అది వ్యక్తిగతమన్నారు. అనంతరం రక్షణ రంగం శాస్త్రవేత్త డాక్టర్ సతీశ్‌రెడ్డి, సినీనటి శారద, డాక్టర్ ఎం.గోపీచంద్, ప్రజాగాయకుడు గద్దర్‌కు అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ మురళీమోహన్, ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాస్‌రావు, ఫౌండేషన్ సభ్యుడు పీవీ రామచంద్రమూర్తి, డాక్టర్ పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు -
'ఆయన యూటర్న్ తీసుకున్నా మంచి టర్నే'
న్యూఢిల్లీ: ఆరెస్సెస్‌పై ఆరోపణల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు హాజరవడం మంచిదేనని, ఆయన యూటర్న్ తీసుకున్నా అది మంచి టర్నే అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలో ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు పనిచేసే దేశభక్తి నిండిన సంస్థ ఆరెస్సెస్ అని కొనియాడారు. నిస్వార్థంగా ఆరెస్సెస్ పనిచేస్తుందని చెప్పారు. రాహుల్ గాంధీపై మరోసారి వివేకమే గెలిచిందని చెప్పారు. మహాత్మ గాంధీ హత్యకు ఆరెస్సెస్ కారణం అని అంతకుముందు రాహుల్ గాంధీ ఆరోపించగా దానిపై ఆరెస్సెస్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే రాహుల్ కు ఉన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. ఈ నేపథ్యంలో కోర్టుకు హాజరైన రాహుల్ తాను అసలు ఆరెస్సెస్ పై ఆరోపణలు చేయలేదని వివరణ ఇచ్చారు. అయితే, ఆ సంస్థలో ఓ వ్యక్తికి ఈ హత్యకు మాత్రం సంబంధం ఉందని తాను అన్నానని కోర్టుకు చెప్పారు. మరోపక్క, తప్పును అంగీకరించి యూటర్న్ తీసుకున్న రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆరెస్సెస్ డిమాండ్ చేసింది. -
'నేతల్లారా.. హెచ్‌సీయూకి చెప్పులు వదిలి వెళ్లండి'
తిరువనంతపురం: విశ్వవిద్యాలయాల అంశాల్లో రాజకీయనాయకులెవరూ జోక్యం చేసుకోవద్దని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు పాల్పడిన అనంతరం జరుగుతున్న రాజకీయపరిణామాలపై ఆయన స్పందించారు. రాజకీయ నాయకులు వర్సిటీలోకి వెళ్లి ఇష్టమొచ్చినట్లు ప్రసంగాలు చేసి అక్కడి వాతావరణాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని చెప్పారు. నాయకులెవరూ విశ్వవిద్యాలయాల అంశాల్లో జోక్యం చేసుకోకూడదన్నదే తన సలహా అని చెప్పారు. యూనివర్సిటీని ప్రశాంతంగా వదిలేసి రాజకీయ నాయకులంతా వెనక్కి రావాలని విజ్ఞప్తి చేశారు. 'విశ్వవిద్యాలయం దేవాలయంలాంటిది. దేవాలయంలోకి వెళ్లేముందు చెప్పులు ఎలా వదిలి వెళతామో రాజకీయ నాయకులు కూడా యూనివర్సిటీ వెలుపలే రాజకీయాల చెప్పులు వదిలి వెళ్లాలి. మీరు అక్కడికి వెళితే సంతాపం తెలియజేయండి. అక్కడ పరిస్థితి ఏమిటో శ్రద్ధగా గమనించండి. ఎవరు నిజంగా ఆందోళన చెందుతున్నారో వారికి భరోసా ఇవ్వండి.. అంతేగానీ రాజకీయ ప్రసంగాలు చేయొద్దు. వర్సిటీ వాతావరణాన్ని కలుషితం చేసేలాగా ఈపార్టీ ఆ పార్టీ అంటూ ఆరోపణలకు దిగవద్దు' అంటూ వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అంతకు ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్ సీయూకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్‌కు సంతాపం వ్యక్తం చేసి విద్యార్థులతో మాట్లాడి వెళ్లిన నేపథ్యంలో ఆయన వెంకయ్యమాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. పిటిషన్ రూపంలో వచ్చిన ఓ లేఖనే దత్తాత్రేయ మానవ వనరులశాఖకు పంపించారని, ఆ లేఖే తిరిగి వీసీకి వెళ్లిందని ఆయన చెప్పారు.