'ఆయన యూటర్న్ తీసుకున్నా మంచి టర్నే'
న్యూఢిల్లీ: ఆరెస్సెస్పై ఆరోపణల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు హాజరవడం మంచిదేనని, ఆయన యూటర్న్ తీసుకున్నా అది మంచి టర్నే అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలో ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు పనిచేసే దేశభక్తి నిండిన సంస్థ ఆరెస్సెస్ అని కొనియాడారు. నిస్వార్థంగా ఆరెస్సెస్ పనిచేస్తుందని చెప్పారు. రాహుల్ గాంధీపై మరోసారి వివేకమే గెలిచిందని చెప్పారు.
మహాత్మ గాంధీ హత్యకు ఆరెస్సెస్ కారణం అని అంతకుముందు రాహుల్ గాంధీ ఆరోపించగా దానిపై ఆరెస్సెస్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే రాహుల్ కు ఉన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. ఈ నేపథ్యంలో కోర్టుకు హాజరైన రాహుల్ తాను అసలు ఆరెస్సెస్ పై ఆరోపణలు చేయలేదని వివరణ ఇచ్చారు. అయితే, ఆ సంస్థలో ఓ వ్యక్తికి ఈ హత్యకు మాత్రం సంబంధం ఉందని తాను అన్నానని కోర్టుకు చెప్పారు. మరోపక్క, తప్పును అంగీకరించి యూటర్న్ తీసుకున్న రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆరెస్సెస్ డిమాండ్ చేసింది.