కన్నతల్లి, జన్మభూమిని మర్చిపోకూడదు
‘రామినేని’ పురస్కారాల్లో కేంద్ర మంత్రి వెంకయ్య వ్యాఖ్య
హైదరాబాద్: కన్నతల్లి, జన్మభూమి, మాతృభాషలను ఎన్నటికీ మరిచిపోకూడదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇమేజ్ గార్డెన్స్‌లో డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పట్టుదల, కృషి ఉంటే ఎంతటి కష్టమైన పనినైనా సాధించవచ్చునని చెప్పారు. ఇలాంటి పురస్కారాల కార్యక్రమాలు కొత్త తరానికి ఉత్సాహం, ప్రేరణ కలిగిస్తాయన్నారు.
మన దేశంలో పాముకు పాలు, చీమకు చక్కెర, చెట్టుకు బొట్టు పెట్టే గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయన్నారు. మన దేశంలో స్త్రీమూర్తిని లక్ష్మీదేవి, గంగా, యమున, సరస్వతి అంటూ ఉచ్ఛరిస్తామన్నారు. మోదీని మేకింగ్ డెవలపింగ్ ఇండియాగా అభివర్ణించారు. సంస్కృతి అంటే జీవన విధానం అని, మతం అంటే పూజా విధానం అని, అది వ్యక్తిగతమన్నారు.
అనంతరం రక్షణ రంగం శాస్త్రవేత్త డాక్టర్ సతీశ్‌రెడ్డి, సినీనటి శారద, డాక్టర్ ఎం.గోపీచంద్, ప్రజాగాయకుడు గద్దర్‌కు అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ మురళీమోహన్, ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాస్‌రావు, ఫౌండేషన్ సభ్యుడు పీవీ రామచంద్రమూర్తి, డాక్టర్ పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు