శుక్రవారం వారణాసిలో బహిరంగ సభ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ
వారణాసి: భారత్ వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి నమూనా(మోడల్)గా మారడం ఖాయమని, ఇది ‘మోదీ గ్యారంటీ’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆయన గురువారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గం వారణాసికి చేరుకున్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో ‘సంసద్ సంస్కృత్ ప్రతియోగితా’ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించారు.
ప్రపంచవ్యాప్తంగా వారసత్వం, అభివృద్ధికి కాశీ నగరం ఒక మోడల్‌గా కనిపిస్తోందని, సంస్కృతి, సంప్రదాయం చుట్టూ ఆధునిక అభివృద్ధిని ప్రపంచం వీక్షిస్తోందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో మన దేశం అభివృద్ధికి మోడల్‌గా మారుతుందని చెప్పారు. భారతీయ సుసంపన్న ప్రాచీన వారసత్వం గురించి ప్రపంచమంతటా చర్చించుకుంటున్నారని తెలిపారు. కాశీ సంసద్ జ్ఞాన్ ప్రతియోగితా, కాశీ సంసద్ ఫొటోగ్రఫీ ప్రతియోగితా, కాశీ సంసద్ సంస్కృత్ ప్రతియోగితా అవార్డులను నరేంద్ర మోదీ విజేతలకు అందజేశారు.
అనంతరం రూ.13,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాను గత పదేళ్లుగా ఇక్కడి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నానని, వారణాసి తనను బనారసిగా మార్చిందని అన్నారు. వారణాసి యువతను కొందరు కాంగ్రెస్ నేతలు నషేరీ(మత్తులో మునిగిపోయినవారు) అని దూషిస్తున్నారని పరోక్షంగా రాహుల్ గాం«దీపై మోదీ మండిపడ్డారు.
నిజంగా స్పృహలో ఉన్నవారు అలా మాట్లాడరని చెప్పారు. గత 20 ఏళ్ల పాటు తనను తిట్టారని, ఇప్పుడు యువతపై ఆక్రోశం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. అయోధ్య, కాశీని అభివృద్ధి చేయడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదన్నారు. అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట జరిగినప్పుడు వారు ఏం మాట్లాడారో గుర్తుచేసుకోవాలని ప్రజలను కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి వారణాసి రోడ్లపై నడుస్తూ తనిఖీ చేశారు.
ప్రజలను విపక్షాలు కులాల పేరిట రెచ్చగొడుతున్నాయ్
విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. విపక్షాలు కులాల పేరిట ప్రజలను రెచ్చగొడుతున్నాయని, గొడవలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. దళితులు, గిరిజనులు ఉన్నత పదవులు చేపడితే విపక్ష నాయకులు సహించలేకపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి పదవికి గిరిజన మహిళ ద్రౌపది ముర్మును తాము పోటీకి దింపితే ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వలేదని, ఆమెను ఓడించేందుకు ప్రయతి్నంచాయని గుర్తుచేశారు.
దళితులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకొచి్చన పథకాలను విపక్షాలు వ్యతిరేకించాయని చెప్పారు. వారణాసిలో శుక్రవారం సంత్ రవిదాస్ 647వ జయంతి వేడుకల్లో మోదీ మాట్లాడారు. ప్రతి శకంలో యోగులు ప్రజలకు దారి చూపారని, తప్పుడు మార్గంలో నడవకుండా అప్రమత్తం చేశారని చెప్పారు. కులం పేరిట ఎవరైనా వివక్ష చూపితే అది మానవత్వంపై చేసిన దాడి అవుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment