వారణాసి క్రికెట్‌ స్టేడియం ఆ మహాదేవుడికే అంకితం: ప్రధాని మోదీ | Prime Minister Narendra Modi Lays Foundation Stone Of Varanasi International Cricket Stadium - Sakshi
Sakshi News home page

Varanasi International Cricket Stadium: ఈ స్టేడియం ఆ మహాదేవుడికే అంకితం: ప్రధాని మోదీ

Published Sat, Sep 23 2023 2:13 PM | Last Updated on Sat, Sep 23 2023 3:59 PM

PM Modi Lays Foundation Stone Of Varanasi International Cricket Stadium - Sakshi

Varanasi International Cricket Stadium Foundation Ceremony Highlights: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, టీమిండియా దిగ్గజాలు కపిల్‌ దేవ్‌, సునిల్‌ గావస్కర్‌, సచిన్‌ టెండుల్కర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జై షా తదితరులు కూడా హాజరయ్యారు.

సంతోషంగా ఉంది: యూపీ సీఎం
కాగా సుమారు రూ. 451 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ స్టేడియం నిర్మాణం.. 2025, డిసెంబరు నాటికి పూర్తికానున్నట్లు సమాచారం. ఇక శంకుస్థాపన సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ..

బీసీసీఐ తొలిసారిగా ఆధ్యాత్మిక నగరం వారణాసిలో అంతర్జాతీయస్థాయి క్రికెట్‌ స్టేడియం నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కాశీకి విచ్చేసిన ప్రధాని మోదీ సహా క్రికెట్‌ ప్రముఖులకు క్రీడా ఔత్సాహికుల అందరి తరఫున తాను స్వాగతం పలుకుతున్నానని పేర్కొన్నారు.

బీసీసీఐ, మోదీజీకి ధన్యవాదాలు
అదే విధంగా.. కేంద్ర ప్రభుత్వ పథకం స్మార్ట్‌ సిటీ మిషన్‌ కింద స్టేడియం నిర్మాణం చేపట్టారని.. ఉత్తరప్రదేశ్‌లో ఇది మూడో అంతర్జాతీయ స్టేడియం అని యోగి పేర్కొన్నారు. బీసీసీఐ పర్యవేక్షణలో దీని నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. యూపీతో పాటు బిహార్‌లో గల వర్ధమాన క్రికెటర్లకు ఈ స్టేడియం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూపీకి ఇంత గొప్ప బహుమతి ఇచ్చిన బీసీసీఐ, ప్రధాని నరేంద్ర మోదీకి యోగి ఆదిత్యనాథ్‌ ధన్యవాదాలు తెలిపారు.

ఆ మహదేవుడికే అంకితం: ప్రధాని మోదీ
వారణాసి స్టేడియం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘మహదేవుడి నగరంలో నిర్మిస్తున్న ఈ స్టేడియం ఆ మహదేవుడికే అంకితం. కాశీలో ఉన్న క్రికెట్‌ ఔత్సాహికులకు ఈ స్టేడియం ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్వాంచల్‌ ప్రాంతం మొత్తానికి తారలా వెలుగొందుతుంది’’ అని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసియా క్రీడలు-2023లో పాల్గొంటున్న భారత అథ్లెట్లు, క్రీడా జట్లకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. 

శివతత్వం ఉట్టిపడేలా
చారిత్రాత్మక నగరంలో నిర్మించతలపెట్టిన వారణాసి క్రికెట్‌ స్టేడియాన్ని శివతత్వం ఉట్టిపడేలా.. ప్రేక్షకులు ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయేలా రూపొందించనున్నారు. సీటింగ్‌ ప్లేస్‌ పైకప్పు అర్ధచంద్రాకారం, ఫ్లడ్‌లైట్లు త్రిశూలం, ఓవైపు ఎంట్రన్స్‌ ఢమరుకాన్ని పోలి ఉండేలా నిర్మాణాలు చేపట్టనున్నారు.

సుమారు 30 వేల మంది సీటింగ్‌ కెపాసిటీతో నిర్మించనున్న ఈ స్టేడియం కోసం యూపీ ‍ ప్రభుత్వం సుమారు 121 కోట్లు వెచ్చించి భూమి సేకరించినట్లు సమాచారం. ఇందులో ఏడు పిచ్‌లను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది.

చదవండి: శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన ఘనత.. సచిన్‌ ఆల్‌ టైమ్‌ రికార్డు బద్దలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement