భద్రాచలం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ ఆరోపించారు.
ఖమ్మం జిల్లా భద్రాచలంలో శనివారం గిరిజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక్కరోజు రోహిత్ జాగృతి దీక్షలో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీసీ అప్పారావుకు పదేళ్ల క్రితమే దళిత విద్యార్థులను వేధించిన చరిత్ర ఉందన్నారు. మరోసారి దళిత విద్యార్థులను యూనివర్సిటీ నుంచి బహిష్కరించి, రోహిత్ మరణానికి కారణమయ్యారన్నారు.
కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరాని పదేపదే యూనివర్సిటీ అధికారులపై ఒత్తిడి తెచ్చి దళిత విద్యార్థులను బహిష్కరించి రోహిత్ చనిపోయే దాకా వేధించారని కృష్ణ అన్నారు. కేంద్ర మంత్రులిద్దరినీ బర్తరఫ్ చేయాలన్నారు. వీసీ అప్పారావును ఉద్యోగం నుంచి తొలగించి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సోందె వీరయ్య, ముర్రం వీరభద్రం, సోడె చలపతి తదితరులు పాల్గొన్నారు.