నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేసిన హెచ్‌సీయూ పాలక మండలి
పాలనా పదవుల నుంచి తప్పుకున్న 13 మంది
ఎస్సీ, ఎస్టీ ప్రొఫెసర్లు.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై మండిపాటు.. విద్యార్థులకు సంఘీభావం
ఐదోరోజూ ఆందోళనలతో అట్టుడికిన యూనివర్సిటీ
రెండోరోజుకు చేరుకున్న విద్యార్థుల ఆమరణ దీక్ష
రోహిత్ కుటుంబానికి 5 కోట్ల పరిహారమివ్వాలని డిమాండ్
విద్యార్థులకు మద్దతు ప్రకటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం, డి.రాజా
సాధారణ పరిస్థితులు నెలకొనేలా సహకరించండి: వీసీ
సాక్షి, హైదరాబాద్: రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) వెనక్కి తగ్గింది. రోహిత్‌తోపాటు మరో నలుగురు విద్యార్థులపై గతంలో విధించిన సస్పెన్షన్‌ను వర్సిటీ పాలక మండలి ఎత్తివేసింది. గురువారం అత్యవసరంగా సమావేశమైన పాలక మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే విద్యార్థులు మాత్రం శాంతించలేదు. తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైనవారిని శిక్షించాలని, వర్సిటీ వైస్ చాన్స్‌లర్ తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటివరకూ తమ పోరు ఆగబోదని తేల్చిచెప్పారు. తమ ఆందోళనలకు మద్దతుగా దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఈ నెల 25న హెచ్‌సీయూకు తరలిరానున్నారని వెల్లడించారు. మరోవైపు విద్యార్థులకు సంఘీభావంగా వర్సిటీలో ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన 13 మంది ప్రొఫెసర్లు పాలనాపరమైన పదవుల నుంచి తప్పుకున్నారు.
ఉధృతంగా ఆందోళన: రోహిత్ ఆత్మహత్యకు కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వర్సిటీలో ఐదోరోజూ ఆందోళనలు న్నంటాయి. వర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్ చేపట్టిన ఆమరణ
నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. గురువారం వివిధ రాజకీయ పక్షాల ముఖ్య నేతలు వర్సిటీకి వచ్చి వారికి మద్దతు ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేత డి.రాజా, మాజీ ఎంపీ అజీజ్ పాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌రావు, డాక్టర్ చెరకు సుధాకర్, ప్రజాకవి గద్దర్ తదితరులు వారిలో ఉన్నారు. వివిధ వర్సిటీలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా పెద్దఎత్తున వర్సిటీకి తరలివ చ్చి ఆందోళనలో పాలుపంచుకున్నారు.
వర్సిటీ పాలక మండలి సస్పెన్షన్‌ను ఎత్తివేయడంపై విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. సస్పెన్షన్ ఎత్తివేస్తూ మండలి వెలువరించిన పత్రాలను దహనం చేశారు. ‘‘ఇది సరిపోదు. వీసీ తప్పుకోవాలి. సస్పెన్షన్ ఎత్తివేత ఆహ్వానించదగ్గదే. కానీ ఈ సస్పెన్షన్ వల్లే మేం రోహిత్ ను కోల్పోయాం. అందుకే మీ నిర్ణయాన్ని అంగీకరించడం లేదు. రోహిత్ కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం అందించాలి. అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలి’’ అని రోహిత్‌తోపాటు సస్పెన్షన్‌కు గురైన విజయ్ కుమార్ స్పష్టంచేశారు.
స్మృతి వ్యాఖ్యలపై దళిత ప్రొఫెసర్ల మండిపాటు
ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్‌పై నిర్ణయం తీసుకున్న పాలక మండలి సబ్ కమిటీకి దళిత ప్రొఫెసర్ నేతృత్వం వహించారన్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలపైపై వర్సిటీలోని దళిత ప్రొఫెసర్లు మండిపడ్డారు. ఆ కమిటీకి వాస్తవానికి అగ్రవర్ణానికి చెందిన ప్రొఫెసర్ విపిన్ శ్రీవాస్తవ నేతృత్వం వహించగా, మంత్రి అవాస్తవాలు చెప్పారంటూ దుయ్యబట్టారు. ‘‘ఇలాంటి నిరాధార, అవాస్తవ ప్రకటన మంత్రి నుంచి రావడం దురదృష్టకరం. ఇది ఇక్కడ, వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న దళిత ప్రొఫెసర్ల స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. మంత్రి అవాస్తవ ప్రకటన చేసినందున మేం పాలనాపరమైన పదవుల నుంచి తప్పుకుంటున్నాం’’ అంటూ ఎస్సీ, ఎస్టీ ఫ్యాకల్టీ సభ్యుల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. వాస్తవాలు ఇలా ఉంటే రోహిత్ మృతికి కారణమైన తనను, తన సహచర కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను వెనకేసుకురావడానికి స్మృతి ఇరానీ ప్రయత్నించారని ప్రకటనలో దుయ్యబట్టారు. హెచ్‌సీయూలో ఇప్పటివరకు పాలక మండలిలో దళిత ప్రొఫెసర్‌కు ప్రాతినిధ్యమే లేదని ఫ్యాకల్టీ సభ్యుడొకరు తెపారు. వర్సిటీలో ఫ్యాకల్టీ, ఇతర విభాగాల్లో ఎస్టీ, ఎస్టీకి చెందిన దాదాపు 50 మంది విధులు నిర్వర్తిస్తున్నారు.
మిగతా డిమాండ్లనూ పరిశీలిస్తాం
సస్పెన్షన్ ఎత్తివేత మొదటి చర్య మాత్రమేనని విద్యార్థుల మిగతా డిమాండ్లను పరిశీలిస్తామని యూనివర్సిటీ డీన్(స్టూడెంట్ వెల్ఫేర్) ప్రకాశ్ బాబు చెప్పారు. విద్యార్థి సంఘాల జేఏసీని వీసీ కలిసి, వారితో మాట్లాడతారని పేర్కొన్నారు. విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టిందని ఆయన్ను ప్రశ్నించగా.. ‘‘ఈ అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. సస్పెన్షన్ ఎత్తివేతపై లాయర్లను సంప్రదించినా సంక్రాంతి సెలవుల కారణంగా వారి అభిప్రాయం అందడంలో ఆలస్యమైంది. అంతలోనే దురదృష్టకరమైన ఘటన(రోహిత్ ఆత్మహత్య) చోటుచేసుకుంది. ఈ రోజే న్యాయ సలహా అందింది. ఆ వెంటనే పాలక మండలి నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది’’ అని ఆయన వివరించారు.
పరిస్థితులు చక్కబడేందుకు సహకరించండి: వీసీ
హెచ్‌సీయూలో పరిస్థితులు చక్కబడేందుకు అందరూ సహకరించాలని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ అప్పారావు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. వర్సిటీలోని అంతర్గత వ్యవస్థలపై నమ్మకం ఉంచాలని, సమస్యల పరిష్కారానికి అనువైన పరిస్థితులు ఏర్పడేలా చూడాలని కోరారు.
సస్పెన్షన్ ఎత్తివేత
Published Fri, Jan 22 2016 2:53 AM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM
Advertisement
Advertisement