'ఇది సిరియానా.. పాకిస్థానా? మాకెందుకు చెప్పరు?'
తిరువనంతపురం: హెచ్సీయూలో జరుగుతున్న సంఘటనలపట్ల కేరళలో అసంతృప్తి చెలరేగింది. తమ కుమారుడిని అరెస్టుల చేసి కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని హెచ్సీయూలో చదువుతున్న ఓ విద్యార్థి తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మనమేం సిరియాలో ఉండటం లేదు. పాకిస్థాన్లో ఉండటం లేదు. అరెస్టు చేసినప్పుడు ఆ సమాచారం తల్లిదండ్రులు తెలియజేయడం పోలీసుల కనీస బాధ్యత' అని ఆమె పేర్కొంది. రోహిత్ ఆత్మహత్య ఘటన తర్వాత హెచ్సీయూలో రోజుకో పరిణామం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ వారం ప్రారంభంలో హెచ్సీయూలో పాలక వర్గంపై నిరసనగా ధర్నా చేస్తున్న విద్యార్థుల్లో దాదాపు 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అందులో తమ కుమారుడు కూడా ఉన్నాడని సోషల్ మీడియా ద్వారా తెలిసిందని, పోలీసులు ఉండి కూడా తమకు ఈవిధంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. తమకు అధికారికంగా చెప్పకూడదా అంటూ ఏడ్చేశారు. పోలీసులుగానీ, యూనివర్సిటీ అధికారులు గానీ తమకు సమాచారం ఇవ్వలేదని వాపోయారు. గత మంగళవారం మాట్లాడిన తమ కుమారుడు ఇప్పటి వరకు ఏమై పోయాడో తెలియలేదని, ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుందని, తల్లిదండ్రులుగా తామెంత ఆందోళన చెంది ఉంటామో అర్థం చేసుకోలేరా అని ఆమె ప్రశ్నించారు. ఇదేం, సిరియా, పాకిస్థాన్ కాదుగా అని నిలదీశారు.