రోహిత్‌ది రాజకీయ హత్యే: సురవరం
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి వేముల రోహిత్‌ది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని... అందుకే రాజకీయం చేస్తున్నామని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాక ర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయల చర్యల కారణంగానే రోహిత్ చనిపోయారన్నారు. గురువారం సురవరం నేతృత్వంలో సీపీఐ నేతలు రాజ్యసభ ఎంపీ డి.రాజా, చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్‌పాష తదితరులు హెచ్‌సీయూను సందర్శించి, విద్యార్థులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ, ఏబీవీపీ తీరును సురవరం ఎండగట్టారు. యూకుబ్ మెమన్ ఉరిపై దేశవ్యాప్తంగా ఎవరి అభిప్రాయాలు వారు బహిరంగంగానే తెలిపారని... అలాంటి వారిపై బీజేపీ కావాలనే దుష్ర్పచారం చేస్తోందని దుయ్యబట్టారు. బాబ్రీ మసీదు విషయంలో బీజేపీ చేసిన వ్యవహారమేమిటని ప్రశ్నించారు.
రోహిత్ విషయంలో పదే పదే కేంద్రమంత్రులు లేఖలు రాయడమంటే ప్రత్యక్షంగా కల్పించుకున్నట్లు కాదా అని సురవరం నిలదీశారు. స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలతో పాటు వర్సిటీ వీసీ అప్పారావును వెంటనే పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే ఎవరు ఏం చేయాలో, పుస్తకాలలో ఏం ఉండాలో చెప్పడంతో పాటు ఆఖరికి వంటింట్లో ఏం వండాలో కూడా వారే నిర్ణయించేస్తున్నారని మండిపడ్డారు. కాలేజీ మెట్లు కూడా ఎక్కని స్మృతి ఇరానీ కేంద్ర మానవ వనరుల మంత్రిగా కొనసాగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రోహిత్ ఆత్మహత్య అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని రాజ్యసభ సభ్యుడు డి.రాజా చెప్పారు.