సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్‌లో పాల్గొంటున్న ఆ పార్టీ శ్రేణులను టీడీపీ ప్రభుత్వం పోలీసుల చేత అరెస్ట్ చేయించడాన్ని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తప్పుపట్టారు. ఢిల్లీలో సాక్షి టీవీతో మాట్లాడుతూ.. గతంలోనూ ప్రత్యేక హోదాపై నిర్వహించిన బంద్‌లను టీడీపీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ఇచ్చిన బంద్‌లను అడ్డుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంద్‌ను అణచివేయకూడదని, అరెస్ట్‌లు చేయకూడదన్నారు.
గతంలో ప్రత్యేక ప్యాకేజీ వస్తే చాలని చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేశారని, కానీ ఎన్నికలు వస్తున్నాయని గ్రహించి ప్రత్యేక హోదాపై ప్రజల్లో ఉన్న తీవ్రమైన డిమాండ్‌ను చూసి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై వైఎస్సార్ కాంగ్రెస్, వామపక్షాల నిరంతర ఆందోళనతో ప్రజా మద్ధతు పెరుగుతోందని.. దీంతో చంద్రబాబు ఆందోళనలో పడ్డారని అన్నారు. రాజీనామాలు ఆయా పార్టీల సొంత నిర్ణయమని వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో వైఎస్సార్ సీపీ ఉంటే మరింత బాగుండేదన్నారు.
ప్రధానమంత్రి జవాబు అసంతృప్తికరంగా ఉందని, ఏపీపై సానుకూలత ఆయన ప్రసంగంలో వ్యక్తం కాలేదని.. అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. రాష్ట్ర విభజన మోదీకి ఇష్టం లేనట్లు తెలుస్తోందని, విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరిగింది.. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. పార్లమెంటులో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలన్నారు. ప్రతిపక్షాల మద్దుతు కూడగట్టి పోరాటం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని వివరించారు.
ఏపీలో నూటికి 90 మంది ప్రత్యేక కోరుకుంటున్నారని వెల్లడించారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓట్ల కోసం ఇప్పుడు మళ్లీ ప్రత్యేక హోదా అంటున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా సంజీవని కాదన్నదీ బాబే.. హోదాపై యూటర్న్ తీసుకున్నదీ బాబేనని చెప్పారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ప్రధాని మోదీ లోక్‌సభలో అన్న మాట నిజమేనని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చింది చంద్రబాబే కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరినీ కలుపుకుని పోరాటం చేయాలని చంద్రబాబుకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment