హెచ్‌సీయూలో రాహుల్ దీక్ష | Rahul strike in HCU | Sakshi
Sakshi News home page

హెచ్‌సీయూలో రాహుల్ దీక్ష

Published Sat, Jan 30 2016 3:06 AM | Last Updated on Sun, Sep 3 2017 4:34 PM

హెచ్‌సీయూలో రాహుల్ దీక్ష

హెచ్‌సీయూలో రాహుల్ దీక్ష

♦ విద్యార్థులకు మద్దతుగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం
♦ మధ్యాహ్నం వరకు దీక్షలో రాహుల్...
♦ హెచ్‌సీయూలో కొవ్వొత్తుల ర్యాలీ
 
 సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూలో విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్షకు సంఘీభావంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దీక్షలో కూర్చున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హెచ్‌సీయూకు చేరుకున్న ఆయన రోహిత్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. రోహిత్ తల్లి రాధికను, సోదరుడు, సోదరిలను పరామర్శించి దీక్ష ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నం వరకూ దీక్ష కొనసాగనుంది. అంతకుముందు రోహిత్‌కు నివాళిగా వర్సిటీలో విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రోహిత్ కుటుంబ సభ్యులు, సహచర విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 రాహుల్‌గాంధీ శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. హెచ్‌సీయూలో విద్యార్థులు ఆందోళన చేస్తున్న వెలివాడ ప్రాంగణానికి చేరుకొని రోహిత్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడే ఉన్న రోహిత్ తల్లి రాధిక, సోదరుడు, సోదరిలతో మాట్లాడారు. సస్పెండైన విద్యార్థులు విజయ్, శేషయ్య, సుంకన్నతో పాటు విశాల్‌లు కూర్చున్న ఆమరణ దీక్ష శిబిరానికి చేరుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ తదితరులు ఉన్నారు. అయితే రాహుల్‌గాంధీ యూనివర్సిటీల్లో శవ రాజకీయాలు చేస్తున్నారంటూ ఏబీవీపీ కార్యకర్తలు హెచ్‌సీయూ గేటు వద్ద ఆందోళన చేశారు. వారు రాహుల్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించగా... పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

 ఆందోళనలు ఉధృతం
 ఇక హెచ్‌సీయూలో విద్యార్థులు తమ నిరసనలను మరింత ఉధృతం చేశారు. శుక్రవారం వర్సిటీలోని పరిపాలనా విభాగాన్ని ముట్టడించారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారందరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిపాలనా విభాగంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బోధనేతర సిబ్బందిని అడ్డుకున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పరిపాలనా కార్యాలయం గేట్లను మూసివేసి నిరసనలు తెలిపారు. విద్యార్థులకు మద్దతుగా రెండో రోజు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ముగ్గురు అధ్యాపకులు పాల్గొన్నారు.

 సెలవుపై వెళ్లిన ఇన్‌చార్జి వీసీ
 ఇన్‌చార్జి వీసీ పదవి నుంచి విపిన్ శ్రీవాస్తవ వైదొలగాల్సిందేనని విద్యార్థులు భీష్మించడం, ఆందోళనలు ఉధృతం చేయడంతో.. శ్రీవాస్తవ సెలవుపై వెళ్లారు. శ్రీవాస్తవ నాలుగు రోజులపాటు సెలవుపై వెళుతున్నారని, ఆయన స్థానంలో వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలను స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ డీన్ ఎం.పెరియస్వామి స్వీకరిస్తారని వర్సిటీ వర్గాలు ప్రకటించాయి. అసలు తన తల్లి అనారోగ్యం కారణంగా ఇన్‌చార్జి వీసీ శ్రీవాస్తవ నాలుగు రోజుల పాటు సెలవు తీసుకోనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ చెప్పారు. ఆయన తర్వాత సీనియర్ అయిన తమిళనాడుకు చెందిన కెమిస్ట్రీ అధ్యాపకుడు పెరియస్వామికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు అందేవరకు ఆయన ఇన్‌చార్జి వీసీగా కొనసాగుతారని తెలిపారు.

 సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి యత్నం
 రోహిత్ ఆత్మహత్యకు కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్థి నాయకులు సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు. ఓయూ విద్యార్థి జేఏసీ ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో వామపక్ష, దళిత విద్యార్థి సంఘాలు క్యాంపస్‌లోని ఆర్ట్స్ కళాశాల నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. వారిని పోలీసులు నిలువరించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పలువురు విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఏఐఎస్‌ఎఫ్ ఓయూ నాయకులు సీఎం క్యాంపు ఆఫీసును ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అరెస్ట్ చేసి పంజగుట్ట పీఎస్‌కు తరలించారు.

 కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు
 హెచ్‌సీయూకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రావడానికి నిరసనగా శనివారం రాష్ట్రవాప్తంగా కళాశాలల బంద్‌కు ఏబీవీపీ రాష్ట్ర విభాగం పిలుపునిచ్చింది. రాహుల్ రాకకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలలతోపాటు వర్సిటీల బంద్ చేపడుతున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ చెన్నకృష్ణారెడ్డి చెప్పారు.
 
 సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: నారాయణ
 హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై రిటైర్డ్ జడ్జితో వేసిన ఏకసభ్య కమిషన్‌తో కాకుండా... సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. రిటైర్డ్ జడ్జి విచారణలో రోహిత్‌కు న్యాయం జరగదని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలు పదవిలో ఉండగా రోహిత్ ఆత్మహత్యపై నిష్పక్షపాత విచారణ జరగదని... అందుకే వారు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
 
 నేడు రోహిత్ విగ్రహావిష్కరణ
 రోహిత్ పుట్టినరోజును పురస్క రించుకుని శనివారం (30వ తేదీన) హెచ్‌సీయూలో ఆయన విగ్రహాన్ని ఆవిష్క రించాలని విద్యార్థి జేఏసీ నాయకులు నిర్ణయించారు. కేరళ ఫైన్‌ఆర్ట్స్ విద్యార్థులు అనిల్, సందీప్‌లు రోహిత్ విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement