వర్సిటీ ప్రధాన గేటు వద్ద వాటర్ బాటిళ్లతో నిరసన తెలుపుతున్న విద్యార్థినులు
నిర్మల్/బాసర: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన మూడోరోజు గురువారం కూడా కొనసాగింది. తమ డిమాండ్లను నెర వేర్చుకునేదాకా వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు. వర్సిటీ ప్రధాన గేటువద్ద ఉదయం 9 గంటలకే బైఠాయించారు. ప్లకార్డులు పట్టుకుని మౌనదీక్ష కొన సాగించారు. మధ్యాహ్నం ఆర్జీయూకేటీ డైరెక్టర్‌గా ఓయూ ప్రొఫెసర్ డా.సతీశ్‌కుమార్‌ను నియమించినా ఆందోళన విరమించలేదు. మరోవైపు వర్సిటీ ప్రధాన ద్వారం వద్దకు ఏ ఒక్కరూ వెళ్లడానికి వీల్లేకుండా పోలీసులు బందోబస్తు పెంచారు.
మౌనంగా.. దృఢంగా..
గురువారం ఉదయమే విద్యార్థులు ఒక్కొక్కరుగా వర్సిటీ ప్రధాన ద్వారం వద్దకు వచ్చారు. చేతుల్లో తమ డిమాండ్లు, మంత్రుల వ్యాఖ్యలు ఉన్న ప్లకార్డులు పట్టుకుని బైఠాయించారు. రోజంతా మౌనంగానే ఆందోళన సాగించారు. చర్చలు సఫలమయ్యాయని బుధవారం కలెక్టర్ ముషరఫ్ అలీ ప్రకటించినా విద్యార్థులు మాత్రం తమ డిమాండ్లన్నీ తీరేదాకా ఆందోళన కొనసాగిస్తామన్నారు.
మూడంచెల కట్టడి..
ట్రిపుల్ ఐటీ గురువారం బందీఖానాను తలపించింది. పోలీసులు మూడంచెల కట్టడి ఏర్పాటు చేశారు. ఆర్జీయూకేటీ భద్రతా సిబ్బందినీ మోహరించారు. విద్యార్థులను గేటు దాటనివ్వలేదు. బయట నుంచి ఏ ఒక్కరినీ అనుమతించలేదు.
ఇదేం ఘోరం: నారాయణ
విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఏఐఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వర్సిటీ వద్దకు వచ్చారు. ప్రధాన గేటు వైపు వస్తుండగానే పోలీసులు అరెస్టు చేసి బాసర స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల విషయంలో ప్రభుత్వం ఘోరంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
పరిష్కారానికి ప్రయత్నిస్తా
మీడియాను క్యాంపస్‌లోకి అనుమతించక పోవడంతో విద్యార్థులు ట్విట్టర్ ద్వారా ఎప్పటి కప్పుడు సమాచారాన్ని బయటకు వెల్లడిస్తున్నారు. తమ సమ స్యలపై గవర్నర్, సీఎంఓ, కేటీఆర్, ప్రతి పక్ష నేతలను ఉద్దేశించి వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. కాగా గవర్నర్ తమిళిసై స్పందించారు. విద్యార్థులు వర్షంలోనూ ఆందోళన చేయడం గుర్తించానని, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నా రు. మీ సమస్య పరిష్కారానికి సంబం ధిత విభాగాలకు పంపిస్తానని తెలిపారు.
డైరెక్టర్‌గా సతీశ్‌కుమార్ బాధ్యతలు
విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఆర్జీయూ కేటీ డైరెక్టర్‌గా డాక్టర్ పెద్దపల్లి సతీశ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓయూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్‌గా ఉన్న సతీశ్‌కుమార్ గురువారం సాయంత్రం బాసర చేరుకుని బాధ్యతలు చేపట్టారు.
ఉద్యమంలో విద్యార్థుల పాత్రను మరిచారా?
కేసీఆర్ సర్కారుపై ట్విట్టర్‌లో రాహుల్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లు సిల్లీగా ఉన్నాయనడం తెలంగాణ భవిష్యత్ పట్ల కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న లెక్కలేనితనానికి నిదర్శనమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్రని సీఎం కేసీఆర్ మరిచిపోయారా’ అని ట్విట్టర్ వేదికగా గురువారం ప్రశ్నించారు. విద్యార్థుల శక్తిసామర్థ్యాలను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. బాసర ట్రిపుల్ ఐటీని బాగుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment